Extreme cold: ఇతరుల కన్నా మీకే ఎక్కువ చలి అనిపిస్తుందా? అయితే ఈ లోపం ఉన్నట్టే
Extreme cold: మన శరీరంలో విటమిన్లు లోపిస్తే ఎన్నో రకాల లక్షణాలు కనిపిస్తాయి. అలాగే చలికాలంలో కొన్ని రకాల పోషకాలు లోపిస్తే అధికంగా చలి వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐరన్, విటమిన్ బి12 లోపం వల్ల చలి అధికంగా అనిపిస్తుంది.

కొందరికే చలి ఎక్కువెందుకు?
చలికాలంలో చలివేయడం సహజం.కానీ ఇతరులతో పోలిస్తే కొందరికి అతిగా చలి అనిపిస్తుంది. వాతావరణం వల్లే ఇలా జరుగుతుందనుకుంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో రెండు ముఖ్యమైన పోషకాలైన ఐరన్, విటమిన్ B12 లోపించడమే. శరీరంలో ఈ పోషకాలు తగ్గిపోయినప్పుడు రక్తం సరిగ్గా తయారుకాక, శరీరానికి వేడి సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల సాధారణ ఉష్ణోగ్రతలో కూడా చలి ఎక్కువగా అనిపించడం ప్రారంభమవుతుంది.
ఐరన్ లోపం
ఐరన్ మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి అవసరమైన ప్రధాన పోషకం. హిమోగ్లోబిన్ రక్తంలోని ఆక్సిజన్‌ని శరీర భాగాలకు తీసుకెళ్లే పాత్ర పోషిస్తుంది. ఐరన్ లోపిస్తే హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోతాయి. దీని వల్ల శరీరానికి కావలసిన ఆక్సిజన్ చేరదు. ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయినప్పుడు శరీరానికి సాధారణంగా వేడి ఉత్పత్తి కాదు. అందుకే చలి తక్కువగా ఉన్నా కూడా కొందరిలో మాత్రం అతిగా అనిపిస్తుంది. అదనంగా, ఐరన్ లోపం అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖంపై నలుపుదనం వంటి లక్షణాలనూ కలిగిస్తుంది.
విటమిన్ B12 లోపం
విటమిన్ B12 కూడా రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ తక్కువగా ఉన్నప్పుడు రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీని ఫలితంగా శరీరం వేడిని నిలుపుకోలేకపోతుంది. చేతులు, కాళ్లు ఎప్పుడూ చల్లగా ఉండటం, శక్తి లేకుండా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులు లేదా నాన్‌వెజ్ ఎక్కువగా తిననివారిలో ఈ లోపం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి చేతులు, కాళ్లలో నొప్పులు, తిమ్మిర్లు రావడం కూడా ఈ లోపం లక్షణంగా చెప్పుకోవాలి.
ఏం తినాలి?
చలి ఎక్కువగా అనిపించే సమస్యను తగ్గించుకోవడానికి ఆహారంలో చిన్న చిన్న మార్పులు చాలా ఉపయోగపడతాయి. ఐరన్ కోసం పాలకూర, మునగాకు, బీట్‌రూట్, పప్పులు, నువ్వులు, శనగలు, బాదం, ఖర్జూరం వంటి వాటిని ఆహారంలో చేర్చాలి. విటమిన్ B12 కోసం గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, చికెన్ వంటి ఆహారాలు మంచి వనరులు. పూర్తిగా శాకాహారులు అయితే వైద్యుడి సలహాతో ప్రత్యేక B12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు. ఇవి శరీరానికి రక్త తయారీ వేగాన్ని పెంచి, శరీరంలో వేడి నిలుపుకునే శక్తిని ఇస్తాయి.
ఎప్పుడు చికిత్స అవసరం?
చలిని తట్టుకోలేకపోవడం,రోజంతా అలసటగా అనిపించడం, శరీరంలో బలహీనత పెరగడం వంటి లక్షణాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణ రక్త పరీక్ష చేయించుకోవడం ద్వారా ఐరన్, హిమోగ్లోబిన్, B12 స్థాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. వీటి లోపం ఉంటే డాక్టర్ సూచించే ఆహారం లేదా మందుల ద్వారా ఈ సమస్య పూర్తిగా తగ్గించుకోవచ్చు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని బలంగా మార్చడమే కాదు... చలిని కూడా తట్టుకోవచ్చు.

