- Home
- Life
- Garlic chutney: కొలెస్ట్రాల్‌ను కరిగించే వెల్లుల్లి చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి, రెసిపీ ఇదిగో
Garlic chutney: కొలెస్ట్రాల్‌ను కరిగించే వెల్లుల్లి చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి, రెసిపీ ఇదిగో
కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గుండెకు కొలెస్ట్రాల్‌తో ఎంతో ప్రమాదం. కాబట్టి దాన్ని కరిగించే వెల్లుల్లి చట్నీని తరచూ ఆహారంలో భాగం చేసుకోండి. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కొలెస్ట్రాల్ కరిగించే వెల్లుల్లి
వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది ముందుంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా చేరడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. దాని ద్వారా గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశాన్ని కొలెస్ట్రాల్ పెంచేస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీరు వెల్లుల్లి చట్నీని తరచూ తినేందుకు ప్రయత్నించండి
వెల్లుల్లి చట్ని రెసిపీకి ఏం కావాలి?
వెల్లుల్లి చట్నీ చేయడం చాలా సులువు. దీనికోసం పెద్దగా వస్తువులు అవసరం లేదు. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 నుంచి 15 దాకా తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి మూడు, నిమ్మరసం ఒక స్పూన్ తీసుకోండి. కొత్తిమీర తరుగు మూడు స్పూన్లు తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడా తీసుకోండి. జీలకర్ర ఒక స్పూను తీసి పక్కన పెట్టుకోండి. అలాగే పోపు వేసేందుకు నూనె ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, శెనగపప్పు ఇక స్పూను, ఎండు మిర్చి మూడు, జీలకర్ర అర స్పూను తీసి సిద్ధం చేసుకోండి.
వెల్లుల్లి చట్నీ ఇలా చేసేయండి
వెల్లుల్లి చట్నీ చేసేందుకు ముందుగా వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఆ వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇది మరీ పలుచగా కాకుండా మందంగా రుబ్బుకోవడం మంచిది. ఇప్పుడు దీని పైనే నిమ్మ రసాన్ని చల్లుకోవాలి. ఇప్పుడు దీని పోపు పెట్టేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, రెండు వెల్లుల్లి రెబ్బల తరుగు, జీలకర్ర వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని చట్నీపై వేసుకోవాలి. అంతే కొలెస్ట్రాల్ కరిగించే వెల్లుల్లి చట్నీ రెడీ అయినట్టే. దీన్ని మీరు ఒక్కసారి చేసుకుంటే చాలు.. పది రోజులు పాటు నిల్వ ఉంటుంది. అయితే ఫ్రిజ్లో పెట్టుకోవడం మర్చిపోకూడదు.
తింటే ఎంతో రుచి?
ప్రతిరోజూ అన్నంలో రెండు స్పూన్ల వెల్లుల్లి చట్నీ వేసుకొని తినేందుకు ప్రయత్నించండి. రోజుకు ఒక్కసారి తిన్నా చాలు.. శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ కరిగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో కూడా వెల్లుల్లి ఉత్తమమైన ఔషధంగా చెప్పుకుంటారు. ఇందులో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇదే కొలెస్ట్రాల్ కరిగించేందుకు మనకు సహాయపడుతుంది.
వెల్లుల్లి వల్ల లాభాలు
కొలెస్ట్రాల్ ను కరిగించడం కోసమే కాదు వెల్లుల్లి ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ష్లమేటరీ గుణాలు ఎక్కువ. కాబట్టి వెల్లుల్లి చట్నీని తినడం వల్ల మీకు రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణం కూడా అవుతుంది. మీ రోగ నిరోధక శక్తి పెరిగి అంటువ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పిన పద్ధతిలో మీరు వెల్లుల్లి చట్నీని చేసుకుని తిని చూడండి. ఇది రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది.