Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 22 మంది మృతి. భారీ క్రేన్ పడడంతో..
Train Accident: థాయిలాండ్‌లో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 22 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది.?
థాయిలాండ్‌లో బుధవారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బ్యాంకాక్‌కు ఈశాన్యంగా సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రాచసీమ ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 9:05 గంటల సమయంలో రైలు ప్రయాణంలో ఉండగానే ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే.?
బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాచథానీ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు పైగా, హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా పనిచేస్తున్న భారీ క్రేన్ అకస్మాత్తుగా కూలింది. ఆ క్రేన్ నేరుగా రైలు పై పడటంతో రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు మంటలు అంటుకున్నాయి అని పోలీసులు వెల్లడించారు.
భారీగా మృతుల సంఖ్య
ప్రారంభంలో మృతుల సంఖ్య 12గా వెల్లడైనప్పటికీ, తరువాత AFP వార్తా సంస్థ సమాచారం ప్రకారం కనీసం 22 మంది మరణించారు. ఈ విషయాన్ని నఖోన్ రాచసీమ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ థాచ్‌పోన్ చిన్నావాంగ్ ధృవీకరించారు. ఇంకా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
రైలులో చిక్కుకున్న ప్రయాణికులు
థాయిలాండ్ ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక X ఖాతా ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రమాదం తర్వాత చాలామంది ప్రయాణికులు బోగీల్లో చిక్కుకుపోయారు. 30కిపైగా మంది గాయపడగా, పలువురిని బయటకు తీసేందుకు ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అని అధికారులు తెలిపారు.
DEVELOPING: Dozens of people have been killed and injured after a construction crane lifting a section of a bridge collapsed onto a passenger train in Sikhio, Thailand.
Contributed by @AZ_Intel_. pic.twitter.com/wnYDIszrrs— Open Source Intel (@Osint613) January 14, 2026
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, పట్టాలు క్లియర్ చేసే పని కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని థాయ్ అధికారులు తెలిపారు.

