Guava Leaves: జామ ఆకులు తింటే నిజంగానే షుగర్ తగ్గుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
షుగర్ సమస్య ఉన్నవారు సహజంగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలని చూస్తుంటారు. అయితే చాలామంది జామ ఆకులు తింటే షుగర్ తగ్గుతుందని నమ్ముతారు. కానీ నిజంగా జామ ఆకులు తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

జామ ఆకులు తింటే షుగర్ తగ్గుతుందా?
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. మందులతో పాటు సహజ మార్గాల్లో కూడా షుగర్‌ను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఎక్కువమంది జామ ఆకులను తినడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే జామ ఆకులు తింటే నిజంగానే షుగర్ తగ్గుతుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా..
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జామ ఆకుల్లో శరీరానికి మేలు చేసే కొన్ని సహజ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు కార్బోహైడ్రేట్లు శరీరంలో శోషించబడే వేగాన్ని తగ్గించే శక్తిని జామ ఆకులు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్
నిపుణుల ప్రకారం, టైప్–2 డయాబెటిస్ ఉన్నవారికి జామ ఆకులు కొంత మేలు చేస్తాయి. జామ ఆకుల్లోని కొన్ని సహజ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంటే శరీరం విడుదల చేసే ఇన్సులిన్‌ను కణాలు మెరుగ్గా ఉపయోగించుకునేలా సహాయం చేస్తాయి. అయితే ఇది ప్రతి వ్యక్తిలో ఒకేలా పనిచేస్తుందని మాత్రం చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మెరుగైన జీర్ణక్రియ వల్ల..
జామ ఆకుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియ ఉండటం వల్ల శరీరంలో పోషకాల శోషణ సక్రమంగా జరుగుతుంది. ఇది పరోక్షంగా షుగర్ నియంత్రణకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జామ ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్లు వాపు తగ్గించడంలో సహయపడతాయని సూచిస్తున్నారు.
మందులకు ప్రత్యామ్నాయం కాదు
చాలామంది జామ ఆకులను నేరుగా నమిలి తింటారు. లేదా కషాయం రూపంలో తీసుకుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, జామ ఆకులను శుభ్రంగా కడిగి, మితంగా ఉపయోగిస్తే ప్రమాదం ఏం ఉండదు. కానీ జామ ఆకులు మందులకు ప్రత్యామ్నాయం కాదు. డాక్టర్ సూచించిన డయాబెటిస్ మందులు ఆపేసి కేవలం జామ ఆకుల మీదే ఆధారపడటం ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ అనేది దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి, సరైన మందులు, ఆహార నియమాలు, వ్యాయామం తప్పనిసరని సూచిస్తున్నారు.
ఎక్కువ మోతాదులో తీసుకుంటే?
జామ ఆకులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి, గ్యాస్, అసౌకర్యం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే షుగర్ మందులు వాడుతున్నవారు, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జామ ఆకులను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

