Kallu: తాటి కల్లు, ఈత కల్లుకు తేడా ఏంటి.? రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది.?
Kallu: దేశంలో చాలా కాలంగా వినియోగంలో ఉన్న సంప్రదాయ పానీయాల్లో ఈత కల్లు, తాటి కల్లు ముఖ్యమైనవి. ముఖ్యంగా దక్షిణ భారత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా తాగుతారు. అయితే ఈ రెండింటి మధ్య తేడా ఏంటి.? ఆరోగ్యానికి ఏది మంచిది. ఇప్పుడు తెలుసుకుందాం.

ఈత కల్లు అంటే ఏంటి?
ఈత చెట్టు నుంచి సేకరించే సహజ పానీయం ఈత కల్లు. ఇది తాజాగా ఉన్నప్పుడు తీపిగా, స్వచ్ఛంగా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత సహజంగా ఫెర్మెంట్ అవుతుంది. అప్పుడు స్వల్పంగా మత్తు లక్షణాలు కనిపిస్తాయి. అలాగే వగరుగా ఉంటుంది. ఉదయం వేళల్లో తాజాగా తాగితే ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
ఈత కల్లుతో కలిగే ప్రయోజనాలు
ఈత కల్లులో కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి, రక్త లోపం తగ్గేందుకు ఉపయోగపడతాయి. సహజ ఎంజైములు ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేసవిలో తాగితే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అయితే ఎక్కువ సేపు ఉంచిన ఈత కల్లు ఆల్కహాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. అలా అయితే ఆరోగ్యానికి మేలు తగ్గుతుంది.
తాటి కల్లు అంటే ఏమిటి?
తాటి చెట్టు నుంచి వచ్చే పానీయం తాటి కల్లు. ఇది సరిగ్గా సేకరించినప్పుడు తీపిగా ఉంటుంది. చాలా వేగంగా ఫెర్మెంట్ అవడం దీని ప్రత్యేకత. అందుకే తాజాగా తాగితేనే మంచి ఫలితం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని శరీరానికి శక్తినిచ్చే పానీయంగా భావిస్తారు.
తాటి కల్లు వల్ల కలిగే ప్రయోజనాలు
తాటి కల్లులో విటమిన్ B, విటమిన్ C, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శరీరంలోని వేడిని తగ్గించే లక్షణం దీనికి ఉంది. దాహం తీర్చడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది త్వరగా పాడవుతుంది కాబట్టి ఆలస్యంగా తాగితే మత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈత కల్లు–తాటి కల్లు: ఏది మంచిది?
రుచిలో ఈత కల్లు మృదువుగా, తీపిగా ఉంటుంది. తాటి కల్లు రుచి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఖనిజాల పరంగా ఈత కల్లు ఉపయోగకరం. విటమిన్‌లు, ప్రోటీన్ పరంగా తాటి కల్లు ముందంజలో ఉంటుంది. ఆరోగ్య దృష్ట్యా తాజాగా, పరిమిత మోతాదులో తాగితే తాటి కల్లు కొంచెం ఎక్కువ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏది తీసుకున్నా అలవాటుగా కాకుండా అవసరమైనంత మాత్రమే తీసుకోవడం మంచిది.
గమనిక: ఈ వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.

