South Facing: దక్షిణ ముఖంవైపు ఉన్న ఇల్లు అశుభమా? సౌత్ ఫేసింగ్ ఇల్లు కొనకూడదా?
South Facing: ఎక్కువమంది తూర్పు ముఖం, పడమర, ఉత్తర ముఖంగా ఉన్న ఇల్లు మాత్రమే తీసుకునేందుకు ఇష్టపడతారు. సౌత్ ఫేసింగ్ ఇల్లు తీసుకునేందుకు ఇష్టపడరు. దక్షిణ ముఖం ఇల్లు మంచిది కాదా? వాస్తు ఏం చెబుతోంది?

సౌత్ ఫేసింగ్ ఇల్లు కొనకూడదా?
చాలామంది ఇల్లు కొనాలన్నా, కొత్తగా కట్టుకోవాలన్నా ముందుగా చూసేది ఇంటి దిశ. ముఖ్యంగా దక్షిణ ముఖంగా ఉన్న ఇళ్లను కొనడానికి కొందరు వెనుకాడుతుంటారు. దక్షిణం వైపు ప్రధాన ద్వారం ఉంటే ఇంటికి అశుభమని, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని భయపడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ ముఖం ఇల్లు ఉన్నంత మాత్రాన అది అశుభం కాదు.
ప్రాచీన వాస్తు గ్రంథాల్లో కూడా ఏ దిశను పూర్తిగా చెడ్డదిగా చెప్పలేదని నిపుణులు వివరిస్తున్నారు. ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉందన్న దానికంటే ఆ దిశలో ఏ భాగంలో ఏర్పాటు చేశారన్నది ముఖ్యమని చెబుతున్నారు. దక్షిణ దిశ గోడను 8 నుంచి 9 భాగాలుగా విభజించి చూస్తారు. ఇందులో దక్షిణ దిశకు మధ్యలో ఉండే S3, S4 భాగాల్లో ప్రధాన ద్వారం ఉంటే మంచిదని వాస్తు నమ్మకం. ఇలా ఉంటే ఇంట్లో నివసించే వారికి గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి ఉంటుందని భావిస్తారు. అయితే నైరుతి మూలకు దగ్గరగా ప్రధాన ద్వారం ఏర్పాటు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ప్రధాన ద్వారం విషయంలో ఈ జాగ్రత్తలు
దక్షిణ ముఖం ఇంటికి ప్రధాన ద్వారం ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇంట్లోని మిగతా తలుపుల కంటే ప్రధాన ద్వారం కొంచెం పెద్దదిగా, బలంగా ఉండాలి. తలుపు తెరిచినప్పుడు ఇంటి లోపలికి తెరుచుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. తెరిచేటప్పుడు, మూసేటప్పుడు శబ్దాలు రాకుండా చూసుకోవాలి. ప్రధాన ద్వారం దగ్గర సరైన వెలుతురు ఉండాలి. దక్షిణం, పడమర వైపు గోడలు బలంగా, ఎత్తుగా ఉండాలని వాస్తు నమ్మకం. ఉత్తరం, తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో వంటగది ఆగ్నేయంలో, ఇంటి పెద్దల పడకగది నైరుతిలో, పూజ గది ఈశాన్యంలో ఉండటం మంచిదని చెబుతారు. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా నిర్మాణం ఉండాలి
సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఈ తప్పులు చేయకండి
ఇప్పటికే దక్షిణ ముఖం ఇల్లు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు పేరుతో ఇంటిని కూల్చడం, ప్రధాన ద్వారాన్ని మార్చడం లాంటి పనులు తొందరపడి చేయకూడదు. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెత్త, చెప్పులు, అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. పెద్ద స్తంభాలు లేదా ఇతర వస్తువులు ద్వారం ఎదురుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. దక్షిణ దిశలో భూమి కింద నీటి ట్యాంకు, బోరు లేదా లోతైన గుంతలు ఏర్పాటు చేయకూడదని వాస్తు చెబుతోంది. ఆ దిశలో గోడలు బలంగా ఉండాలి. ప్రధాన ద్వారం దగ్గర చీకటి లేకుండా తగినంత వెలుతురు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇవన్నీ వాస్తు శాస్త్రంలోని సంప్రదాయ నమ్మకాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పలేం. ఇంటి నిర్మాణంలో గాలి, వెలుతురు, భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.















