Barfi Recipe: నోట్లో పెడితే కరిగిపోయేలా శనగపిండి బర్ఫీని ఇలా చేసేయండి, రెసిపీ చాలా సులువు
పండుగ సీజన్ వచ్చేస్తోంది. స్వీట్లు చేయడానికి అంతా సిద్ధమైపోతారు. ఇక్కడ మేము శనగపిండి బర్ఫీ (Barfi) సులువుగా చేయడం ఎలాగో ఇచ్చాము. రెసిపీ తెలుసుకోండి. దీన్ని మీరు అరగంటలో వండేసుకోవచ్చు.

శనగపిండి బర్పీ
పండుగల సమయంలో, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు స్వీట్లు తయారు చేయడం సహజం. ఎక్కువసేపు వండాల్సిన అవసరం లేకుండా తక్కువ సమయంలోనే రెడీ అయ్యే స్వీట్లు ఎంపిక చేసుకోవాలి. అలాంటి వాటిలో శనగపిండి బర్ఫీ ఒకటి. ఈ బర్ఫీ నోట్లో పెడితే చాలు కరిగిపోయేలా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. దీని రెసిపీ ఎలాగో ఇచ్చాము. ఫాలో అయిపోండి.
శనగపిండి బర్ఫీకి కావలసిన పదార్థాలు
రెండు కప్పుల శనగపిండిని తీసుకోండి. అలాగే నెయ్యి ఒకటిన్నర కప్పు అవసరం పడుతుంది. చక్కెర కూడా ఒకటిన్నర కప్పు అవసరం. ఇక యాలకుల పొడి ఒక స్పూను, నీళ్లు తగినన్ని సిద్ధం చేసుకోవాలి. పైన గార్నిష్ చేయడం కోసం పిస్తా పప్పులు, బాదంపప్పులు తరిగి పక్కన పెట్టుకోవాలి.
శెనగపిండి బర్ఫీ రెసిపీ
శనగపిండి ఒకసారి జల్లించి ఉండలు లేకుండా చూసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యిలో శనగపిండిని చిన్న మంట మీద బంగారు రంగులోకి మారేవరకు వేయించుకోవాలి. పిండి నుంచి ఒక సువాసన వస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్టౌ ఆఫ్ చేసేయాలి.
పంచదార సిరప్ చేసి
ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి పంచదార, నీరు కలిపి చక్కెర సిరప్ తయారు చేసుకోవాలి. పంచదార నీటిలో బాగా కలిసిపోయి సిరప్ లాగా అయ్యాక సన్నని తీగపాకం వచ్చేవరకు ఉంచాలి. తీగపాకం వచ్చాక ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని అందులో వేసి బాగా కలుపుకోవాలి. యాలకుల పొడిని కూడా వేసి కలపాలి. అయితే దీన్ని చిన్న మంట మీద చేయాలి. లేకపోతే శనగపిండి త్వరగా గట్టిపడిపోతుంది. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా వచ్చేవరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక ట్రే లేదా ప్లేట్ తీసుకొని కింద నెయ్యి లేదా బటర్ రాయాలి. దీనిపై ఈ శనగపిండి మిశ్రమాన్ని పరచాలి. పైన బాదం, పిస్తా తరుగును చల్లాలి. కాసేపు అలా గాలికి వదిలేయాలి. అది గట్టిపడ్డాక బర్ఫీ ఆకారంలో కట్ చేసుకోవాలి.
బెల్లంతో కూడా...
ఈ శనగపిండి బర్ఫీని నోట్లో పెట్టుకుని చూడండి.. కరిగిపోయేలా ఉంటుంది. అతిథిలకు పెడితే కచ్చితంగా నచ్చుతుంది. దీనిలో మనం వాడిన వస్తువులు కూడా తక్కువే. అరగంటలో ఈ స్వీట్ ను మీరు సిద్ధం చేసుకోవచ్చు. పంచదారకు బదులు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.