Curry Leaves: కరివేపాకును ఇలా తింటే మీరు బరువు తగ్గడం పక్కా..
Curry Leaves: బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీరు రోజూ తినే కరివేపాకుతో కూడా మీరు సులువుగా కొవ్వును కరిగించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కరివేపాకు
ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ చాలా చిన్న సమస్యగా కనిపించినా ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారి తీస్తుంది. అందుకే వెయిట్ లాస్ అయ్యేందుకు ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మనం రోజూ కూరల్లో వాడే కరివేపాకుతో కూడా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సులువుగా కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కరివేపాకును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కొవ్వును కరిగించడానికి కరివేపాకు ఎలా సహాయపడుతుంది?
జీవక్రియను పెంచుతుంది
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీర జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఇది మీ శరీరంలో కేలరీలు ఫాస్ట్ గా కరగడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మీరు బరువు తగ్గుతారు.
జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది
కరివేపాకు మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను సక్రీయం చేసి తిన్నది తొందరగా అరగడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో మీరు బరువు పెరిగే అవకాశం ఉండదు.
కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది
కరివేపాకులో కొన్ని మూలకాలు ఉంటాయి. ఇవి లిపిడ్ల జీవక్రియను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ఇది మీ శరీరంలో అదనంగా నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
కరివేపాకు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.