Digestion Time: మనం తినే ఫుడ్ అరగడానికి ఎంత టైం పడుతుంది? అరగకముందే మళ్లీ ఆకలి వేస్తుందా?
Digestion Time: మనం రోజూ ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు రకరకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. అయితే మనం తిన్న ఆహారం ఎంతసేపటికి అరుగుతుంది? అది పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ ఆకలి వేస్తుందా? అసలు జీర్ణవ్యవస్థలో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మనం తినే ఫుడ్ అరగడానికి ఎంత టైం పడుతుంది?
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ ఆహారం సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే ముఖ్యం. మనం రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ ఇలా రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటుంటాం. అయితే మనం తిన్న ఆహారం కడుపులోకి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది? అది పూర్తిగా జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది? అన్నం తింటే త్వరగా అరుగుతుందా? నాన్ వెజ్ తింటే ఎక్కువ సమయం పడుతుందా? తిన్న ఆహారం జీర్ణం కాకముందే మళ్లీ ఆకలి వేస్తుందా? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. ఇక్కడ క్లియర్ చేసుకుందాం.
ఆహారం ఎలా జీర్ణమవుతుంది?
నిపుణుల ప్రకారం.. మనం ఆహారం తినగానే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా పళ్లతో ఆహారాన్ని నమిలినప్పుడు లాలాజలంలోని ఎంజైమ్‌లు ఆహారంలోని పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత ఆహారం అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుతుంది. అక్కడ జీర్ణరసాలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆహారాన్ని మరింత చిన్న భాగాలుగా విడగొడతాయి. ముఖ్యంగా ప్రోటీన్ల జీర్ణక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది. అనంతరం ఆహారం చిన్న ప్రేగుల్లోకి చేరుతుంది. ఇక్కడ పిత్తరసం, క్లోమగ్రంథి నుంచి విడుదలయ్యే ఎంజైమ్‌లు ఆహారాన్ని మరింతగా జీర్ణం చేస్తాయి.
ఏ ఆహారం జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది?
మనం తీసుకునే ప్రతి ఆహారం ఒకే టైంలో జీర్ణం కాదు. నిపుణుల ప్రకారం ఒక ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి 24 నుంచి 72 గంటల వరకు టైం పడుతుంది. పండ్లు, కూరగాయలు, అన్నం, పప్పులు, మాంసాహారం ఇలా ఒక్కో ఆహారానికి ఒక్కో విధమైన జీర్ణక్రియ ఉంటుంది. సాధారణంగా నీరు కడుపు నుంచి చాలా త్వరగా బయటకు వెళ్లిపోతుంది. అయితే ఘన ఆహార పదార్థాలకు ఎక్కువ సమయం పడుతుంది. పుచ్చకాయ, బొప్పాయి వంటి పండ్లు తేలికగా జీర్ణమయ్యే ఆహారాల్లోకి వస్తాయి. అయితే పండ్లలోని ఫైబర్, వాటిని ఇతర ఆహారాలతో కలిపి తినడం వంటి అంశాల వల్ల జీర్ణక్రియ సమయం మారవచ్చు.
అన్నం, ఇడ్లీ, ఉప్మా వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు సాధారణంగా కడుపు నుంచి చిన్న ప్రేగుల్లోకి వెళ్లడానికి కొన్ని గంటలు పడుతుంది. పప్పులు, శనగలు, రాజ్మా వంటి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు కొంత ఎక్కువ సమయం తీసుకోవచ్చు. గుడ్లు, చేపలు, చికెన్, మటన్ వంటి ప్రోటీన్ పదార్థాలు కూడా జీర్ణం కావడానికి వాటి తయారీ విధానం, కొవ్వు శాతం, పరిమాణాన్ని బట్టి సమయం మారుతుంది.
ఆహారం అరగకముందే ఆకలి వేస్తుందా?
సాధారణంగా భోజనం చేసిన రెండు మూడు గంటలకే మళ్లీ ఆకలి వేస్తుంటుంది. అప్పుడు మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అయిపోయిందని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే కూడా ఆకలి వేయవచ్చు. ఎందుకంటే ఆకలి అనేది కేవలం కడుపు ఖాళీ కావడంపై మాత్రమే ఆధారపడి ఉండదు. మన శరీరంలోని హార్మోన్లు, రక్తంలో చక్కెర స్థాయులు, ఆహారంలో ఉండే పోషకాలు, నిద్ర, శారీరక శ్రమ వంటి అంశాలు కూడా ఆకలిపై ప్రభావం చూపిస్తాయి.
త్వరగా ఆకలి వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి?
తిన్న వెంటనే మళ్లీ ఆకలి వేస్తుంటే ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. రోజువారీ భోజనంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే గుడ్లు, పప్పులు, పెరుగు వంటి ప్రోటీన్ పదార్థాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం.









