Sleep: అర్థరాత్రి వేళ ఆ సమయాల్లో మెళకువ వస్తుందా ? అయితే.. జాగ్రత్త..
Midnight Wake Up: ప్రతిరోజూ తెల్లవారుజామున 2, 3 గంటలకు నిద్ర లేచి మిగతా రాత్రంతా మెలుకువగా ఉండిపోతున్నారా? అలా అయితే ఈ చిట్కాలను పాటించండి. ఇవి మీ నిద్ర సమస్యను తగ్గించి, హాయిగా నిద్రపడేందుకు సహాయపడతాయి. ఆ చిట్కాలేంటో ఓ లూక్కేయండి.

ఉదయం 3 గంటలకు మెలకువ
ఉదయం 3 గంటలు అనేది కొన్ని సంస్కృతుల్లో "మిస్టీరియస్ టైం" లేదా "భూతాల సమయం"గా భావించినా, శాస్త్రీయంగా చూస్తే ఇది సహజ నిద్ర చక్రం భాగం. ఈ సమయంలో మనం గాఢ నిద్ర నుంచి తేలికపాటి నిద్రకు మారతాము, అప్పుడు చిన్న శబ్దం లేదా ఆలోచన వచ్చిన మెళుక వస్తుంది. ఇది ప్రత్యేక వ్యాధి కాదు. దినచర్య, మానసిక ఒత్తిడి, జీవనశైలితో సంబంధముండవచ్చు. సరైన నిద్ర పద్ధతులు పాటిస్తే ఈ పరిస్థితి మారిపోతుంది.
సరైన నిద్రే ఆరోగ్యం
నిద్ర మన శరీరానికి, మనసుకు చాలా అవసరం. నిద్ర వల్ల శరీరం, మనస్సు తిరిగి ఉత్తేజాన్ని పొందుతాయి. ఇది శారీరకంగా ఉత్సాహాన్ని, మానసికంగా ఏకాగ్రతను పెంచుతుంది. నిద్ర సమయంలో శరీరం మరమ్మత్తు పనులు చేస్తుంది, మెదడు అవసరమైన సమాచారాన్ని నిల్వ చేసి, అనవసరాన్ని తొలగిస్తుంది. నిద్రలేమి వల్ల అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం కలగడమే కాకుండా దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది.
రాత్రిపూట మెలుకువ రావడానికి కారణాలు
మానసిక ఒత్తిడి, ఆందోళన: ఆఫీసు టెన్షన్, కుటుంబ సమస్యలు, భవిష్యత్తుపై భయం వంటివి మన మనసుపై ప్రభావితం చేస్తాయి. వీటికి సంబంధించిన ఆలోచనలు మన నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. పడుకునే ముందు ఆ ఆలోచనలు తీవ్రంగా కదిలించి నిద్రను చెడగొడతాయి.
రూమినేషన్ (తిరిగి ఆలోచించడం): కొంతమందికి ఒక ఆలోచన లేదా సమస్య మనసులో తిరుగుతూనే ఉంటుంది. ఆ ఆలోచన నిద్రలో వస్తే.. అంతరాయం కలుగుతుంది.
ఎక్కువగా కాఫీ, టీ తాగడం: రాత్రిపూట ఎక్కువగా కాఫీ, టీ వంటి పానీయాలు తాగడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. వీటిలో ఉండే పదార్థాలు మనల్ని ఉత్తేజపరిచి నిద్రను అడ్డుకుంటాయి.
శరీర గడియారం (బయోలాజికల్ క్లాక్): ఇది ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడానికి, మెలకువ కావడానికి సహాయపడుతుంది. ఈ గడియారంలో చిన్న మార్పులు వచ్చినా, నిద్రకు ఆటంకం కలుగుతుంది.
ఈ మార్పులు చేయండి
నిద్రవేళను క్రమబద్ధీకరించుకోండి: ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో నిద్రలేవడం అలవాటు చేసుకోండి. వారాంతాల్లో కూడా ఈ అలవాటును పాటించండి. ఇది మీ శరీర గడియారాన్ని సరిచేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు రాత్రి 10 గంటలకు పడుకుని, ఉదయం 6 గంటలకు లేవడం వంటివి అలవాటు చేసుకోండి.
బెడ్ రూమ్ ను మార్చండి : మీ బెడ్ రూమ్ చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉండాలి. అనవసరమైన శబ్దాలు, వెలుతురు తగ్గించి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. మందమైన కర్టెన్లు, ఇయర్ ప్లగ్స్ ఉపయోగపడతాయి.
కాఫీ, టీ, చాక్లెట్ తగ్గించండి: కాఫీ, టీ, చాక్లెట్ వంటివి మన శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. వీటిని తినడం వల్ల నిద్ర చెడిపోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత వీటిని తినకపోవడం మంచిది.
వీటిని దూరంగా
మొబైల్, టీవీ దూరంగా ఉండండి: వీటి నుంచి వచ్చే నీలి కాంతి నిద్రను దెబ్బతీస్తుంది. పడుకునే గంట ముందు వీటిని పక్కన పెట్టి, పుస్తకాలు చదవండి లేదా సంగీతం వినండి.
మానసిక ప్రశాంతత: పడుకునే ముందు మనసును ప్రశాంతపరచుకోవడానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. రేపు చేయాల్సిన పనులు, ఆందోళనల గురించి ఆలోచించకుండా, ఆ రోజు చేయాల్సిన పనులపై దృష్టి పెట్టండి.
మెరుగైన నిద్ర కోసం..
పగటిపూట కొద్దిసేపు నడవండి: పగటిపూట తేలికపాటి వ్యాయామం శరీరాన్ని రిలాక్స్ చేసి రాత్రిపూట నిద్రను మెరుగుపరుస్తుంది. కానీ పడుకునే ముందు కఠినమైన వ్యాయామాలు చేయకండి.
సరైన ఆహారపు అలవాట్లు: రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. రాత్రి పూట ఎక్కువ తినడం, ఆలస్యంగా భోజనం చేయడం వల్ల నిద్ర దెబ్బతింటుంది. రాత్రి వేళ తినడానికి, పడుకోవడానికి కనీసం 2–3 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. రాత్రి ఎక్కువ నీరు తాగడంవల్ల మెలకువ వస్తుంది.