చింతచిగురుతో కారంపొడి ఇలా చేసుకుంటే వేడివేడి అన్నంలో అమృతంలా అనిపిస్తుంది, రెసిపీ ఇదిగో
చింతచిగురు మార్కెట్లో కనిపిస్తే అస్సలు వదలకండి. చింతచిగురుతో కారంపొడి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు తినవచ్చు. ఇడ్లీ, అన్నం, దోశ... ఎందులో తిన్నా టేస్ట్ అదిరిపోతుంది.

చింత చిగురుతో అదిరిపోయే రెసిపీ
చింతచిగురులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీంతో చేసే వంటకాలు పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి. చింతచిగురు పప్పు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక చింతాకు కారంపొడి కూడా చేయవచ్చు. దీన్ని ఒక్కసారి చేసుకుంటే అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి తినవచ్చు. వేడివేడి అన్నంలో ఒక స్పూను చింతచిగురు కారంపొడి అర స్పూన్ నెయ్యి కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం చింతచెగురు కారంపొడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చింతచిగురు కారంపూడి రెసిపీకి కావలసిన పదార్థాలు
ఒక కప్పు చింత చిగురును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి పన్నెండు ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, నూనె రెండు స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10, గుప్పెడు కరివేపాకులు, రెండు స్పూన్ల ధనియాలు, ఒకటిన్నర స్పూను జీలకర్ర తీసి పక్కన పెట్టుకోవాలి.
చింతచిగురు కారంపొడి ఇలా చేయండి
చింతచిగురు శుభ్రంగా కడిగి ఎర్రటి ఎండలో ఆరబెట్టండి. లేదా ఫ్యాన్ కింద రెండు మూడు రోజులు ఎండినా కూడా సరిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆ ఎండిన చింతచిగురును వేయించండి. ఇలా చేయడం వల్ల చింతచిగురులో ఉన్న తేమ మొత్తం పోతుంది. చింతచిగురును వేగించాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో జీలకర్ర, ధనియాలు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేయండి.
ఇలా దాచుకోండి
నూనె వేడెక్కాక ఎండుమిర్చి, కరివేపాకులు వేసి వేయించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్న చింత చిగురు, కరివేపాకులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకోండి. అంతే చింతచిగురు కారంపొడి రెడీ అయినట్టే. అన్నం తినేముందు రెండు ముద్దలు ఈ కారం పొడితో తిని చూడండి అద్భుతంగా ఉంటుంది.
చింతచిగురుతో ఆరోగ్యం
చింతచిగురును కేవలం రుచి కోసమే కాదు. శరీరానికి కావాల్సినన్ని పోషకాల కోసం కూడా తినవచ్చు. చింతచిగురులో డైటరీ ఫైబర్ ఎక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారు చింతచిగురుని తినాల్సిన అవసరం ఉంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చింతచిగురును తరచూ తినాల్సిన అవసరం ఉంది. రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించడంలో చింతాకు ఉపయోగపడుతుంది. కాబట్టి వారానికి రెండుసార్లు డయాబెటిస్ రోగులు చింతాకును తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలో ఇవి ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని కూడా పెంచుతాయి. పిల్లలకు, మహిళలకు చింతచిగురు చేసే మేలు ఇంత అంతా కాదు. వారిలోనే ఎక్కువగా రక్తహీనత సమస్య ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను తగ్గించడంలో చింతచిగురు ఎంతగానో ఉపయోగపడుతుంది.