- Home
- International
- Iran War: హమ్మయ్యా గండం గడిచింది.. ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు. ట్రంప్ ప్రకటన
Iran War: హమ్మయ్యా గండం గడిచింది.. ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు. ట్రంప్ ప్రకటన
Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచిన ఇరాన్–అమెరికా వివాదం ఇప్పుడు తాత్కాలికంగా శాంతి దిశగా అడుగులు వేస్తోంది. రెండు దేశాలు పరస్పర దాడులను నిలిపివేయడానికి రెండు వారాల కాలపరిమితితో షరతులున్న కాల్పుల విరమణకు అంగీకరించాయి.

ట్రంప్ హెచ్చరికల తర్వాత మారిన పరిస్థితి
ఇరాన్‌పై అమెరికా గట్టి ఒత్తిడి తీసుకువచ్చింది. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అమెరికా హెచ్చరించింది. డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి వరకు ఇరాన్‌కు గడువు విధించారు. ఆ గడువు ముగిసే ముందు ఆయన గట్టిగా స్పందిస్తూ, జలసంధి తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికా కాలమానం ప్రకారం నిర్ణయించిన సమయం దగ్గరపడుతున్న సమయంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా సైనిక చర్యలకు అవకాశం ఉందన్న అంచనాలు వినిపించాయి. ఇరాన్ నాగరికత అంతం చేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని భయపెట్టాయి. అయితే గడువు ముగిసే ముందు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు.
రెండు వారాలపాటు దాడులకు బ్రేక్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై ప్రణాళికలో ఉన్న సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం రెండు వారాలపాటు బాంబుదాడులు, సైనిక చర్యలు నిలిపివేస్తారు. ఈ వ్యవధిలో రెండు దేశాలు పరిస్థితిని సమీక్షించుకుని చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇది అవసరమైన చర్య అని ఆయన చెప్పారు. అయితే ఈ నిర్ణయం అమల్లో ఉండాలంటే హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
హర్మూజ్ జలసంధి తెరవడానికి ఇరాన్ అంగీకారం
అమెరికా నిర్ణయం తర్వాత ఇరాన్ కూడా కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధి గుండా పరిమిత కాలం పాటు నౌకలు ప్రయాణించేందుకు అనుమతి ఇస్తాం అని తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ, రెండు వారాలపాటు తమ సాయుధ దళాల పర్యవేక్షణలో సురక్షిత ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు. సాంకేతిక పరిమితులు, భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమెరికా లేదా మిత్రదేశాలు తమపై దాడులు చేయకపోతే, ఇరాన్ సైన్యం కూడా ప్రతిస్పందన చర్యలను నిలిపివేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధి
ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ప్రాంతం హర్మూజ్ జలసంధి. మధ్యప్రాచ్య దేశాల నుంచి బయలుదేరే పెద్ద మొత్తంలో చమురు ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. ఈ ప్రాంతంపై నియంత్రణ ఉండటం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. అందుకే హర్మూజ్ జలసంధి పరిస్థితి మారితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకారం, ఈ మార్గంలో ప్రయాణాలు తమ దళాల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఇది దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడటానికి అవసరం అని వారు పేర్కొన్నారు.
పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కీలకం
ఈ పరిణామాల్లో పాకిస్తాన్ పాత్ర కూడా ప్రాధాన్యం పొందింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌లతో జరిగిన చర్చల తర్వాతే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి కూడా పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గేందుకు పాకిస్తాన్ తీసుకున్న ప్రయత్నాలు సహాయపడ్డాయని చెప్పారు.

