Ravana Lanka: రామాయణంలో ఉన్న రావణుడి లంక.. ఈనాటి శ్రీలంక ఒకటి కాదా?
Ravana Lanka: రావణుడి పాలించిన లంకా రాజ్యం.. ఇప్పటి శ్రీలంక అని చెప్పుకుంటారు. కానీ రావణ లంకా శ్రీలంక కాదని, అది ఎప్పుడో మునిగిపోయిందని చెప్పేవారు ఉన్నారు. అసలు దీనిపై చారిత్రకారులు ఏం చెబుతున్నారు?

బంగారు భవనాలతో లంకా నగరం
రామాయణంలో కనిపించే సుందర నగరాల్లో రావణుడి లంక కూడా ఒకటి. సీతాదేవిని అపహరించిన తర్వాత రావణుడు లంకకే ఆమెను తీసుకువెళ్లాడు. అయితే ఎన్నో శతాబ్దాలుగా ఒక ప్రశ్న.. భక్తులను, పండితులను, చారిత్రకారులను ఆలోచనలో పడేస్తోంది. అదే రామాయణంలో కనిపించిన రావణుడి లంక.. ఇప్పటి శ్రీలంక ఒక్కటేనా? కాదా? అని. వాల్మీకి రామాయణం చెబుతున్న ప్రకారం లంక అనేది సముద్రం మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన నగరం. దీనిలో భవనాలను బంగారంతో నిర్మించారని చెప్పుకుంటారు. అశోకవనం, ఎత్తైన ప్రాకారాలు, అపార సంపదతో రాజధాని తులతూగేదని అంటారు. ఎంతోమంది రావణుడు పాలించిన లంక ఈనాటి శ్రీలంకేనని నమ్ముతారు. ముఖ్యంగా భారత్‌కు, శ్రీలంకకు మధ్య రామసేతు ఉండడం ఈ కథకు మరింత బలాన్ని తెచ్చింది.
రామసేతు వల్లే
అయితే పురాణాలు ప్రకారం చూస్తే రావణుడి లంక.. ఈ శ్రీలంకేనని చెప్పడానికి కారణాలు కూడా ఉన్నాయి. రామాయణంలో లంకకు వెళ్లేందుకు రాముడు సముద్రంపై వానర సైన్యంతో వంతెనను నిర్మించాడు. ఆ వంతెనే ఇప్పుడు రామసేతుగా మారిందని అంటారు. నేటికీ భారతదేశంలో రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు సముద్రంలో ఇసుక దిబ్బలు కనిపిస్తూనే ఉంటాయి. వీటిని చూసినప్పుడు రామాయణం నిజమే అన్న భావన భక్తులలో కలుగుతుంది. అంతేకాదు శ్రీలంకలో రావణుడితో అనుబంధం ఉన్న ప్రదేశాలు ఉన్నట్టు అక్కడ స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. రావణుడు శివ భక్తుడు. అలాగే గొప్ప పండితుడు కూడా. శ్రీలంకలో రావణుడిని దేవుడులా కొలుస్తారు.
ఆ బంగారం ఏమైంది?
కొంతమంది చరిత్రకారుల మాటల్లో రామాయణ కాలాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. రామాయణం తిరుగులేని ఇతిహాసం. పురాణాల్లో చెప్పిన ప్రకారం లంకా నగరం బంగారంతో నిర్మించారు. కానీ అలాంటి నగరానికి సంబంధించిన పురావస్తు ఆధారాలు ఏవీ శ్రీలంకలో లభించలేదు. లంకా అనే పేరు ఒకే ప్రాంతానికి చెందినది కాదు. దక్షిణ భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలకు లంక అనే పేర్లు ఉన్నాయి. రామాయణంలోని లంక ఈనాటి శ్రీలంక ఒక్కటే అని కచ్చితంగా చెప్పలేమని కొంతమంది చారిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
శాస్త్రీయంగా చెప్పుకుంటే ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం రామసేతు సహజంగా ఏర్పడిన ఒక ఇసుక దిబ్బల శ్రేణి అని అంటారు. ఉపగ్రహ చిత్రాలు ఆధారంగా చూసుకుంటే వేల ఏళ్ల క్రితమే ప్రకృతి వల్ల ఇది ఏర్పడ్డాయని అంటారు. కానీ మరోవైపు పురాణాల్లో మాత్రం వానరసైన్యంతో రాముడి కట్టాడని చెబుతారు. అయితే రామాయణం అనేది చరిత్రగా మిగిలిపోలేదు. ధర్మం, నైతిక విలువలను జీవన విధానాన్ని బోధించే మహా గ్రంధంగా వాడుకలో ఉంది. రావణుడి లంక దక్షిణ భారత తీర ప్రాంతానికి దగ్గరలో ఎక్కడో దగ్గర ఉంటుందని మాత్రం చారిత్రకారులు చెబుతున్నారు. రావణుడి లంక ఎక్కడ ఉందో చెప్పే ఖచ్చితమైన శాస్త్రీయమైన ఆధారాలు మాత్రం ఇప్పటికీ లేవు.
హనుమంతుడి దాటిన ద్వీపం
ప్రస్తుతం రావణుడి లంక లేదని సముద్రంలో మునిగిపోయిందని వాదించే చారిత్రకారులు ఉన్నారు. హిందూ మహాసముద్రంలో ఒక ఎత్తైన పర్వతం మీద రావణుడి లంక ఉండవచ్చని.. అది ఇప్పుడు మునిగిపోయిందని 19వ శతాబ్దం నాటి చారిత్రకారులు చెబుతున్నారు. ఈ వాదనలకు బలం చేకూర్చేలా భారతదేశం, మాల్దీవుల మధ్య మినికాయ్ అనే ద్వీపం ఉంది. పురాతన కాలంలో దీని పేరు మినికా లేదా మైనాకా. అంటే హనుమంతుడు లంకకు వెళ్లే మార్గంలో కలుసుకున్న పర్వతం అని అర్థం. దీన్ని ఈ పర్వతం దాటాక వచ్చిన ప్రాంతంలోనే లంక ద్వీపం ఉండేదని ఇప్పుడు అది లేదని చెబుతున్నారు.

