- Home
- International
- USA: ఇక అమెరికాలో పిల్లల్ని కనడం కుదరదు.. బర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
USA: ఇక అమెరికాలో పిల్లల్ని కనడం కుదరదు.. బర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
USA: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ట్రంప్ వ్యవహార శైలి వివాదాలకు దారి తీస్తోంది. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో ముందుకు సాగుతోన్న ట్రంప్ తాజాగా బర్త్ టూరిజాన్ని రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.

బర్త్ టూరిజం అంటే ఏంటి?
బర్త్ టూరిజం అంటే గర్భిణీ మహిళలు ప్రత్యేక ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి అక్కడ పిల్లలకు జన్మనివ్వడం. అలా పుట్టిన పిల్లలకు ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం లభిస్తుందని భావించి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇది ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో ఉన్న ఒక లూప్‌హోల్‌ను ఉపయోగించుకునే ప్రయత్నంగా అమెరికా అధికారులు చూస్తున్నారు.
అమెరికాలో జన్మిస్తే పౌరసత్వం ఎలా వస్తుంది?
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా భూభాగంలో పుట్టిన ప్రతి బిడ్డకు అక్కడి పౌరసత్వం లభిస్తుంది. తల్లిదండ్రుల వీసా స్థితి ఏదైనా సరే ఈ హక్కు వర్తిస్తుంది. ఈ కారణంతోనే చాలా కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్ భద్రత కోసమే బర్త్ టూరిజాన్ని ఎంచుకుంటున్నాయి.
టూరిస్టు వీసాపై వెళ్లే విధానం
చాలా మంది మహిళలు B-1 లేదా B-2 టూరిస్టు వీసాతో అమెరికాకు వెళ్తారు. అక్కడ తాత్కాలిక నివాసం తీసుకుని ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంటారు. ఆ తర్వాత అమెరికా పాస్‌పోర్ట్ పొందిన శిశువుతో తిరిగి స్వదేశానికి వస్తారు. ఈ ప్రక్రియనే బర్త్ టూరిజంగా పిలుస్తారు.
వీసా మోసం అంటూ అమెరికా కఠిన నిర్ణయం
తమ ప్రయాణ ఉద్దేశాన్ని దాచిపెట్టి వీసా తీసుకుంటే దాన్ని వీసా మోసంగా అమెరికా పరిగణిస్తుంది. భారతదేశంలోని యూఎస్ ఎంబసీ కూడా స్పష్టమైన హెచ్చరిక చేసింది. కేవలం పిల్లలకు పౌరసత్వం పొందేందుకు అమెరికాకు రావాలనుకుంటే అలాంటి వీసా దరఖాస్తులు నేరుగా తిరస్కరిస్తామని తెలిపింది.
డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వ్యతిరేకం?
డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా బర్త్ టూరిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది ఇమ్మిగ్రేషన్ చట్టాల దుర్వినియోగం అని ఆయన అభిప్రాయం. ప్రజా వనరులపై భారం పెరుగుతోందని ఆయన చెబుతున్నారు. ఈ విధంగా పుట్టిన పిల్లలను ఆయన “యాంకర్ బేబీస్”గా పేర్కొంటున్నారు. బర్త్ టూరిజాన్ని ఆపడం సాధ్యమేనని, అయితే జన్మహక్కు పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేయడం కష్టం అని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు.

