Monsoon Travel Tips : వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు గుర్తుంచుకొండి
వర్షాకాలంలో ప్రకృతి మరింత అందాన్ని సంతరించుకుంటుంది. కానీ ఈ వర్షాల్లో ప్రయాణం ఇబ్బందికరమే కాదు ప్రమాదకరం కూడా. కాబట్టి ఈ సీజన్ లో మీ టూర్ ఆహ్లాదకరంగా ఉండాలంటే పాటించాల్సిన 5 ముఖ్యమైన చిట్కాలివే..

వర్షాకాలం టూర్ ప్లాన్
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలామంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. నల్లని మేఘాలతో కూడిన చల్లని వాతావరణంలో భూమికి పచ్చని చీరచుట్టినట్లుగా ఉండే ప్రకృతి అందాలు ఈ సీజన్ లోనే కనువిందు చేస్తాయి. అందుకే ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఈ సీజన్ లోనే కుటుంబం లేదా స్నేహితులతో కలిసి పర్యటిస్తుంటారు.
అయితే వర్షాకాలం ట్రిప్ ఆహ్లాదకరంగానే కాదు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి జోరువానలు పడేవేళ ట్రిప్స్ కు వెళ్లేవారు కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి... అలాగే కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడు మీ ట్రిప్ హాయిగా సాగుతుంది.
వర్షాకాలంలో టూర్ కు వెళ్లేవారు ఈ 5 చిట్కాలు పాటించండి
1. వాతావరణ సమాచారం తెలుసుకోండి
ట్రిప్ కి వెళ్లే ముందు అక్కడి వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారీ వర్షాలు, గాలులు ఉంటే చాలా టూరిస్ట్ ప్రదేశాలు మూసివేస్తారు... ఈ విషయం తెలుసుకోకుండా వెళితే నిరాశ చెందుతారు... ఇలాంటి సమయంలో ఒక్కోసారి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.
2. వసతి ముందుగానే బుక్ చేసుకోండి
వర్షాకాలంలో హోటల్స్, రూమ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందుగానే బుక్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బంది ఉండదు. హోటల్లోనా, హోమ్ స్టేలోనా మీకు నచ్చిన చోట ముందుగానే బుక్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎంచుకునే వసతిని బట్టి ప్యాకింగ్ చేసుకొండి.
3. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ తీసుకెళ్లండి
వర్షాకాలంలో వెంటతీసుకెళ్లే వస్తువులు మరీముఖ్యంగా బ్యాగులు తడవకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. రెయిన్ కోట్ లోపల పెట్టుకునేలా చిన్న బ్యాగును తీసుకెళ్లండి. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ లేదా కవర్ తీసుకెళ్లడం మంచిది.
4. మందులు తీసుకెళ్లండి
వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు సర్వసాధారణం. అందుకే అవసరమైన మందులు తప్పకుండా తీసుకెళ్లాలి. లేదంటే ఇలాంటి అనారోగ్య సమస్యలతో మందులకోసం బయట వర్షంలో తడవాల్సి వస్తుంది. అది మీకు మరింత అనారోగ్యకరం.
5. కొంత డబ్బు వెంట ఉంచుకోండి
నేటి కాలంలో అందరూ UPI పేమెంట్స్ నే ఎక్కువగా వాడుతున్నారు. కానీ కొండప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు మీరు వెళుతుంటే అక్కడ నెట్ వర్క్ ఉండకపోవచ్చు... కొన్నిచోట్ల వర్షాల కారణంగా నెట్ వర్క్ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి వర్షాకాలం ట్రిప్స్ లో కొంత డబ్బు వెంట ఉంచుకోవడం మంచిది. ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడతాయి.