Air India crash in Ahmedabad: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సీటు 11ఏలో ఉన్న ప్రయాణికుడు మిరాకిల్ గా ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతావారందరూ ప్రాణాలు కోల్పోయారు.
Air India crash in Ahmedabad: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో బీజే మెడికల్ కాలేజీ వైద్యుల నివాస సముదాయంపై కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు.
ఈ ప్రమాద సమయంలో సీటు 11Aలో కూర్చున్న ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ (వయస్సు 38) ప్రాణాలతో బయటపడ్డాడని మాలిక్ వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. “మిగిలిన మరణాల సంఖ్యపై ఇంకా నిర్ధారణ చేయలేదు. విమానం నివాస ప్రాంతంలో కూలినందున మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది” అని మాలిక్ అన్నారు.
ప్రమాదం తర్వాత రమేశ్ గాయాలతో నడుచుకుంటూ అంబులెన్స్ దగ్గరకు వచ్చిన వీడియోలు వైరల్ గా మారాయి. అతను తన సోదరుడు అజయ్ కుమార్ రమేశ్‌తో కలిసి యూకేకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
బోయింగ్ 787 డ్రిమ్‌లైనర్ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు వెళ్లడానికి గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు బయలుదేరింది. అయితే, టేకాఫ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ విమానం మేఘాని నగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ నివాస ప్రాంతంపై కూలిపోయింది.
విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారు.
ఒక ప్రత్యక్ష సాక్షి హారేష్ షా తెలిపిన వివరాల ప్రకారం, "విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ డాక్టర్ల నివాస భవనాలపై కూలిపోయింది. ఐదు అంతస్థుల భవనాల్లో మంటలు అంటుకున్నాయి. అందులోని పలువురు గాయపడ్డారని" తెలిపారు. అక్కడ పార్క్ చేసిన వాహనాలు కూడా మంటల్లో కాలిపోయినట్లు మరొక సాక్షి వెల్లడించాడు.
