K Visa : ట్రంప్ మామతో చైనీస్ చెడుగుడు.. కె వీసాతో కాకరేపారుగా..!
K Visa : అమెరికా H1B వీసా నిబంధనలతో ప్రపంచాన్ని భయపెడితే చైనా మాత్రం K వీసాలతో ధీటుగా జవాభిచ్చింది. ఇంతకూ ఏమిటీ K వీసా? ఇది హెచ్1బి కి పోటీ ఇవ్వగలదా? ఇక్కడ తెలుసుకుందాం.

ట్రంప్ మామకు మామూలు షాక్ కాదు...
K Visa : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారతీరు ఆ దేశానికే కాదు యావత్ ప్రపంచానికి తలనొప్పిగా మారింది. ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో... ఏ దేశాన్ని టార్గెట్ చేస్తాడో ఎవ్వరికీ అంతుచిక్కడంలేదు. ముఖ్యంగా అమెరికా శత్రుదేశాలు రష్యా, చైనాతో భారత్ సన్నిహితంగా ఉండటం ట్రంప్ కు నచ్చడంలేదు... దీంతో మనల్ని టార్గెట్ చేశాడు. ఇటీవల భారత్ పై 50శాతం టారీఫ్స్ విధించగా ఇప్పుడు భారతీయులే లక్ష్యంగా H1B వీసాల నిబంధనలు మార్చారు. ఇలా ట్రంప్ తన చేష్టలతో భారత మేధోసంపత్తిని దూరం చేసుకుంటుంటే చైనా దగ్గరకు తీసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే అమెరికా హెచ్1బి వీసాలకు పోటీగా K వీసాలను తీసుకువస్తోంది చైనా.
అమెరికా పొమ్మంటే చైనా రా రమ్మంటోంది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా ఫీజుల పెంపు టెక్ ప్రపంచంలో తీవ్ర ఆందోళన, గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ సమయంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులను యువతను ఆకర్షించడానికి చైనా ఒక కొత్త వీసాను ప్రకటించింది. వివిధ రంగాల్లో నిపుణుల కోసం చైనా కొత్త 'కే వీసా'ను ప్రవేశపెట్టింది. యూఎస్ హెచ్-1బీ వీసా లాగే 'కే' వీసాను అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తామని చైనా స్టేట్ కౌన్సిల్ ప్రకటించింది.
ఆసియాలో మరీముఖ్యంగా దక్షిణాసియా నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (STEM) రంగాల్లో చదువుతున్న లేదా పనిచేస్తున్న యువతను ఆకర్షించడం ఈ చైనా కె వీసా లక్ష్యం. విదేశీయుల ప్రవేశ, నిష్క్రమణ నియంత్రణలను సవరించే నిర్ణయాన్ని ప్రకటిస్తూ చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ఒక ఉత్తర్వుపై సంతకం చేశారు. వార్తా సంస్థ జిన్హువా నివేదిక ప్రకారం, కొత్త నియమాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
అమెరికా హెచ్1బి వీసాలకు పోటీగా చైనా కే వీసా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలకు 100,000 డాలర్ల వార్షిక రుసుమును ప్రతిపాదించడంతో ఆ దేశంలో విదేశీ నిపుణుల పరిస్థితి మరింత కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో చైనా కె వీసాను ప్రకటించింది... దీంతో చాలా మంది నిపుణులకు మంచి అవకాశాలను అందిస్తూ చైనా కొత్త ఆప్షన్‌గా మారవచ్చు. ఇప్పటికే అమెరికాతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్న చైనా విదేశీ మేథోసంపత్తిని ఆకర్షించడంలనూ పోటీ పడేందుకు సిద్దమవుతోంది.
ఏమిట చైనా కే వీసా... ఎందుకంత ప్రత్యేకం?
ప్రస్తుతం విదేశీయులు తమ దేశంలో ఉండేందుకు చైనా 12 రకాల సాధారణ వీసాలు అందిస్తోంది. వీటన్నింటి కంటే తాజాగా ప్రకటించిన K వీసా ప్రత్యేకమైనది. అనుమతించిన ఎంట్రీల సంఖ్య, చెల్లుబాటు కాలం, నివాస కాలం పరంగా K వీసా హోల్డర్లు ఎక్కువ సౌకర్యాలను పొందవచ్చు. చైనాలో ప్రవేశించిన తర్వాత కే వీసా హోల్డర్లు విద్య, సంస్కృతి, శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనుమతి ఉంటుంది.
కే వీసా ఎవరికి లభిస్తుంది?
ఈ వీసాను యువ శాస్త్ర, సాంకేతిక గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా పరిశోధన సంస్థలో చదువు పూర్తి చేసి ఉండాలి. యూఎస్ నుంచి వేలాది మంది నిపుణులను తమ సాంకేతిక, పరిశోధన పరిశ్రమలకు ఆకర్షించడం చైనా లక్ష్యం. అందుకే H1B వీసా నిబంధనలు కఠినతరం చేసిన సమయంలోనే K వీసాలను ప్రకటించింది.
చైనా లక్ష్యమిదేనా?
యూఎస్‌లో వలస ప్రక్రియ మరింత సంక్లిష్టంగా, ఖరీదైనదిగా మారుతుంటే చైనా మాత్రం దానిని సులభతరం చేస్తోంది. కే వీసా యువతకు ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా, మరింత సరళమైన నివాస, ప్రవేశ వ్యవస్థను కూడా అందిస్తుంది. ప్రపంచ సాంకేతిక పోటీలో వెనుకబడకూడదనే స్పష్టమైన సందేశాన్ని చైనా దీని ద్వారా ఇస్తోంది. ఈ చర్య యూఎస్‌పై ఒత్తిడిని పెంచుతుందని, ఆసియా ప్రతిభకు కొత్త వేదికను అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
యూఎస్ వీసా ఫీజుల పెంపు
సెప్టెంబర్ 21 తర్వాత సమర్పించే అన్ని కొత్త H-1B వీసా దరఖాస్తులకు 100,000 యూఎస్ డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అమెరికన్ ఉద్యోగాలు, జాతీయ భద్రతను కాపాడే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ ఈ సవరించిన ఫీజును రూపొందించారు. ఒక మిలియన్ డాలర్లకు యూఎస్ రెసిడెన్సీని పొందగల "ట్రంప్ గోల్డ్ కార్డ్" వీసా ప్రోగ్రామ్‌ను కూడా ట్రంప్ ప్రవేశపెట్టారు.