Womens Food: 35 ఏళ్లు దాటిన స్త్రీలు కచ్చితంగా తినాల్సిన పప్పు ఇదే
Womens Food: 35 ఏళ్లు దాటిన మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో కొన్ని ప్రత్యేకంగా తినాలి. దీనివల్ల వారికి ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వీరు తినాల్సినది నానబెట్టిన పెసలు.

ఏ పప్పు తినాలి?
మహిళల శరీరాలు 35 ఏళ్లు దాటిన తరువాత బలహీన పడతాయి. అలాగే శరీరంలో వివిధ హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. ఎముకలు బలహీనపడడం మొదలవుతుంది. అందుకే ఆ సమయంలో వారి శరీరానికి ఇనుము, ప్రోటీన్, క్యాల్షియంతో సహా ఎన్నో పోషకాలు అవసరం. ఇంట్లోని మహిళలు తమ కోసం సమయం కేటాయించుకోకుండా కుటుంబ సభ్యులకే కేటాయిస్తారు. దీనివల్ల వారికి అనేక పోషకాహార లోపం కూడా వస్తుంది. అందుకే వారు ప్రతిరోజు కచ్చితంగా తినాల్సిన ఆహారం నానబెట్టిన పెసర మొలకలు.
పెసరపప్పును నానబెడితే మొలకలు వస్తాయి. వీటిని ఆరోగ్యకరమైన పోషకాలు నిండుగా ఉన్న ఆహారంగా చెప్పుకుంటారు. ఇవి శాఖాహారులకు, మాంసాహారులకు కూడా ఎంతో ముఖ్యం. దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ b6, విటమిన్ సి, ఐరన్, ఫైబర్, పొటాషియం, రాగి, ఫోలేట్, మెగ్నీషియం, నియాసిన్, థయామిన్, భాస్వరం వంటివి కూడా ఉంటాయి. 35 ఏళ్లు దాటిన మహిళలు తమ శక్తిని పెంచుకోవడానికి ప్రోటీన్ లాభం రాకుండా అడ్డుకోవడానికి నానబెట్టిన పెసర మొలకలు తినాల్సిన అవసరం ఉంది.
తినడం వల్ల లాభాలు
ప్రతిరోజు ఉదయం వంద గ్రాముల పెసర మొలకలు తింటే 32 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది శరీరానికి అత్యవసరమైనది. ఇలా తినడం వల్ల రోజంతా మీరు చురుకుగా ఉంటారు. ఇలా పెసలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పేగు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఆపుతుంది. డెలివరీ తర్వాత బరువు తగ్గాలనుకునే మహిళలకు ఇది అద్భుతమైన ఆహారంగా చెప్పుకోవాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు కడుపు నిండిన భావన ఉంటుంది.
అందానికి కూడా
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా నానబెట్టిన పెసలు తినవచ్చు. వీటిలో అనేక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చర్మం వదులుగా కాకుండా ముడతలు పడకుండా కూడా అడ్డుకుంటాయి. ముఖం మీద ఉన్న చర్మంపై గీతలు రాకుండా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి. ఈ నానబెట్టిన పెసలు చర్మాన్ని లోపల నుండి మరమ్మతు చేసి బయటికి మెరిసేలా చేస్తాయి. జుట్టు పెరుగుదలకు కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
చలికాలంలో తింటే ఇంకా మంచిది
ఎముకల కోసం నానబెట్టిన పెసలను కచ్చితంగా తినాలి. క్యాల్షియం అధికంగా ఉండే వీటిని తినడం వల్ల ఎముకలు బలపడతాయి. శీతాకాలంలో వచ్చే ఎముక నొప్పి, వాపు, పగుళ్లు వంటివి రాకుండా ఇవి అడ్డుకుంటాయి. ఇందుకోసం మీరు పెసరపప్పును తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం అయ్యాక వాటిని శుభ్రం చేసి నిమ్మరసంతో కలుపుకొని పిండుకొని తినేయాలి. కావాలనుకుంటే పచ్చి టమోటో ముక్కలు, నానబెట్టిన కొమ్ముసెనగలు, చిటికెడు ఉప్పు కూడా జోడించుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

