Toddy Health Effects: కల్లు తాగడం మంచిదేనా? తాగగానే ఎందుకు మత్తెక్కిపోతుంది?
Toddy Health Effects: చాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు కల్లు తాగేవారు ఎంతోమంది. కల్లు తాగిన తర్వాత వారు మత్తులో తూగుతూ ఉంటారు. కొంతమంది మాత్రం కల్లు తాగడం ఆరోగ్యకరమైన చెబుతారు. ఇందులో నిజం ఎంతో తెలుసుకుందాం.

కల్లు అంటే ఏమిటి?
కల్లును అనేక రకాలుగా తయారు చేస్తారు. తాటి చెట్ల నుంచి దీన్ని తయారుచేస్తారు. ఎక్కువగా తాటికల్లు, ఈత కల్లుకు అభిమానులు ఎక్కువ. చెట్టు నుంచి తాజాగా వచ్చిన రసం కల్లు. దాన్ని కుండలో పెట్టి బాగా పులియబెడతారు. అది పులిసిన తర్వాత కల్లుగా మారుతుంది. పులియక ముందు అది కేవలం ఒక తీయని రసం మాత్రమే. గ్రామాల్లో కల్లును తాగడం సంప్రదాయంగా భావిస్తారు. దీనిని ఆరోగ్యానికి మంచిదిగా, నొప్పులను తగ్గించేదిగా భావిస్తారు. పూర్వకాలంలో వ్యవసాయ పనులు చేసి తీవ్ర అలసటతో ఒళ్ళు నొప్పులతో వచ్చిన రైతులు ఈ కల్లు తాగేవారని కంటి నిండుగా నిద్రపోయే వారిని చెబుతారు. అదే సాంప్రదాయంగా మారి ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. అయితే కల్లు తాగిన తర్వాత బాగా మత్తెక్కిపోతుంది. దీనికి కారణం అందులో ఉండే ఆల్కహాల్.
కల్లు తాగితే మత్తెందుకు?
చెట్ల నుంచి రసాన్ని సేకరించాక దాన్ని బాగా పులియబెడతారు. చెట్ల రసంలో సహజంగా ఉండే చక్కెరపై ఈస్ట్ అనే సూక్ష్మజీవులు చేరుతాయి. ఈ ప్రక్రియలో చక్కెర ఆల్కహాల్ గా మారిపోతుంది. అందుకే కల్లు కూడా ఆల్కహాల్ గానే చెప్పుకోవాలి. ఈ కల్లును తాగిన వెంటనే రక్తంలో చేరిపోయి మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల ఆలోచనా శక్తి తగ్గిపోవడం, మాట తడబడడం, తల తిరిగినట్టు అనిపించడం, శరీరంపై నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి మత్తు మరీ ఎక్కువైపోతే విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆల్కహాల్ తాగిన తర్వాత కనిపించే లక్షణాలు ఇవన్నీ. కల్లును తక్కువ మోతాదులో తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు రావు.
అతిగా తాగితే సమస్యలు
కల్లును మత్తెక్కేంతగా తాగకూడదు. చాలా తక్కువ మోతాదులో తాగితే కొంతవరకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణక్రియ సవ్యంగా జరిగితే ఆకలి పెరుగుతుంది. అలా అని ప్రతిరోజు కల్లు తాగడం అలవాటుగా మార్చుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు. కల్లు కూడా ఆల్కహాల్ లాగే కాలేయం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రక్త పోటును పెంచేసి గుండె సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తుంది. శరీరాన్ని బలహీనపరుస్తుంది. రోజూ కల్లు తాగడం అలవాటుగా మారితే మీరు దానికి బానిస అయిపోతారు. ఒకసారి కల్లుకు అలవాటు పడితే మారడం చాలా కష్టం. దీనివల్ల కుటుంబంలో సమస్యలు పెరిగే ఆర్థికంగా కూడా కుంగిపోయే అవకాశం ఉంటుంది.
కల్లు తాగడం మంచిదేనా?
కల్లు తయారీదారులు సహజమైన కల్లును అమ్మే అవకాశం లేదు. తాగే వారికి త్వరగా మత్తు రావాలని అందులో కొన్ని నకిలీ పదార్థాలు, రసాయనాలు కలుపుతారు. దీని వల్ల కల్లు తాగిన వెంటనే మత్తెక్కిపోతుంది. కానీ దీన్ని అతిగా తాగితే తీవ్రమైన అనారోగ్యాలు కలగవచ్చు. కంటిచూపు పోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకి ప్రమాదంగా మారుతుంది. అందుకే కల్లు సహజమైనదే అయినా దానిని ఎక్కువగా తాగడం ఏ మాత్రం మంచిది కాదు.

