ఇవి తిన్నారంటే జుట్టు ఊడిపోతుంది జాగ్రత్త
Hair Fall: ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. నూనె, షాంపూల వల్లే ఇలా వెంట్రుకలు ఊడిపోతున్నాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ మనం తినే కొన్ని ఆహారాల వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది.

హెయిర్ ఫాల్
జుట్టు రాలిపోతుందని షాంపూలను, నూనెలను మారుస్తుంటారు. కానీ వీటివల్లే కాదు మనం తినే కొన్ని రకాల ఆహారాల వల్ల కూడా జుట్టు బాగా రాలుతుంది. ఎందుకంటే అవి జుట్టును మూలాల నుంచి బలహీనంగా చేసి ఊడిపోయేలా చేస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలంటారు నిపుణులు.
జుట్టు ఊడిపోవడానికి కారణమయ్యే ఆహారాలు
తీపి పదార్థాలు
తీపి పదార్థాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి మనం బరువు పెరిగేలా చేయడమే కాకుండా.. జుట్టు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. చక్కెరను ఎక్కువగా తింటే శరీరంలో ఇన్సులిన్ పెరుగుతుంది. దీంతో ఆండ్రోజెన్లు అనే హార్మోన్ లెవెల్స్ పెరిగి జుట్టు కుదుళ్లు బలహీనంగా అవుతాయి. దీనివల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. ముఖ్యంగా మహిళలలో PCOD, PCOS ఉన్నవారికి దీనివల్ల జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తీపి పదార్థాలను ఎక్కువగా తినకూడదు.
వైట్ బ్రెడ్, మైదా పదార్థాలు
మైదాతో చేసిన ఆహారాలు, వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే మైదా, ఇతర రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీంతో శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్లు పెరుగుతాయి. దీని ప్రభావం వల్ల జుట్టు ఊడిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తినకూడదు.
ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ అయిన చిప్స్, స్నాక్స్, పిజ్జా, బర్గర్లను బాగా తింటుంటారు. కానీ వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో మంటను కలిగించడమే కాకుండా జుట్టుకు అవసరమైన పోషకాలు జుట్టు మూలాలకు చేరకుండా చేస్తాయి. దీంతో జుట్టు బలహీనపడి ఊడిపోవడం మొదలవుతుంది.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు
కొంతమంది ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను బాగా తింటుంటారు. కానీ ఉప్పు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఉప్పును ఎక్కువగా తింటే శరీరంలో సోడియం లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల జుట్టు పొడిబారడమే కాకుండా నిర్జీవంగా మారుతుంది. అలాగే వెంట్రుకలు బాగా ఊడిపోతాయి. ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్, పాప్‌కార్న్, పికిల్స్ వంటి ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని మితంగా తినాలి.
ఆల్కహాల్
ఆల్కహాల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల జుట్టు కూడా ఊడిపోతుంది. ఎలా అంటే ఆల్కహాల్ ను తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఈ ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. దీనితో జుట్టు బలహీనంగా కావడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.
కొవ్వు ఎక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు
కొవ్వు ఎక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివి కావు. ముఖ్యంగా జుట్టుకు. ఎందుకంటే ఇవి శరీరంలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. సెబమ్ అనేది ఒక జిడ్డుగల పదార్థం. ఇది జుట్టు రంధ్రాలకు అడ్డుపడి జుట్టు పెరగడాన్ని ఆపేస్తుంది. అలాగే జుట్టు రాలడానికి దారితీస్తుంది. మీకు హెయిర్ ఫాల్ సమస్య గనుక ఉంటే తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులనే తీసుకోండి.
సోడా, కార్బొనేటెడ్ డ్రింక్స్
కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి డ్రింక్స్ ను ఎక్కువగా తాగినా కూడా జుట్టు ఊడిపోతుంది. ఎందుకంటే వీటిలో హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకు అవసరమైన న్యూట్రియెంట్స్‌ను అడ్డుకుంటుంది. దీనివల్ల జుట్టు బాగా ఊడిపోతుంది.
జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి?
జుట్టు రాలకుండా ఉండాలంటే మంచి హెల్తీ ఫుడ్ ను తినాలి. ముఖ్యంగా ఆకు కూరలు అంటే క్యాబేజీ, పాలకూర, తోలకూర, క్యారేట్ వంటి వాటిని తినాలి. అలాగే బాదం, వాల్ నట్స్, పెరుగు, తేనె, ఫ్రెష్ ఫ్రూట్స్, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారాలను తింటే మీ జుట్టు బలంగా ఉంటుంది. బాగా పెరుగుతుంది.