Sperm Bank: స్పెర్మ్ బ్యాంక్ టెక్నాలజీ అంటే ఏంటి.? దీని ఉపయోగం ఏంటో తెలుసా.?
Sperm Bank: రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతోంది. వైద్య రంగంలో కూడా అధునాతన పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిలో స్పెర్మ్ బ్యాంక్ టెక్నాలజీ ఒకటి. ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్పెర్మ్ బ్యాంక్ టెక్నాలజీ అంటే..
స్పెర్మ్ బ్యాంక్ టెక్నాలజీ అనేది పురుషుల స్పెర్మ్‌ను భవిష్యత్తులో ఉపయోగించడానికి సురక్షితంగా నిల్వ చేసుకునే ఆధునిక పద్ధతి. ఇది ముఖ్యంగా సంతానోత్పత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు లేదా జంటలకు సహాయం చేస్తుంది. ఈ సాంకేతికత ద్వారా, పురుషుల స్పెర్మ్‌ను భవిష్యత్తులో పిల్లలను కలిగించడానికి ఉపయోగించవచ్చు.
స్పెర్మ్‌ను ఎలా నిల్వ చేస్తారు?
స్పెర్మ్ బ్యాంక్ టెక్నాలజీ క్రయోప్రెజర్వేషన్ (Cryopreservation) పద్ధతిని ఉపయోగిస్తుంది. ముందుగా, పురుషుడి నుంచి స్పెర్మ్ శాస్త్రీయంగా సేకరించి, స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ, నాణ్యత వంటి అంశాలను పరీక్షిస్తారు. తరువాత, స్పెర్మ్‌ను చిన్న సీసాలలో ప్యాక్ చేసి, -196°C వద్ద ద్రవ నైట్రోజన్ ట్యాంకులలో ఘనీభవనం చేసి నిల్వ చేస్తారు.
ఎప్పుడు, ఎందుకు అవసరం?
ఈ సాంకేతికత అనేక సందర్భాలలో ఉపయోగపడుతుంది. వీటిలో ప్రధానంగా..
క్యాన్సర్ రోగులు: కీమోథెరపీ లేదా రేడియేషన్ కారణంగా సంతానోత్పత్తి ప్రభావితమవుతుందా అనుకుంటే ముందుగానే స్పెర్మ్ నిల్వ చేసుకోవచ్చు.
భవిష్యత్తులో పిల్లల్ని ప్లాన్ చేసుసుకోవాలనుకునే వారు: ఇప్పుడే తల్లిదండ్రులు కావాలనకపోయినా, ఆ తర్వాత సంతానం పొందొచ్చు.
పురుషుల ఆరోగ్య సమస్యలు: సంతానోత్పత్తిలో సమస్యలు ఉన్న వ్యక్తులకు డోనర్ స్పెర్మ్ ఉపయోగించి IVF లేదా IUI ద్వారా గర్భధారణ పొందొచ్చు.
స్పెర్మ్ వినియోగ విధానం
సేకరించిన స్పెర్మ్‌ను IVF, IUI లేదా ICI విధానాల్లో ఉపయోగించవచ్చు. వైద్య బృందం, మహిళా భాగస్వామి అండంతో స్పెర్మ్‌ను కలిపి గర్భధారణకు సహాయం చేస్తుంది. ఇది సహజంగా గర్భం దాల్చలేని జంటలకు సంతానం కల్పించే మార్గంగా పనిచేస్తుంది.
స్పెర్మ్ బ్యాంక్ ఉపయోగాలు
* భవిష్యత్తులో సంతానోత్పత్తిని సురక్షితంగా నిల్వ చేస్తుంది.
* అధిక నాణ్యతా నియంత్రణ విధానాలతో స్పెర్మ్ ఇన్ఫెక్షన్ లేదా వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు.
* మహిళలకు, జంటలకు ఆర్థిక, సామాజిక, వైద్య సౌకర్యం అందిస్తుంది.