Skin Care: ముఖం పై మొటిమలా.. ఇలా చేస్తే మటుమాయం
మొటిమ చిన్నదే.. కానీ దానివల్ల అమ్మాయిలు పడే బాధ మాత్రం వర్ణనాతీతం. అవి తమ మొహాన్ని చెడగొడతాయనీ, నలుగురిలో ఆత్మవిశ్వాసంతో తిరగలేమనీ.. తెగ ఇబ్బంది పడుతుంటారు. రకరకాల క్రీములు రాస్తుంటారు. ఇకపై అంత బాధ, ప్రయాస పడనక్కర్లేదు. చిన్న చిన్న చిట్కాలతోనే మొటిమలకు చెక్ పెట్టవచ్చు.

మొటిమలు వేర్వేరు
చర్మ సంబంధ సమస్యల వల్ల వచ్చే మొటిమలు శరీరంలో ఏ ప్రాంతంలోనైనా రావచ్చు. ఇవి కొద్దిరోజులు కాగానే వాటంతట అవే తగ్గిపోతాయి. ఇవి సాధారణంగా తెల్లని లేదా నల్లని బొడిపలులా ఉంటాయి. కానీ హార్మోన్ల వల్ల వచ్చే మొటిమలు- ముఖం కింది భాగంలోను, గెడ్డం మీద, మెడ మీద ఏర్పడతాయి. వీటిని గోకితే మంట ఏర్పడుతుంది. ఇవి మామూలు క్రీముల వల్ల తగ్గిపోవు. వైద్యులు వీటి కోసం ప్రత్యేకమైన క్రీములను నిర్దేశిస్తారు.
ఎందుకు వస్తాయి?
మొటిమలు ఎందుకు వస్తాయి అనే దానికి సరైన కారణం తెలియదు. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మన చర్మంపై రంధ్రాలు పూడుకుపోయినప్పుడు, హార్మోన్ల అసమతౌల్యం కారణంగా ఈ మొటిమలు ఏర్పడతాయి. ఈస్ట్రోజెన్, ప్రొజిస్టిరాయిన్, యాండ్రోజిన్ వంటి హార్మోన్లలో తేడా వచ్చినప్పుడు- శరీరంలో శీబం అనే రసాయన ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల చర్మంపై ఉన్న రంధ్రాలు పూడుకుపోతాయి. దీని వల్ల మొటిమలు ఏర్పడతాయి.
తగ్గించే మార్గాలు
మనకు అందుబాటులో రకరకాల వాటితోనే మొటిమలను తేలికగా తగ్గించుకోవచ్చు.
అలోవీరా: అలోవీరా వల్ల చర్మంపై ఉన్న దద్దుర్లు తగ్గుతాయి. చర్మం మెరుస్తుంది. అలోవెరాలో (Aloevera) యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడుతాయి. అలోవెరా జెల్ ను మొటిమలపై అప్లై చేసుకుని పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి.
టీ ట్రీ ఆయిల్: టీ ట్రీ ఆయిల్ వల్ల మొటిమలు తగ్గుతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వారం రోజులు రాసుకుంటే కొంత ఫలితం కనిపిస్తుంది.
గ్రీన్ టీ:
గ్రీన్‌టీ డికాక్షన్‌ను రాయటం వల్ల చర్మంపై ఎరుపు తగ్గుతుంది. మరకలు మాయం అవుతాయి. ఇది కొన్నిరోజులపాటు క్రమంతప్పకుండా చేయాలి.
తాజా పండ్లు: పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ముఖంపై ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. అలాగే పండ్లలో ఉండే విటమిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) కొలాజిన్ (Collagen) ఉత్పత్తికి సహాయపడుతాయి. దీంతో చర్మ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.