- Home
- National
- Ramesh Vishwas : విమానం గాల్లో ఉండగా కిందకు దూకడం సాధ్యమేనా? రమేష్ విశ్వాస్ ప్రాణాలతో ఎలా బైటపడ్డాడో తెలుసా?
Ramesh Vishwas : విమానం గాల్లో ఉండగా కిందకు దూకడం సాధ్యమేనా? రమేష్ విశ్వాస్ ప్రాణాలతో ఎలా బైటపడ్డాడో తెలుసా?
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాాణికులందరూ మరణించినా కేవలం రమేష్ విశ్వాస్ ఒక్కరే ఎలా బ్రతికారు? నిజంగానే విమానం గాల్లో ఉండగా కిందకు దూకడం సాధ్యమేనా? వైమానిక రంగ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంనుండి ఒకేఒక్కడు ఎలా బైటపడ్డాడు?
Ahmedabad plane crash : గుజరాత్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వందలాదిమందిని బలితీసుకుంది. ఇంతటి ఘోర ప్రమాదం నుండి కూడా ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బైటపడ్డాడు... ఇంకా చెప్పాలంటే అతడు అతడు మృత్యువును జయించాడు. ఇలా అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుండి రమేష్ విశ్వాస్ ఎలా బైటపడ్డాడు? గాల్లో ఉండగానే విమానంలోంచి దూకాడా? లేదా ఇంకెలాగైనా విమానంలోంచి బయటపడ్డాడా? అన్నది ఇక్కడ తెలుసుకుందాం.
విమానం గాల్లో ఉండగా కిందకు దూకడం సాధ్యమేనా?
భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కొన్నిరోజుల క్రితం ఇంగ్లాండ్ నుండి భారత్ వచ్చాడు. కొన్నిరోజులు కుటుంబసభ్యులు, స్నేహితులతో గడుపుతూ ఇక్కడే ఉన్నాడు. అనంతరం తన సోదరుడు అజయ్ కుమార్ తో కలిసి అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు.
అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో కుప్పకూలిన ఎయిరిండియా విమానంలోనే రమేష్ ప్రయాణించాడు... అయితే ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ మరణించగా కేవలం రమేష్ విశ్వాస్ ఒక్కడే ప్రాణాలతో బైటపడ్డాడు.
రమేష్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కు దగ్గరగా ఉన్నాడని.. విమాన ప్రమాదాన్ని పసిగట్టిన అతడు అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన అందులోంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడం అసాధ్యమని వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో అసలు రమేష్ ఎలా బైటపడ్డాడు? అతడిలాగే మిగతా ప్రయాణికులు ఎందుకు ప్రాణాలు కాపాడుకోలేకపోయారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే విమానం గాల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడం సాధ్యమేనా? అన్నది తెలుసుకునేందుకు Asianet అనేక మంది వైమానిక నిపుణులతో మాట్లాడింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మాజీ భారత వైమానిక దళ పైలట్ “విమానం గాల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడం అసాధ్యం” అని స్పష్టం చేసారు. కాబట్టి ఎమర్జెన్సీ డోర్ ద్వారా రమేష్ బైటపడలేదని స్పష్టంగా అర్థమవుతోంది.
మరి అతడు ఎలా బైటకు వచ్చివుంటాడనే ప్రశ్నకు వైమానిక భద్రతా నిపుణుడు అతుల్ సింగ్ జవాబిచ్చారు. Asianet తో ఆయన మాట్లాడుతూ.. రమేష్ విశ్వాస్ కుమార్ ను ఆయన కూర్చున్న స్థానమే కాపాడి ఉంటుందని అన్నారు. విమానంలో అతడికి కేటాయించిన సీటింగ్ కారణంగానే ప్రమాదం జరిగిన వెంటనే కిందకు దూకడానికి అవకాశం వచ్చిందన్నారు.
విమాన ప్రమాదం నుండి రమేష్ విశ్వాస్ ఎలా బైటపడ్డాడు?
తాజాగా రమేష్ విశ్వాస్ కూడా తాను విమాన ప్రమాదంనుండి ఎలా బైటపడ్డది వివరించాడు. తాను విమానం గాల్లో ఉండగా కిందకు దూకలేదని... అందరిలాగే కిందపడినప్పుడు అందులోనే ఉన్నానన్నారు. అయినా ప్రాణాలతో బైటపడ్డానని తెలిపాడు.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిందని... మెడికల్ కాలేజ్ భవనంలోకి దూసుకెళ్లి పేలిపోయిందని తెలిపాడు. అయితే ఈ సమయంలో విమానంలో రెండు ముక్కలయి ఓ భాగం కిందకు పడిపోయిందని... ఈ భాగంలో తాను ఉన్నానని తెలిపాడు. కిందపడిన భాగంలో డోర్ విరిగిపోయిందని... అందులోంచి వెంటనే తాను బయటకు వచ్చానని రమేష్ తెలిపాడు.
కిందపడిన భాగంలో మరికొందరు కూడా ఉన్నారు.. అయితే వారు మాత్రం ఎందుకు బైటకు రాలేకపోయారు? అనేదానికి కూడా విశ్వాస్ సమాధానం చెప్పాడు. తాను కూర్చున్నవైపు భాగం ఖాళీగా ఉండటంతో బైటపడ్డాను... అటువైపు భవనం గోడ ఉంది అందుకే మిగతావారు బైటపడలేకపోయారని తెలిపాడు. ఇలా విమాన ప్రమాదం నుండి ఒక్కడే ఎలా ప్రాణాలతో బైటపడ్డాడో రమేష్ విశ్వాస్ వివరించారు.
రమేష్ విశ్వాస్ పై అనుమానాలు?
అందరూ చనిపోయిన విమాన ప్రమాదంలో రమేష్ విశ్వాస్ ఒక్కడే ఎలా బైటపడ్డాడు? ఇతడికి విమాన ప్రమాదం గురించి ముందే సమాచారం ఉందా? ఏదయినా కుట్రలో అతడు భాగస్వామిగా ఉన్నాడా? ఇలా సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మంచిదికాదని అంటున్నారు అతుల్ సింగ్.
“అహ్మదాబాద్ విమాన ప్రమాదంగురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకా రెండుమూడు రోజులు వేచి చూడాలి. ఇప్పటికే బ్లాక్ బాక్స్ దొరికింది... కాబట్టి అంతా బయటపడుతుంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. రమేష్ ఎలా బైటపడ్డాడో కూడా బైటపడుతుంది” అని అన్నారు.
వైమానిక ప్రమాదాలకు కారణాలు
వైమానిక ప్రమాదాల గురించి అతుల్ సింగ్ మాట్లాడుతూ.. విమానం కూలిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయని చెప్పారు. ఒకటి మానవ తప్పిదం, రెండోది హైడ్రాలిక్ వైఫల్యం, మూడోది ఇంజిన్ వైఫల్యం (పక్షులను గుద్దడం వంటివి జరిగి తీవ్రమైన సాంకేతిక లోపాలు తలెత్తడం).
విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు రెండు ఇంజన్లు విఫలమవడం చాలా అరుదైన సంఘటనగా అతుల్ సింగ్ పేర్కొన్నారు. అయితే అహ్మదాబాద్ లో మాత్రం విమానం టేకాఫ్ అయ్యాక పైకి వెళ్లకుండా కిందకు రావడం జరిగంది.. ఇలా జరిగిందంటే ఏదో పెద్ద సమస్యే తలెత్తి ఉంటుందన్నారు అతుల్ సింగ్.
రమేష్ విశ్వాస్ ఇంకా ఏమంటున్నాడంటే
రమేష్ విశ్వాస్ కుమార్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడిని ప్రధాని మోదీ పరామర్శించి విమాన ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతడు విమాన ప్రమాదం గురించి మీడియాకు కూడా వివరించాడు.
“టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత ఒక పెద్ద శబ్దం వచ్చింది, ఆపై విమానం కూలిపోయింది. నేను చనిపోతాననే అనుకున్నాను.. కానీ ఎలాగో బ్రతికి బైటపడ్డాను. పైకి లేచినప్పుడు నా చుట్టూ శవాలు ఉన్నాయి. దీంతో భయపడ్డాను. వెంటనే లేచి పరిగెత్తాను. నా చుట్టూ విమానం ముక్కలు ఉన్నాయి” అని అతను చెప్పాడు.
“ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకొచ్చారు. నా సోదరుడు అజయ్ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడు'' అని రమేష్ విశ్వాస్ తెలిపాడు. ఇలా రమేష్ ఒక్కడే ప్రాణాలతో బైటపడ్డాడు… అతడి సోదరుడితో సహా విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోయారు.