Reduce Salt in Curry: కూర, సాంబార్‌లో ఉప్పు ఎక్కువైందా? ఈ చిట్కాతో తగ్గించేయండి
Reduce Salt in Curry: కూరలో ఉప్పు అధికంగా పడడం సాధారణంగా జరిగే విషయమే. అధిక ఉప్పు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కూరల్లో, సాంబార్లో ఉప్పు ఎక్కువైనప్పుడు దాన్ని తినడం కష్టం. ఇలాంటప్పుడు ఉప్పును తగ్గించే కొన్ని చిట్కాలు పాటించాలి.

కూరలో ఉప్పు ఎక్కువగా పడితే
కొన్నిసార్లు కూరలు, సాంబార్, రసం వంటివి వండినప్పుడు ఉప్పు అధికంగా పడుతుంది. అలాంటి సమయంలో ఉప్పగా ఉన్న కూరను తినలేక, పడేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగని ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు తింటే ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు. కూరలో ఉప్పు అధికంగా ఉన్నప్పుడు చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు. ఈ చిన్న చిట్కాలు కూరను మరింత రుచిగా చేయడంతో పాటూ ఉప్పదనాన్ని తగ్గిస్తాయి.
కారం వేయండి
ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు ఉప్పును మరొక మసాలాతోనే సరిచేయాలి. అదనపు ఉప్పును తగ్గించడానికి మీకు కారం అద్భుతంగా పనిచేస్తుంది. మీకు స్పైసీ ఫుడ్ ఇష్టమైతే సాంబార్ లేదా కూరలో కారం పొడి లేదా పచ్చిమిర్చిని వేసి కాసేపు ఉడికించండి. ఇలా చేస్తే చాలా వరకు ఉప్పు రుచి తగ్గుతుంది.
బంగాళదుంప
ప్రతి ఇంట్లోను బంగాళదుంపలు ఆలూ కచ్చితంగా ఉంటాయి. వీటిలో కొద్దిగా తీపి రుచి ఉంటుంది. ఇది మసాలా రుచిని, కారాన్ని ఉప్పును పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే మీ సాంబార్‌లో బంగాళదుంప ముక్కలను వేసి కలిపితే చాలా వరకు ఉప్పు తగ్గుతుంది. ఉప్పు తగ్గడమే కాకుండా, రుచి కూడా పెరుగుతుంది.
శనగపిండి
బంగాళదుంప రుచి వేయడం మీకు నచ్చకపోతే కూర లేదా సాంబార్‌లో శనగపిండి కలపడం మంచిది. కొద్దిగా శనగపిండిని ఒక గిన్నెలో వేసి, ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి బాగా కలపండి. దాన్ని కూర, సాంబార్ లో వేసి ఉడికించాలి. శనగపిండి కూడా ఉప్పును బ్యాలెన్స్ చేస్తుంది.
దేశీ నెయ్యి
ఇంట్లో నెయ్యి ఉంటే దాన్ని వాడడం కూడా మంచిదే. దేశీ నెయ్యి కలపడం వల్ల ఉప్పు, కారం పొడి లేదా గరం మసాలా చక్కగా బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి వేడి వేడి కూరలో దేశీ నెయ్యి వేసి కలపండి. స్టవ్ మీద పెట్టి మళ్లీ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇది కచ్చితంగా రుచిని, ఉప్పును బ్యాలెన్స్ చేస్తుంది.
పెరుగు వాడండి
ప్రతి ఇంట్లో పెరుగు ఉంటుంది. కప్పు పెరుగు ఉప్పు రుచిని చాలా వరకు తగ్గిస్తుంది. ఉప్పుగా ఉండే కూరలో, సాంబార్ లో పెరుగను వేయడం వల్ల కారాన్ని తగ్గించడమే కాకుండా, ఉప్పును కూడా బ్యాలెన్స్ చేస్తుంది.

