Cancer with Eggs: ఈ గుడ్లలో ప్రమాదకర రసాయనాలు.. తింటే క్యాన్సర్ వస్తుందా?
Cancer with Eggs: కొన్ని బ్రాండ్లకు చెందిన గుడ్లలో ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఒక వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారమే రేగుతుంది.

గుడ్లలో ప్రమాదకర రసాయనాలు
మార్కెట్‌లో లభించే కొన్ని బ్రాండ్ల గుడ్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ రసాయనాలు నేరుగా మన DNA ను దెబ్బతీసి క్యాన్సర్ ముప్పును పెంచుతాయని ఆ వార్తల సారాంశం. దీన్ని చూసి ప్రజలు ఆందోళన ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే గుడ్లపై ఇలాంటి వార్తలు రావడంతో చాలా మంది భయపడుతున్నారు.
ఏ డాక్టర్ చెప్పారు?
ముంబైకి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మనన్ వోరా ఈ వార్తపై ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను కూడా అదే బ్రాండ్ గుడ్లను తరచూ తింటానని చెప్పిన డాక్టర్ వోరా, ఈ అంశం ఎంత సీరియస్ అనేదాన్ని తెలియజేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఒక ల్యాబ్ రిపోర్టు గురించి చెబుతూ ఆ గుడ్లలో నైట్రోఫ్యూరాన్, నైట్రోమిడాజోల్ వంటి నిషేధిత రసాయనాలు ఉన్నట్లు తెలిపారు.
కోళ్ల పెంపకంలోనే రసాయనాల వాడకం
డాక్టర్ వోరా చెప్పిన ప్రకారం కోళ్ల పెంపకంలో ఈ రసాయనాలను ఉపయోగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. కోళ్లకు వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి, గుడ్ల ఉత్పత్తి పెంచడానికి కొంతమంది కొన్ని రసాయనాలను వాడుతున్నారని చెప్పారు. ఇవి జెనోటాక్సిక్ కెమికల్స్. అంటే మన శరీరంలోని DNA పై నేరుగా ప్రభావం చూపే పదార్థాలు. దీని వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు.
FSSAI ఏం చేస్తోంది?
భారత ఆహార నియంత్రణ సంస్థ FSSAI ప్రమాణాలపై కూడా డాక్టర్ వోరా ప్రశ్నించారు. ఇతర దేశాలు ఈ రసాయనాలపై ‘జీరో టాలరెన్స్’ పాటిస్తుంటే, భారత్‌లో మాత్రం కొన్ని పరిమితుల వరకు అనుమతించడాన్ని విమర్శించారు. ఇలాంటి రసాయనాలు ఉన్న గుడ్లు మార్కెట్లో స్వేచ్ఛగా అమ్ముడవడం ఆశ్చర్యకరం అని ఆయన పేర్కొన్నారు.
ఫర్వాలేదు తినొచ్చా?
అయితే భయపడాల్సిన అవసరం లేదని కూడా డాక్టర్ వోరా స్పష్టం చేశారు. ఈ రిపోర్టు ఒకే బ్రాండ్‌లోని ఒకే బ్యాచ్‌కు సంబంధించినదే తప్ప అన్ని గుడ్లు హానికరం కావని చెప్పారు. ఈ వివాదం తర్వాత ఆ బ్రాండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఉత్పత్తులు సురక్షితమని వివరణ ఇచ్చింది. FSSAI,సదరు బ్రాండ్ ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇచ్చాయి. తమ గుడ్లు తినడం సేఫ్ అని ఆ బ్రాండ్ సోషల్ మీడియాలో ప్రకటించింది

