ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఈ ఎండలకు అంతే?
వేసవి కాలంలో అధిక ఎండ తీవ్రత కారణంగా శరీరం అనేక ఇబ్బందులకు గురి అవుతుంది. కనుక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి.

అప్పుడే ఆరోగ్యంతో (Health) పాటు చర్మ సౌందర్యం (Skin beauty) కూడా బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవికాలంలో అనవసరంగా బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఒక వేళ వెళ్లాలనుకున్నప్పుడు ప్రొద్దున్న పదకొండు లోపల, సాయంత్రం నాలుగు తరువాత బయట పనులు చక్కబెట్టుకోవాలి. అలాగే ఈ కాలంలో వేసుకునే దుస్తుల (Dress) నుండి తీసుకునే ఆహారం (Food) వరకు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే భగభగమండే సూర్యుని కిరణాల తాకిడి నుంచి శరీరాన్ని కాపాడుకోగలం.
ఈ కాలంలో లేతరంగు మెత్తటి వదులైన కాటన్ దుస్తులను (Cotton clothing) ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే శరీరానికి హాయిగా ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంతవరకు శరీరానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. తలకు టోపీ లేదా స్కార్ఫ్ తప్పనిసరి. అయితే కాస్త నడవాల్సిన పని అయినప్పుడు బరువు అనుకోకుండా గొడుగు (Umbrella) తీసుకెళ్లడం మంచిది.
ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. ఎండ కారణంగా చెమట (Sweat) కారుతుందని చికాకు పడకుండా మన శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితిలో ఉంచేందుకు రెండు పూటలా స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం శుభ్రంగా ఉండి చెమట పొక్కులు వంటి చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే బయటకు వెళ్ళడానికి పది నిమిషాల ముందు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ (Sunscreen lotion) రాసుకోవాలి.
ఇలా చేస్తే చర్మం తన సహజసిద్ధమైన సౌందర్యాన్ని కోల్పోదు. అంతేకాకుండా ఎండాకాలంలో సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల (Ultraviolet rays) కారణంగా కళ్ళు బైర్లు కమ్మి తాత్కాలిక అంధత్వం వచ్చే ప్రమాదం పొంచివుంది. చలువ కళ్ళద్దాలు ఆ సమస్యలను నివారిస్తాయి. అయితే మామూలు కళ్ళద్దాలు కాకుండా కళ్ళు పూర్తిగా కవర్ చేసే చలువ అద్దాలను (Sunglasses) ఎంచుకోవాలి.
అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక నీళ్ల సీసా (Water bottle) తప్పనిసరి. అప్పుడే వచ్చేస్తాంగా అని నిర్లక్ష్యం చేస్తే దాహమైనప్పుడు ఇబ్బంది పడాల్సివస్తుంది. బరువనుకోకుండా ఒక నీళ్ల సీసాను తీసుకెళ్ళండి. దాహం అనిపించకపోయినా గంట గంటకి ఒకసారి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య (Dehydration problem) రాకుండా ఉంటుంది. అయితే నీళ్లు మాత్రమే మన శరీర దాహార్తిని తీర్చలేవు.
కనుక పోషకాలు కలిగిన హెల్తి ఫ్రూట్ జ్యూస్ (Fruit juice) లను, గ్లూకోజ్ వాటర్ (Glucose Water) ను ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే శరీరం వడదెబ్బ బారినపడదు. ఏ చిన్న పని మీద వెళ్ళినా మనకు తెలియకుండానే ఎక్కువ సమయం పట్టవచ్చు. అలాంటప్పుడు తక్షణ శక్తినిచ్చే ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, పిస్తా వంటివి వెంట ఉంచుకొని మధ్యమధ్యలో నోట్లో వేసుకుంటే ఆకలి, దాహం రెండు తీరుతాయి.
వేసవి కాలంలో మసాలా వంటలకు (Spicy dishes), ఎక్కువ నూనెతో చేసిన వంటలకు (Oil Foods), పచ్చళ్లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలను తీసుకోవడంతోపాటు పచ్చిపులుసు, మజ్జిగ చారు వంటి పలుచని పదార్థాలను ఎక్కువగా శరీరానికి అందించాలి.