Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Dinner Mistakes: రాత్రిపూట కడుపు నిండా తిని హాయిగా నిద్రపోవాలని చాలామంది అనుకుంటారు. కానీ రాత్రి భోజనం విషయంలో మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపిస్తాయి. మరి రాత్రి భోజనం విషయంలో ఏ తప్పులు చేయకూడదో చూద్దాం.

రాత్రి భోజనం విషయంలో చేయకూడని తప్పులు
రోజంతా పని, ప్రయాణాలు, ఇంటి పనులతో అలసిపోయిన చాలామంది.. రాత్రిపూట మంచిగా భోజనం చేసి కాస్త ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకుంటారు. అయితే రాత్రి ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనే విషయాలపై చాలామంది పెద్దగా శ్రద్ధ పెట్టరు. ఉదయం, మధ్యాహ్నం భోజనాల విషయంలో జాగ్రత్తగా ఉండే వారు కూడా రాత్రి సమయానికి వచ్చేసరికి ఆకలి, అలసట కారణంగా ఏది దొరికితే అది తినడం లేదా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు కొంతమందిలో జీర్ణ అసౌకర్యం, నిద్రకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి రాత్రి భోజనం విషయంలో ఏ తప్పులు చేయకూడదో ఇక్కడ చూద్దాం.
చాలా ఆలస్యంగా భోజనం చేయడం
పని లేదా ఇతర కారణాల వల్ల రాత్రి 10, 11 గంటల తర్వాత భోజనం చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది. అప్పటికే శరీరం విశ్రాంతికి రెడీ అవుతుండటంతో భోజనం చేసిన వెంటనే పడుకుంటారు. దానివల్ల కడుపు భారంగా అనిపించడం లేదా అసౌకర్యం కలగవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు రాత్రి భోజనాన్ని 8 లోపు పూర్తి చేయడం మంచిది. ముఖ్యంగా భోజనం, నిద్ర మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
అవసరానికి మించి తినడం
చాలామంది రోజంతా సరిగ్గా భోజనం చేయకపోయినా, సాయంత్రం ఎక్కువగా ఆకలి వేసినా, రాత్రి ఒకేసారి ఎక్కువ మొత్తంలో భోజనం చేస్తుంటారు. ప్లేట్ నిండా అన్నం, దానికి తోడు కూరలు, ఫ్రైలు, స్వీట్లు లేదా ఇతర స్నాక్స్ తీసుకోవడం వల్ల మొత్తం భోజనం పరిమాణం పెరిగిపోతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో శారీరక శ్రమ తక్కువగా ఉండే వారికి ఇలాంటి అలవాటు మంచిది కాదు.
స్పైసీ ఫుడ్ తినడం
బజ్జీలు, పకోడీలు, ఫ్రైడ్ చికెన్, ఎక్కువ నూనెతో చేసిన వంటకాలు, చాలా కారంగా ఉండే ఆహారం రాత్రి సమయంలో చాలామందికి నచ్చుతాయి. కానీ ఇలాంటి ఆహారం ప్రతి ఒక్కరికీ సెట్ కాకపోవచ్చు. కొంతమందిలో మసాలా లేదా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న తర్వాత కడుపులో మంట, ఉబ్బరం లేదా ఇతర జీర్ణ అసౌకర్యాలు కనిపించవచ్చు. కాబట్టి ఆహారం తిన్నప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తుందో గమనించడం ముఖ్యం.
భోజనం చేసిన వెంటనే పడుకోవడం
రాత్రి భోజనం పూర్తయ్యాక వెంటనే మంచం ఎక్కడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా ఆలస్యంగా ఇంటికి చేరుకునేవారు ఈ తప్పు ఎక్కువగా చేస్తుంటారు. భోజనం తర్వాత కొంత సమయం మేల్కొని ఉండటం, సాధ్యమైతే కొద్దిసేపు నెమ్మదిగా నడవడం వంటి సాధారణ అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్నవారు భోజనం-నిద్ర మధ్య గ్యాప్ పై శ్రద్ధ పెట్టడం మంచిది.
మళ్లీ మళ్లీ స్నాక్స్ తినడం
భోజనం తర్వాత టీవీ చూస్తూ బిస్కెట్లు, చిప్స్, స్వీట్లు లేదా ఇతర స్నాక్స్ తినడం చాలామందికి సాధారణ అలవాటు. ఆకలి లేకపోయినా అలవాటు కోసం తినడం వల్ల రోజులో తీసుకునే మొత్తం ఆహారం పరిమాణం పెరగవచ్చు. ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్స్‌లో ఉప్పు, చక్కెర లేదా కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోకపోవడం మంచిది.

