AP Cabinet's Crucial Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి భూసేకరణ, పొగాకు రైతుల సహాయం, పర్యాటక అభివృద్ధికి కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AP Cabinet's Crucial Decisions: మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోనుంది. అసైన్డ్, దేవాదాయ భూములపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో విచారణ జరపాలని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మరోసారి మరిన్ని వేల ఎకరాల భూమిని భూసేకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రివర్గం చర్చ
తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ చేయడం పట్ల స్పందించిన చంద్రబాబు, ఈ అంశంపై కేంద్రంతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టు దశల వారిగా ముందుకు తీసుకెళ్లాలని, అవసరమైతే కేంద్ర జోక్యం తీసుకురావాలన్నది చంద్రబాబు అభిప్రాయం. నీటి హక్కులపై స్పష్టతతో మాట్లాడాలని కేబినెట్ సభ్యులకు సూచించారు. అలాగే, సర్ ఆర్దర్ కాటన్ బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్ రక్షణ పనుల కోసం 350 కోట్ల నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

పొగాకు రైతులకు భారీ సహాయం
తేమ శాతం అధికంగా ఉండటంతో మార్కెట్‌లో ధరలు పడిపోయిన పొగాకు పంట కొనుగోలుకు రూ.273.17 కోట్లను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ డబ్బుతో 20 మిలియన్ టన్నుల పొగాకును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు అందిస్తామని, తద్వారా మామిడి, కోకో పంటలకూ మద్దతు అందిస్తున్నామని తెలిపారు.
అన్న క్యాంటీన్లు, అంగన్‌వాడీ కేంద్రాల విస్తరణ
ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనీ, అదనంగా 9 క్యాంటీన్ల ఏర్పాటు ఖరారైందని వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలోని 4687 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. దీనితో పాటు, 6497 కేంద్రాల అప్‌గ్రేడ్‌కి కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

పర్యాటకాభివృద్ధి కోసం చర్యలు
మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ విజయాన్ని ప్రశంసించిన సీఎం చంద్రబాబు, గండికోట వద్ద 50 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటు, తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాల భూమిని పర్యాటకశాఖకు బదిలీ చేయడం వంటి చర్యలను మంత్రివర్గం ఆమోదించింది. అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కూడా కీలక నిర్ణయాల్లో ఒకటిగా ఉంది.
టెక్, విద్యా రంగానికి ప్రోత్సాహం
విశాఖ మధురవాడలో 22.19 ఎకరాల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటు కోసం రూ.1582 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని బార్ కౌన్సిల్‌కు లీజ్‌పై ఇవ్వాలని నిర్ణయించారు.
క్రీడాకారులకు గుర్తింపు
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి గ్రూప్-1 ఉద్యోగం కింద డిప్యూటీ కలెక్టర్ పోస్టును కేబినెట్ మంజూరు చేసింది. ఇది రాష్ట్రంలో క్రీడాకారుల ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది.

బిల్డింగ్ రూల్స్ సరళీకరణ
గుజరాత్‌లోని విధానాలను నమూనాగా తీసుకొని భవన నిర్మాణ నిబంధనలను సరళీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
జులై 1వ తేదీ నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలన్నది ముఖ్యమంత్రి సూచన. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఏడాది పాలనపై సమావేశాలు నిర్వహించాలన్నారు. మంత్రులు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని స్పష్టం చేశారు.
