Chanakya Niti: ఈ నాలుగు విషయాల్లో మగవారు మహిళల ముందు ఎందుకూ పనికిరారు
Chanakya Niti: అపర చాణక్యుడు చాణక్య నీతి పేరుతో భారతీయ తత్వశాస్త్రాన్ని ముందే రాశాడు. ఆయనకు రాజకీయ విజ్ఞానంతో పాటు జీవితం పై కూడా అవగాహన ఎక్కువ. జీవితంలో స్త్రీలు, పురుషులు ఎలా ఉంటే విజయవంతమవుతారో, ఎలా ఉంటే కుప్పకూలిపోతారో ఆయన ముందే అంచనా వేశాడు.

చాణక్య నీతి
చాణక్య నీతి లేదా కౌటిల్య నీతి రాసింది అపర చాణక్యుడు.ఇతడిని విష్ణు గుప్తుడు అని కూడా పిలుస్తారు. ఇతడిని మంచి దౌత్యవేత్తగా, ఆర్థికవేత్తగా ఆయనకి గొప్ప పేరు చరిత్రలో మిగిలిపోయింది. శతాబ్దాల క్రితం ఆయన రాసిన చాణక్యనీతి ఇప్పటికీ సందర్భానికి తగ్గట్టు చెప్పుకుంటూనే ఉంటాము. మానవ స్వభావాన్ని చాలా పరిశీలన చేసి అధ్యయనం చేసిన వ్యక్తి చాణక్యుడు. అందుకే ఎలాంటి వ్యక్తులు విజయవంతమవుతారు, ఎలాంటి వ్యక్తులు చెడిపోతారు, ఎలాంటి లక్షణాలు మనిషిని గొప్ప వాడిని చేస్తాయో.. ముందుగానే రాసి పెట్టారు. అలాగే స్త్రీలు.. పురుషులకంటే ఏ విషయాల్లో ఉన్నతంగా ఆలోచిస్తారో, ఉన్నతంగా పనిచేస్తారో కూడా ఆయన చెప్పారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం స్త్రీలలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు చాలా గొప్పవి. మగవాడు కోరుకున్నా కూడా అవి వారికి రావు. కొన్ని విషయాల్లో స్త్రీల ముందు మగవారు ఎందుకు పనికిరారు? ఆ అంశాలు ఏమిటో తెలుసుకుందాం.
మానసికంగా బలవంతులు
అదేంటి? చిన్న చిన్న విషయాలకే ఏడ్చేది ఆడవాళ్లే కదా అనుకోవచ్చు. కేవలం ఏడుస్తారు.. తమ బాధని ఏడుపు రూపంలో బయటపెడతారు.. కానీ కుంగిపోరు. చాణక్యుడు చెబుతున్న ప్రకారం ఇదే వారి బలం. స్త్రీలు పురుషుల కంటే మానసికంగా, భావోద్యోగపరంగా చాలా శక్తివంతులు. చిన్న చిన్న సమస్యలకే మగవారికి కోపం వచ్చేస్తుంది. నిగ్రహాన్ని కోల్పోతారు. ప్రశాంతంగా ఉండలేరు. కానీ స్త్రీలు మాత్రం ఎలాంటి కష్ట సమయం వచ్చినా నిబ్బరంగా, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. తమ కుటుంబ సంతోషం కోసం త్యాగం చేసేందుకు ముందుంటారు. ధైర్యంగా ఉండడంలో మగవారితో పోలిస్తే ఎక్కువ మార్కులు పడాల్సిందే.
అనుబంధాలు కాపాడుతారు
చాణక్యనీతి ప్రకారం పురుషులు మాదిరిగా స్త్రీలు సంబంధాలను కోపంతో తెంచుకోరు. వాటిని కాపాడుకునేందుకు తిరిగి కలసిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఏ అనుబంధాన్నైనా విడిపోకుండా నిరోధించే సామర్థ్యం స్త్రీలకు ఉంటుంది. సహజంగానే మహిళలకు సహనం అధికం. కుటుంబంలో గొడవలు రాకుండా ఐక్యంగా ఉంచేందుకు వారు రాజీ పడతారు. ఇంట్లో మంచి వాతావరణాన్ని కాపాడుకుంటూ ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు తమ గొంతు వినిపించాలో వారికి తెలుసు. కానీ మగవారికి మాత్రం కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేరు. అనుబంధాలు తెగిపోయేలా మాట్లాడతారు. స్త్రీలాగా చాకచక్యంగా అనుబంధాలను కాపాడుకోవడం పురుషులకు చేతకాదు. కుటుంబాన్ని కలిపే ప్రేమ, కరుణ, దయ వంటి పువ్వులు గుచ్చిన దారం స్త్రీ చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. అదే పురుషుడైతే ఆధారాన్ని కోపం వచ్చినప్పుడల్లా తెంపుకుంటూ పోతాడు.
దూరదృష్టి ఎక్కువ
చాణక్యుడు చెబుతున్న ప్రకారం స్త్రీలు, పురుషుల కంటే చక్కగా ఆలోచిస్తారు. చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దూర దృష్టి ఎక్కువ. ఏదైనా కష్ట పరిస్థితి వచ్చినప్పుడు కేవలం ఈ క్షణం కోసం కాకుండా భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలదే పై చేయి. ఈ విషయంలో పురుషులు తొందరపాటుగా, అహంకారంగా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. తామే తెలివైన వారు అనుకుని ప్రతిసారీ ఏదో ఒక తప్పును పురుషులు చేసే అవకాశాలు ఎక్కువ.
మాట్లాడే నేర్పు
మగవాడికి మాట్లాడే నేర్పు ఉండదు. దానివల్లే చిన్న చిన్న గొడవలు కూడా పెద్దపెద్ద సమస్యలకు కారణం అవుతాయి. మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక చాలా ముఖ్యం. ఈ విషయంలో మహిళ ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది. మహిళలు తమ మాటలను చాలా పొదుపుగా, ఆలోచనాత్మకంగా వినియోగిస్తారు. ఎవరి హృదయాన్ని ఎలా గెలుచుకోవాలో వారికి బాగా తెలుసు. కేవలం మాటలతోనే సమస్యను పరిష్కరించడం కూడా వారికి తెలుసు. పురుషులకు మాత్రం ఈ విషయంలో సున్నా మార్కులే వేయాలి. వారు కోపం ప్రదర్శిస్తూ కఠినమైన పదాలను వాడుతారు. దీని వల్ల సంబంధాలు నాశనం అయిపోతాయి.

