- Home
- National
- FASTag : మీ టోల్ ఛార్జీని రూ.100 నుండి కేవలం రూ.15 కి తగ్గించుకోవచ్చు... ఎలాగో తెలుసా?
FASTag : మీ టోల్ ఛార్జీని రూ.100 నుండి కేవలం రూ.15 కి తగ్గించుకోవచ్చు... ఎలాగో తెలుసా?
వాహనదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం హైవేలపై ఎక్కువగా తిరిగేవారి ప్రయాణ ఖర్చులను భారీగాా తగ్గించే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రూ.100 ఖర్చు అవుతుంటే కేంద్రం నిర్ణయంతో రూ.15 కు ఆ ఖర్చు తగ్గనుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

ఆగస్ట్ 15 నుండి యానువల్ టోల్ పాస్
FASTag : కుటుంబంతో లేదంటే స్నేహితులతో కలిసి సొంత వాహనంలో టూర్, లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసినా... దూరప్రాంతంలో బంధువుల ఇంట శుభకార్యానికి వెళుతున్నా ముందుగా బడ్జెట్ లెక్కేస్తాం. ఇందులో దారిఖర్చులు, పెట్రోల్ తో పాటు టోల్ ఛార్జీలు కూడా ఉంటాయి. ఒక్కోసారి టోల్ ఖర్చులను చూస్తే భయమేస్తుంది... వేల రూపాయలు కేవలం టోల్ ఛార్జీలకే పోతాయి. ఇక నిత్యం హైవేలపై తిరిగేవారికి టోల్ మోత ఏస్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సామాన్య ప్రజలపై ఈ టోల్ భారాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం హైవేలపై తిరిగే ప్రైవేట్ వాహనాల యజమానులు టోల్ ఫీజులు తగ్గించుకునేలా సరికొత్త ప్లాన్ ను తీసుకువస్తోంది. కేవలం రూ.3000 వేలతో ఏడాదిపాటు చెల్లుబాటయ్యే పాస్ ను తీసుకువస్తోంది. ఆగస్ట్ 15 అంటే స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఈ పాస్ ను వాహనదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటా ఆఫ్ ఇండియా (NHAI) ప్రకటించింది.
ఏమిటీ యానువల్ టోల్ పాస్
ప్రస్తుతం హైవే ఎక్కితే చాలు టోల్ మోత మోగిపోతోంది. అంతేకాదు ప్రతిసారి ఫాస్టాగ్ లో టోల్ కు సరిపడా డబ్బులున్నాయో లేదో చూసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి ఫాస్టాగ్ లో డబ్బులు లేకున్నా టోల్ గేట్ లోకి ఎంట్రీ ఇచ్చామో నగదు రూపంలో డబుల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సొంత వాహనాల్లో సరదాగా బయటకు వచ్చినవారిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలా టోల్ గేట్ భారాన్నే కాదు ఇబ్బందుల నుండి వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం ఈ యానువల్ టోల్ పాస్ తీసుకువచ్చింది.
ఈ టోల్ పాస్ లో ఏడాదికి సరిపడా ఒకేసారి రీచార్జ్ చేసుకోవచ్చు. అదికూడా చాలా తక్కువ అమౌంట్ తో. కేవలం రూ.3000 తో యానువల్ టోల్ పాస్ తీసుకుంటే ఏడాదిపాటు లేదా 200 సార్లు ఉచితంగానే టోల్ ప్లాజాలు దాటవచ్చు. ఈ పాస్ ద్వారా వాహనదారులకు భారీగా డబ్బులు ఆదా కానున్నాయి.
యానువల్ టోల్ పాస్ తో లాభాలు
కేంద్రం వాహనదారుల కోసం తీసుకువస్తున్న వార్షిక టోల్ పాస్ తో ఎంతలాభమో ఓ ఉదాహరణను బట్టి తెలుసుకుందాం. ఓ వ్యక్తి సొంత కారులో నెలకోసారి హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లివస్తుంటాడని అనుకుందాం. అతడు ఈ యానువల్ టోల్ పాస్ తీసుకుంటే ఎంత ఆదా అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్-విజయవాడ హైవేపై మొత్తం మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి. తెలంగాణలో పతంగి, కొర్లపహాడ్, ఆంధ్ర ప్రదేశ్ లో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. ఒక్కసారి ఈ మూడు టోల్ ప్లాజాలను దాటితే దాదాపు రూ.250 ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ఓ వ్యక్తి సొంత వాహనంలో నెలలో ఒకసారి హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లివస్తే దాదాపు రూ.500 టోల్ ఛార్జీలకే ఖర్చవుతుంది. అంటే ఏడాదికి టోల్ చార్జీల ఖర్చు రూ.6000... ఇది కేవలం 72 సార్ల టోల్ ఫీజులే.
ఒకవేళ ఏడాదిలో 200 సార్లు హైదరాబాద్-విజయవాడ మధ్య టోల్ ప్లాజాలు దాటితే దాదాపు రూ.16,000 పైగానే ఖర్చవుతుంది. కానీ ఈ యానువల్ పాస్ తీసుకుంటే కేవలం రూ.3000 వేలు మాత్రమే టోల్ ఛార్జీలకు ఖర్చవుతుంది... అంటే రూ.13,000 వరకు డబ్బులు ఆదా అవుతాయి. అంతేకాదు ప్రతిసారి ఫాస్టాగ్ రీచార్జ్ అవసరం ఉండదు... బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకునే బాధ ఉండదు.
ఫాస్టాగ్ యానువల్ పాస్ కేవలం ఈ వాహనాలకే…
కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 15, 2025 నుండి అందించనున్న వార్షిక టోల్ పాసులు కేవలం నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి. అంటే కారు, వ్యాన్, జీపు వంటి సొంత వాహనాలు కలిగినవారికే రూ.3000 కు ఏడాదిపాటు చెల్లుబాటయ్యే పాస్ అందిస్తారు. ప్రజారవాణా, సరుకు రవాణా వంటి వాహనాలకు ఈ పాస్ సదుపాయం ఉండదు.
NHAI లేదా రాజమార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. వాహన్ డాటాబేస్ లోని సమాచారం ఆధారంగా కమర్షియల్, నాన్ కమర్షియల్ వాహనాలను గుర్తిస్తారు... దీని ఆధారంగానే నాన్ కమర్షియల్ వాహనాల యజమానులకు వార్షిక పాస్ ను పొందే అవకాశం కల్పిస్తారు.
యానువల్ పాస్ పొందాలంటే ఇది తప్పనిసరి
కారు, వ్యాన్, జీపు వంటి సొంత వాహనాలు కలిగినవారిలో కూడా KYC పూర్తిచేసుకున్నవారికి మాత్రమే ఈ పాస్ ను యాక్టివేట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్షిక పాస్ కావాలనుకునేవారు ఆగస్ట్ 15 లోపు కేవైసి చేయించుకోవాలి.
ఫాస్టాగ్ కేవైసి కోసం దగ్గర్లోని టోల్ ప్లాజాల వద్దకు వెళ్ళి అక్కడుండే బ్యాంక్ ప్రతినిధులను సంప్రదించాలి. లేదంటే ఫాస్టాగ్ లింక్ అయిన బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి సంప్రదించాలి. ఇలా కేవైసి పూర్తిచేసుకుంటే వార్షిక ఫాస్టాగ్ పాస్ ను పొందడానికి మార్గం సుగమం అవుతుంది.