- Home
- Life
- Health
- Health : ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్రవిసర్జన చేస్తాడు..? ఇంతకంటే ఎక్కువసార్లు చేస్తే..
Health : ఆరోగ్యంగా ఉండే వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్రవిసర్జన చేస్తాడు..? ఇంతకంటే ఎక్కువసార్లు చేస్తే..
మగవాళ్లలో తరచూ మూత్రవిసర్జన చేయడం, మాటిమాటికీ మూత్రం వస్తున్నట్లు అనిపించడం చాలా సాధారణం. రాత్రిపూట చాలాసార్లు నిద్రలేచి బాత్రూమ్‌కి వెళ్లడం, పగటిపూట కూడా అదేపనిగా వెళ్లాల్సి రావడం చాలామంది పురుషుల్లో కనిపిస్తుంది. ఇది దేనికి సంకేతమో తెలుసా..?

మూత్ర విసర్జనను బట్టి ఆరోగ్య సమస్యలు చెప్పవచ్చా..?
మూత్ర విసర్జనకు అనేక ఆరోగ్య సమస్యలతో సంబంధం ఉంటుంది. మూత్రం రంగు, వాసనను బట్టే కాదు ఎన్నిసార్లు పోతున్నారు అనేదాన్నిబట్టి కూడా ఓ వ్యక్తిలోని అనారోగ్య సమస్యలను గుర్తించవచ్చు. అందుకే వివిధ సమస్యలతో వచ్చేవారికి వైద్య నిపుణులు యూరిన్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తుంటారు.
సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 4 నుంచి 8 సార్లు మూత్రవిసర్జన చేస్తారు… ఇంతకంటే ఎక్కువసార్లు చేస్తున్నారో ఏదో సమస్య ఉన్నట్లే. నీళ్లు ఎక్కువగా తాగకపోయినా మూత్రం వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. రాత్రిపూట ఇలా తరచూ మూత్రవిసర్జన చేయడాన్ని 'నోక్టూరియా' అని కూడా అంటారు.
ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే ఆ సమస్యలు ఉన్నట్లే..
ఆరోగ్య నిపుణుల ప్రకారం… మగవాళ్లలో ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం రెండు పెద్ద రోగాలకు సంకేతం. ఒకటి డయాబెటిస్, రెండోది ప్రోస్టేట్ సమస్య. అయితే కొన్నిసార్లు ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. కాబట్టి తరచూ మూత్రం వచ్చినంతమాత్రాన కంగారుపడాల్సిన పనిలేదు… ఎక్కువరోజులు ఈ సమస్య ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.
టైప్ 2 డయాబెటిస్ తొలిదశ లక్షణాల్లో తరచూ మూత్రవిసర్జన ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, కిడ్నీలు ఆ అదనపు గ్లూకోజ్‌ను బయటకు పంపడానికి ఎక్కువగా పనిచేస్తాయి. దీనివల్ల మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది.
టైప్-2 డయాబెటిస్ లక్షణాలేంటి..?
ఎక్కువగా దాహం వేయడం, బరువు తగ్గడం, నీరసం లేదా శక్తి లేనట్లు అనిపించడం వంటివి టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపిస్తే, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే, దానిని సమర్థంగా నియంత్రించవచ్చు.
ప్రోస్టెట్ సమస్య..
మగవాళ్లలో తరచూ మూత్రవిసర్జన సమస్యకు ప్రోస్టేట్ ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య ఎక్కువ. 'బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా' అనేది ఒక సాధారణ పరిస్థితి. అంటే ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ సంబంధం లేకుండానే పరిమాణంలో పెద్దదిగా అవ్వడం. ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు, అది మూత్రనాళంపై ఒత్తిడి తెచ్చి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
డయాబెటిస్, ప్రోస్టెట్ సమస్యలకు తేడా ఏంటి..?
డయాబెటిస్ వల్ల మూత్రవిసర్జన సమస్యతో పాటు సాధారణంగా విపరీతమైన దాహం, ఆకలి కూడా ఉంటాయి. కానీ ప్రోస్టేట్ సమస్యల్లో మూత్రం ఎక్కువసార్లు రావడం కంటే, మూత్ర ప్రవాహంలో ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఏ వయసు మగవాళ్లకైనా రావచ్చు.
అయితే తరచూ మూత్రవిసర్జన సమస్యకు ఎప్పుడూ డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలే కారణం కాకపోవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI), కెఫిన్ లేదా ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తీసుకోవడం, కొన్ని రకాల మందులు, ఒత్తిడి, ఆందోళన వంటి ఇతర కారణాలు కూడా అధిక మూత్ర విసర్జన సమస్యకు దారితీయవచ్చు.

