Oil Reuse: డీప్ ఫ్రై చేసిన నూనె పారబోస్తున్నారా? ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా?
Oil Reuse: డీప్ ఫ్రై చేసిన తర్వాత నూనెను తిరిగి వంటకు వాడటం చాలా మందికి నచ్చదు. దీంతో.. ఆ నూనెను పారబోస్తారు. అయితే.. ఆ నూనె పారబోయకుండా చాలా రకాలుగా వాడొచ్చు.

Deep Fry Oil
నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు.కానీ.. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు అయినా, వారానికి ఒకాసారో లేక.. పండగ సమయంలోనే ఇంట్లో పూరీలు, వడలు, బూరెలు చేసుకుంటూ ఉంటారు. వాటిని చేసిన తర్వాత ఆ నూనెను తిరిగి వంటకు వాడటం చాలా మందికి నచ్చదు. అలా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు కూడా. దీంతో.. ఆ నూనెను పారబోస్తారు. అయితే.. ఇక నుంచి అలా డీప్ ఫ్రై చేసిన తర్వాత నూనెను పారబోయకండి.. ఎందుకంటే... ఆ నూనెను చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...
ఇంట్లోకి కీటకాలు రావు..
పూరీలు, పకోడీలు చేసిన తర్వాత, నూనె అడుగు భాగం మురికిగా మారుతుంది. అంటే, వండిన వంటలకు సంబంధించిన కొన్ని పదార్థాలు నూనె అడుగున పేరుకుపోతాయి. అందుకే చాలా మంది ఈ నూనెను మళ్లీ ఉపయోగించడానికి ఇష్టపడరు. కానీ.. ఈ నూనెను మీ ఇంటి నుండి కీటకాలను దూరంగా ఉంచడానికి ఉపయోగించవచ్చు. నూనెను వడబోసి మరో పాత్రలో పోయాలి. తర్వాత అందులో లవంగాలు, నిమ్మకాయ ముక్కలను వేయాలి. అందులో దీపం వత్తిని వేసి వెలిగించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దోమలు, కీటకాలు రాకుండా ఉంటాయి.
ఐరన్ వస్తువులను శుభ్రం చేయవచ్చు..
ఇంట్లో ఉపయోగించే ఐరన్ వస్తువులను ఎక్కువ కాలం మన్నికతో ఉంచడానికి కూడా మనం ఈ నూనెను ఉపయోగించవచ్చు. నూనెను వడబోసి స్ప్రే బాటిల్ లో నింపాలి. తర్వాత.. ఐరన్ వస్తువులపై స్ప్రే చేసి.. బ్రష్ తో రుద్దాలి. తర్వాత.. ఒక పాత క్లాత్ తో తుడిస్తే.. మళ్లీ కొత్తవాటిలా కనిపిస్తాయి.
మొక్కల నుండి పురుగులను దూరంగా ఉంచే మార్గాలు
మొక్కలలోని కీటకాలను వదిలించుకోవడానికి మీరు మిగిలిపోయిన నూనెను ఉపయోగించవచ్చు. నూనెను ప్లాస్టిక్ డబ్బాలో పోసి మొక్కల దగ్గర ఉంచండి. దాని వాసన కీటకాలను మొక్క నుండి దూరంగా ఉంచుతుంది. దీనితో పాటు, మీరు నూనెలో లవంగాలు, కర్పూరం కలిపి, కీటకాలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయవచ్చు.

