పెయిన్‌కిల్లర్ వేసుకోగానే నొప్పి ఎలా తగ్గుతుంది.? ఇది ఎలా పని చేస్తుందో తెలుసా.?
Pain Killer: మన శరీరంలో నొప్పి అనేది ఒక హెచ్చరిక లాంటిది. శరీరంలో ఉన్న సమస్యను నొప్పి ద్వారా సంకేతం ఇస్తుంది. నొప్పి తగ్గేందుకు చాలా మంది పెయిన్‌కిల్లర్లను వాడుతారు. అయితే పెయిన్ కిల్లర్ వేయగానే నొప్పి ఎందుకు తగ్గుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.

అసలు నొప్పి ఎలా వస్తుంది?
న్యూరాలజిస్టులు, వైద్య నిపుణుల ప్రకారం నొప్పి అనేది గాయం జరిగిన ప్రదేశం నుంచి నేరుగా రావడం కాదు. శరీరంలో ఉన్న ప్రత్యేక నర్వ్ సెల్స్ గాయం లేదా వాపును గుర్తిస్తాయి. అవి వెంటనే మెదడుకు సంకేతాలు పంపుతాయి. ఆ సంకేతాలను మెదడు నొప్పిగా గుర్తిస్తుంది. అందుకే నొప్పి అనుభూతి మన మెదడులో ఏర్పడుతుంది.
పెయిన్‌కిల్లర్ పని చేసే విధానం
పెయిన్‌కిల్లర్ మందు తీసుకున్న తర్వాత అది ముందుగా కడుపులో కరిగి రక్తంలో కలుస్తుంది. అక్కడి నుంచి శరీరమంతా వ్యాపిస్తుంది. సాధారణంగా కొన్ని మందులు కొన్ని నిమిషాల్లోనే పని చేయడం ప్రారంభిస్తాయి, మరికొన్ని మందులు ప్రభావం చూపేందుకు ఒక గంట వరకు సమయం పడుతుంది. ఈ మందులు శరీరంలో నొప్పి, వాపునకు కారణమయ్యే రసాయనాల ఉత్పత్తిని తగ్గిస్తాయి.
వాపు, నొప్పి కలిగించే కెమికల్స్‌పై ప్రభావం
ఇబుప్రోఫెన్, ఆస్పిరిన్ వంటి మందులు శరీరంలో ఉండే COX అనే ఎంజైమ్‌ను అడ్డుకుంటాయి. ఈ ఎంజైమ్ వల్లే వాపు, నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ ఎంజైమ్ పని తగ్గితే నొప్పి సంకేతాలు కూడా బలహీనంగా మారుతాయి. అందుకే పెయిన్‌కిల్లర్ తీసుకున్న కొద్దిసేపటికే నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది.
నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం
కొన్ని పెయిన్‌కిల్లర్ మందులు నేరుగా నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతాయి. ఇవి మెదడుకు వెళ్లే నొప్పి సంకేతాలను మందగింపజేస్తాయి. ఇంకొన్ని మందులు శరీరంలో సహజంగా ఉండే ఎండోర్ఫిన్ అనే హార్మోన్లను చురుకుగా చేస్తాయి. ఈ హార్మోన్లు సహజమైన నొప్పి నివారణలా పనిచేస్తాయి. అందుకే ప్రతి రకమైన నొప్పికి వేర్వేరు మందులు వాడుతారు.
ఎక్కువగా వాడితే ప్రమాదం
పెయిన్‌కిల్లర్ మందులు తక్షణ ఉపశమనం ఇస్తాయి. కానీ వీటిని ఎక్కువగా లేదా చాలా కాలం పాటు వాడితే సమస్యలు రావచ్చు. కడుపు సమస్యలు, కిడ్నీ ఇబ్బందులు, ఇతర దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే డాక్టర్ సలహా లేకుండా తరచుగా ఈ మందులు తీసుకోవడం మంచిది కాదు. నొప్పి ఎక్కువగా ఉంటే కారణం తెలుసుకుని సరైన చికిత్స తీసుకోవాలి.

