- Home
- Feature
- Prabhas: రాజాసాబ్ సినిమాలో చెప్పిన సహస్ర చక్రం అంటే ఏంటి.? అది ఎలా యాక్టివ్ అవుతుంది..
Prabhas: రాజాసాబ్ సినిమాలో చెప్పిన సహస్ర చక్రం అంటే ఏంటి.? అది ఎలా యాక్టివ్ అవుతుంది..
Prabhas: ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమాలో “సహస్ర చక్రం” అనే ఆధ్యాత్మిక అంశం ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సీన్ చూసిన చాలామందికి సహస్ర చక్రం అంటే ఏంటి? నిజంగా అది ఉంటుందా? మనం దాన్ని తాకగలమా? అనే సందేహాలు వస్తున్నాయి.

ఇంతకీ సహస్ర చక్రం అంటే ఏంటి?
మన భారతీయ యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 ప్రధాన చక్రాలు ఉంటాయి. ఇవి శక్తి కేంద్రాలు అని భావిస్తారు. ఈ 7 చక్రాలలో చివరిది, అత్యున్నతమైనది సహస్ర చక్రం. ఇది తల పైభాగంలో, తలపాగా ప్రాంతంలో ఉంటుంది. “సహస్ర” అంటే వెయ్యి అని అర్థం. వెయ్యి రేకులతో ఉన్న కమలం లాంటి చక్రం అన్న భావన ఉంది. ఈ చక్రం చైతన్యానికి, జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. ఇది యాక్టివ్ అయినప్పుడు మనిషి సాధారణ ఆలోచనల స్థాయి దాటి ఉన్నత అవగాహనకు చేరతాడని యోగ గ్రంథాలు చెబుతాయి.
సహస్ర చక్రం ప్రాముఖ్యత ఏంటి?
సహస్ర చక్రం అనేది కేవలం శరీర భాగం కాదు. ఇది మనస్సు, ఆలోచనలు, ఆత్మతో అనుసంధానం ఉన్న కేంద్రం. ఈ చక్రం సక్రియంగా ఉంటే.. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది, భయం, కోపం లాంటి భావాలు తగ్గుతాయి. జీవితం పట్ల లోతైన అర్థం తెలుస్తుంది. యోగా సాధకులు చెప్పే దాని ప్రకారం.. సహస్ర చక్రం ఓపెన్ అయితే మనిషి తనలోని నిజాన్ని తెలుసుకుంటాడు. అందుకే దీన్ని “మోక్ష ద్వారం” అని కూడా అంటారు.
సహస్ర చక్రాన్ని నిజంగా తాకగలమా?
ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఇదే. సహస్ర చక్రాన్ని చేతితో తాకగలమా? సింపుల్‌గా చెప్పాలంటే తాకలేం. ఎందుకంటే ఇది భౌతికంగా కనిపించేదు కాదు. ఇది పూర్తిగా అంతర్గత అనుభూతి, శక్తి స్థాయిలో ఉండే భావన. మన భావాలు, ఆలోచనలు, చైతన్యం ఒక నిర్దిష్ట స్థాయికి చేరినప్పుడు కలిగే అనుభవం ఇది.
సహస్ర చక్రం యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలి?
యోగ గ్రంథాల ప్రకారం సహస్ర చక్రం ఒక్కసారిగా యాక్టివ్ కాదు. దానికి ముందుగా మిగతా చక్రాలు సక్రమంగా పనిచేయాలి. సాధారణంగా చెప్పే పద్ధతులు ఇవి.. ధ్యానం అలవాటు చేసుకోవడం, శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామం, ఆలోచనలను నియంత్రించే సాధన, లోభం, అసూయ లాంటి భావాలపై అవగాహన, శాంతమైన జీవనశైలి. ఇవి సంవత్సరాల సాధనతో వచ్చే ఫలితం.
రాజాసాబ్ సినిమాలో సహస్ర చక్రం ఎందుకు చూపించారు?
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ తాత హిప్నటిజం ద్వారానే వ్యక్తులను తన ఆధీనంలోకి తీసుకొని భయపెడుతుంటాడు. అతీత శక్తులకు, సైంటిఫిక్ అంశాన్ని జోడించి చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మారుతి. అవతలి వ్యక్తి చేసే హిప్నటిజాన్ని జయించాలంటే ముందుగా తనలోని భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలనే కాన్సెప్ట్‌ను చూపించారు. దీనికి సహస్ర చక్రాన్ని టూల్‌గా ఉపయోగించారు.
గమనిక: పైన తెలిపిన విషయాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

