రోజంతా ఎంత బిజీగా గడిచినా, మన జీవితాన్ని నిజంగా ప్రభావితం చేసే సమయం రాత్రేనని చాలామంది గుర్తించరు. ఉదయం ఎలా మొదలవుతుందో అనేది రాత్రి ఎలా ముగుస్తుందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నిద్రకు ముందు పాటించాల్సిన కొన్ని అలవాట్ల గురించి ఇక్కడ చూద్దాం. 

మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన సమయం రాత్రే అని నిపుణులు చెబుతుంటారు. మనం పడుకునే ముందు పాటించే చిన్న చిన్న అలవాట్లు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై మాత్రమే కాదు, మన విజయంపై కూడా ప్రభావం చూపుతాయట. రోజంతా ఎంత బిజీగా ఉన్నా, రాత్రి సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు, అలవాట్లు మన జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.

జీవితాన్ని ప్రభావితం చేసే అలవాట్లు

నిద్రకు ముందు కనీసం 30 నిమిషాలపాటు ఫోన్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి దూరంగా ఉండటం చాలా కీలకం. ఎందుకంటే స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించి, నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. బదులుగా, ఒక మంచి పుస్తకం చదవడం లేదా మంచి సంగీతం వినడం మెదడుకు విశ్రాంతిని ఇస్తుంది.

సమీక్షించుకోవడం..

రాత్రి పడుకునే ముందు 5 నుంచి 10 నిమిషాలు కేటాయించి, ఆ రోజు మీరు చేసిన పనులు, సాధించిన విజయాలు, ఎదురైన సమస్యలు, చేసిన తప్పుల గురించి ఆలోచించడం ద్వారా స్పష్టత పెరుగుతుంది. ఇది మనకు తర్వాత రోజుకు మెరుగైన ప్రణాళిక చేసుకునే అవకాశం ఇస్తుంది. అలాగే, మరుసటి రోజు చేయాల్సిన పనులను ఒక చిన్న లిస్టుగా రాసుకోవడం వల్ల ఉదయం లేవగానే గందరగోళం లేకుండా సులభంగా పనులు ప్రారంభించవచ్చు. ఇది టైమ్ మేనేజ్‌మెంట్‌లో కూడా చాలా సహాయపడుతుంది.

రాత్రి భోజనం

ఆరోగ్య పరంగా చూస్తే, రాత్రి భోజనం తేలికగా, నిద్రకు కనీసం 2 గంటల ముందు చేయడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే ధ్యానం లేదా శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా రాత్రి సమయంలో చేయడం మంచిది. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడానికి సహాయపడతాయి. కేవలం 5 నిమిషాల ధ్యానం కూడా మనసును ప్రశాంతంగా ఉంచి, లోతైన నిద్రకు దారితీస్తుంది.

కృతజ్ఞతాభావం

అలాగే, కృతజ్ఞతాభావం పెంచుకోవడం కూడా ఒక శక్తివంతమైన అలవాటు. రోజు ముగిసే సమయంలో మీకు జరిగిన మంచి విషయాలను గుర్తుచేసుకుని కృతజ్ఞతతో ఉండడం ద్వారా మనలో పాజిటివ్ భావాలు పెరుగుతాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నిద్ర సమయం

ఇక నిద్రపోయే సమయాన్ని స్థిరంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం వల్ల మన శరీర గడియారం సరిగ్గా పని చేస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది.

గది వాతావరణం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. చీకటి, ప్రశాంతమైన, చల్లని వాతావరణంలో నిద్రపోవడం ఉత్తమం. రాత్రి సమయంలో కెఫిన్, హెవీ ఫుడ్, అనవసర ఆలోచనలకు దూరంగా ఉంచడం మంచిది.