Health Tips: సడెన్ గా బరువు తగ్గారా? అయితే ఈ జబ్బులు రావచ్చు.. జాగ్రత్త!
బరువు తగ్గడం, పెరగడం సహజం. కానీ ఎలాంటి కారణం లేకుండా, సడెన్ గా బరువు తగ్గడం అస్సలు మంచిదికాదు. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సడెన్ గా బరువు తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం.

సడెన్ గా బరువు తగ్గితే ఏమవుతుంది?
బరువు అధికంగా ఉండడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం అందరికీ తెలుసు. అందుకే చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే బరువు ఆరోగ్యకర రీతిలో తగ్గితే మంచిదే. కానీ సడెన్ గా, ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం కొన్ని వ్యాధులకు సంకేతం కావచ్చు. ఆరు నుంచి 12 నెలల్లో ఎటువంటి ప్రయత్నం లేకుండా శరీర బరువులో 5 శాతం కంటే ఎక్కువ తగ్గితే దాన్ని వైద్యపరంగా ' unplanned weight loss' అంటారు. శరీరం పోషకాలను గ్రహించలేకపోయినా లేదా హార్మోన్ల అసమతుల్యత ఎదురైనా ఇలా సడెన్ గా బరువు తగ్గుతారు.
హైపర్ థైరాయిడిజం, డయాబెటిస్
థైరాయిడ్ గ్రంథి అతిగా థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు జీవక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల శరీర బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది. హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి హార్ట్ బీట్ పెరగడం, చెమట ఎక్కువగా పట్టడం, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు రావచ్చు. డయాబెటిస్ ప్రధాన లక్షణాల్లో బరువు తగ్గడం ఒకటి. శరీర కణాల్లోకి గ్లూకోజ్ ప్రవేశించలేకపోవడంతో.. శరీరం శక్తి కోసం కండరాలు, కొవ్వును ఉపయోగించుకుంటుంది. దీనివల్ల బరువు తగ్గడం ఎక్కువవుతుంది. బరువు తగ్గడంతో పాటు తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, తీవ్ర అలసట, అస్పష్టమైన దృష్టి, కండరాల నొప్పి వంటివి డయాబెటిస్ ఇతర లక్షణాలు.
క్యాన్సర్, గుండె జబ్బులు
క్యాన్సర్ ప్రారంభ లక్షణాల్లో బరువు తగ్గడం కూడా ఒకటి. క్యాన్సర్ కణాలు పెరగడానికి ఎక్కువ శక్తి అవసరం కాబట్టి అది శరీర శక్తిని పీల్చుకుంటుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. క్లోమం, కడుపు, కాలేయం లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ల మొదటి సంకేతాల్లో బరువు తగ్గడం ప్రధానమైనది. కొన్ని రకాల గుండె జబ్బులు, ముఖ్యంగా హార్ట్ ఫెయిల్యూర్ వంటి సందర్భాల్లో కూడా అధికంగా బరువు తగ్గుతారు.
ఊపిరితిత్తుల వ్యాధులు, ప్రేగు సంబంధిత వ్యాధులు
దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి ఎక్కువ శక్తిని తీసుకోవడం వల్ల క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. క్రోన్స్ వ్యాధి లేదా అల్సరేటివ్ కొలిటిస్ వంటి ప్రేగు వ్యాధులు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల శరీరం ఆహారంలోని పోషకాలను పూర్తిగా గ్రహించలేకపోతుంది. ఇది కూడా బరువు తగ్గడానికి కారణమవుతుంది. కొంతమందికి తీవ్రమైన ఒత్తిడి, నిరాశ, ఆకలి లేకపోవడం వంటివి జరుగుతాయి. HIV సోకిన వారికి కూడా శరీరం బలహీనపడి సడెన్ గా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.
వైద్య సలహా అవసరం
ఎవరైనా సరే.. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతున్నట్లయితే ఎటువంటి సమస్య ఉండదు. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా బరువు తగ్గడం మంచి పద్ధతి. కానీ ఎటువంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గితే.. ముఖ్యంగా అలసట, జీర్ణ సమస్యలు, మానసిక స్థితిలో మార్పులతో పాటు బరువు తగ్గడం కూడా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.