Maha Deepam: వేల కిలోల నెయ్యి..రోజుల తరబడి వెలిగే జ్యోతి..ఏంటీ మహిమ?
Maha Deepam : వేల అడుగుల ఎత్తైన అరుణాచల కొండపై వెలిగించే మహా దీపం వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి. ఏటా ఉపయోగించే భారీ కొప్పరైని ఎలా తయారు చేస్తారు? కొండపైకి ఎలా చేరుస్తారు? వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనుక కథేంటి?

మహా దీపం కొప్పరై విశేషాలు
కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఆధ్యాత్మిక క్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం)పండుగ శోభను సంతరించుకుంటుంది. ఎక్కడ చూసినా అణ్ణామలైయార్ నామస్మరణ, గుడుల్లో శివ మంత్రాలు, ఇళ్లలో వెలిగించే దీపాలతో భక్తి భావం వెల్లివిరుస్తుంది.
ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహా దీపం వెలిగించే అద్భుత క్షణం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. 2,668 అడుగుల ఎత్తైన అణ్ణామలైయార్ కొండపై సాయంత్రం వేళ ఆకాశాన్ని కాంతివంతం చేసేలా వెలిగించే ఈ మహా దీపం సాధారణమైనది కాదు.
వందల ఏళ్ల చరిత్ర, దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసే భారీ కొప్పరై, కొండపైకి దాన్ని తీసుకెళ్లే విధానం, వేల లీటర్ల నెయ్యి, పొడవైన వత్తి.. ఇలా ప్రతీ దాని వెనుకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఏటా మహా దీపం వెలిగించే ఈ కొప్పరైని ఎలా తయారు చేస్తారు? దీన్ని ఎన్ని ఏళ్లుగా వాడుతున్నారు? కొండపైకి ఎలా తీసుకెళ్తారు? దీపం వెలిగించేందుకు చేసే ఏర్పాట్లు ఏంటి? అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఈ మహా దీపం కొప్పరై విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
తిరువణ్ణామలై మహా దీపం కొప్పరై
అరుణాచలేశ్వర ఆలయ కార్తీక దీపోత్సవంలో మహా దీపం కొప్పరైకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అణ్ణామలైయార్ కొండపై దీపం వెలిగించడానికి వాడే భారీ లోహపు పాత్రనే 'మహా దీపం కొప్పరై' అంటారు.
ఇందులో భారీగా నెయ్యి పోసి, పొడవైన గాడా వస్త్రాన్ని వత్తిగా వాడతారు. ఆ తర్వాత దీపం వెలిగిస్తారు. ఇది వరుసగా చాలా రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది.
ఈ కొప్పరై సాధారణ వంట పాత్ర లాంటిది కాదు. మంట వేడిని తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ప్రతి ఏటా కార్తీక దీపోత్సవానికి ముందు దాన్ని శుభ్రం చేసి, మరమ్మతులు చేసి పూజలకు సిద్ధం చేస్తారు.
మహా దీపం కొప్పరై ఎత్తు, బరువు ఎంత?
ఎత్తు - సుమారు 5 నుంచి 6 అడుగులు ఉంటుంది.
బరువు - కొన్నిసార్లు 130 నుంచి 300 కిలోల వరకు ఉంటుంది.
ఎన్ని ఏళ్లుగా వాడుతున్నారు?
కాలానికి అనుగుణంగా మహా దీపం కొప్పరైని ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. 1991లో మన్ను నాటార్ అనే వ్యక్తి తొలి కొప్పరైని తయారు చేసినట్లు చెబుతారు.
2003లో ఇనుము, రాగి కలిపిన లోహంతో కొత్త కొప్పరైని చేశారు. దాన్ని 13 ఏళ్ల పాటు వాడారు.
ఆ తర్వాత 2016లో పూర్తిగా రాగితో కొత్త కొప్పరైని తయారు చేశారు. 2020లో సుమారు 5 అడుగుల ఎత్తు, 200 కిలోల బరువున్న కొప్పరైని వాడినట్లు రికార్డులు చెబుతున్నాయి.
మహా దీపం కొప్పరైని ఎలా తయారు చేస్తారు?
ఈ కొప్పరై తయారీలో ప్రధానంగా రాగిని వాడుతారు. 2016లో చేసిన కొప్పరైకి దాదాపు 200 కిలోల స్వచ్ఛమైన రాగిని వాడారు.
అడుగు భాగం, పై భాగం
కొప్పరై అడుగు భాగం, పై భాగం విడివిడిగా తయారు చేసి, ఆ తర్వాత రెండింటినీ కలుపుతారు. ఇది బలంగా ఉండేందుకు లోహపు ముక్కలను కూడా అమర్చుతారు.
వేడిని తట్టుకునేలా..
చాలా రోజుల పాటు మండుతున్న మంట వేడిని తట్టుకునేలా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. వేడి వల్ల లోహం దెబ్బతినకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మరమ్మతులు కూడా చేస్తారు.
ఆధ్యాత్మిక చిహ్నాలు
ఈ కొప్పరైపై శివలింగం, నంది, అర్ధనారీశ్వరుడు వంటి పవిత్ర చిత్రాలను గీయడం మరో విశేషం. ముఖ్యంగా ఆడ, మగ ఇద్దరూ సమానమే అని చాటిచెప్పే అర్ధనారీశ్వరుడి రూపం ఈ కొప్పరైపై ఉండటం దీని ప్రత్యేకత.
కొండపైకి కొప్పరైని ఎలా తీసుకెళ్తారు?
కార్తీక దీపోత్సవంలో ఇది చాలా ఆసక్తికరమైన, సవాలుతో కూడుకున్న పని. 2,668 అడుగుల ఎత్తైన అణ్ణామలైయార్ కొండపైకి ఈ భారీ కొప్పరైని తీసుకెళ్లడం ఆషామాషీ కాదు. దీనికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న దీప నాటార్ బృందం రంగంలోకి దిగుతుంది.
- ముందుగా ఆలయంలో మహా దీపం కొప్పరైకి ప్రత్యేక పూజలు చేస్తారు.
- ఆ తర్వాత దాన్ని భద్రంగా కట్టి, పొడవైన చెక్క కర్రల సాయంతో పైకి ఎత్తుతారు.
- దీప నాటార్ బృందం సభ్యులు వంతుల వారీగా ఈ కొప్పరైని మోసుకుంటూ కొండ ఎక్కుతారు.
- కొప్పరైతో పాటే దీపం వెలిగించడానికి అవసరమైన వత్తి, నెయ్యి కూడా కొండపైకి చేరుస్తారు.
మహా దీపానికి ఎంత నెయ్యి వాడతారు?
మహా దీపం కోసం వాడే నెయ్యి పరిమాణం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇంట్లో మనం ప్రమిదల్లో కొన్ని చుక్కల నూనెతో దీపం పెడతాం. కానీ 2,668 అడుగుల ఎత్తైన కొండపై రోజుల తరబడి వెలిగే ఈ దీపానికి వేల కిలోల నెయ్యి అవసరం.
2022 - సుమారు 4,500 కిలోల నెయ్యి వాడారు.
2023 - 5 టన్నుల నెయ్యి, కిలోమీటరు పొడవైన గాడా వస్త్రాన్ని కొండపైకి తీసుకెళ్లారు.
2026 - తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవంలో మహా దీపం వెలిగించడానికి 4,500 కిలోల నెయ్యిని వాడుతున్నారు. దీనికోసం ఆలయ నిర్వహణ కమిటీ ఆవిన్ (Aavin) సంస్థ నుంచి ఈ 4,500 కిలోల నెయ్యిని కొనుగోలు చేసింది.
మహా దీపం వత్తి ప్రత్యేకత ఏంటి?
మహా దీపానికి సాధారణ వత్తిని వాడరు. పొడవైన గాడా వస్త్రాన్ని చుట్టి ఈ భారీ వత్తిని తయారు చేస్తారు.
భరణి దీపం ప్రత్యేకత ఏంటి?
మహా దీపానికి ముందు వెలిగించే భరణి దీపం అంటే ఏంటి?
మహా దీపం వెలిగించడానికి ముందు భరణి దీపం వెలిగించడం ఇక్కడి ఆనవాయితీ. మహా దీపం రోజే తెల్లవారుజామున అణ్ణామలైయార్ ఆలయ గర్భగుడి దగ్గర ఈ భరణి దీపాన్ని వెలిగిస్తారు.
పంచభూతాలకు ప్రతీకగా ఐదు మట్టి ప్రమిదల్లో ఈ దీపాలను వెలిగించడం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషం. ఉదయం భరణి దీపం వెలిగాకే, సాయంత్రం కొండపై మహా దీపాన్ని దర్శించుకుంటారు.
మహా దీపం ఎన్ని రోజులు వెలుగుతుంది?
ఈ మహా దీపం వరుసగా 11 రోజుల పాటు వెలుగుతుంది. దీనికోసం అవసరమైన నెయ్యి, వత్తులను ముందుగానే కొండపైకి చేరుస్తారు. దీపం వెలుగుతున్నన్ని రోజులు అవసరాన్ని బట్టి కొప్పరైలో నెయ్యి పోస్తూనే ఉంటారు.
11 రోజుల తర్వాత దీపం కొండెక్కాక, దీప నాటార్ బృందం ఆ కొప్పరైని జాగ్రత్తగా కిందకు తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆలయంలో దానికి ప్రత్యేక పూజలు చేసి, వచ్చే ఏడాది ఉత్సవాల కోసం భద్రపరుస్తారు.















