Husband Psychology: భార్య మాట వినని భర్తల గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?
సాధారణంగా చాలామంది భర్తలు.. భార్య చెప్పిన మాట వినరు. అలాంటి వారిని చూసినప్పుడు వీరి తత్వమే అంతా, వీరికి మొండితనం, అహంకారం ఎక్కువని చాలామంది అనుకుంటారు. కానీ భార్య మాట వినకపోవడం వెనుక చాలా కారణాలు ఉంటాయని సైకాలజీ చెప్తోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Husband Psychology
మన చుట్టూ ఉండే వారిలో కొంతమంది భార్యా భర్తలు ఒకరి మాట మరొకరు వింటూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు మాత్రం భార్యల మాట అస్సలు వినరు. సైకాలజీ ప్రకారం ఇది మొండితనం లేదా అహంకారం మాత్రమే కాదు. చాలా సందర్భాల్లో దీని వెనుక లోతైన మానసిక కారణాలు, వ్యక్తిత్వ లక్షణాలు, గత అనుభవాలు దాగి ఉంటాయి. భార్య మాట వినని భర్తల గురించి సైకాలజీ ఏం చెప్తోందో ఇక్కడ చూద్దాం.
ఇదే ప్రధాన కారణం
సైకాలజీ ప్రకారం భార్య మాట భర్త వినకపోవడానికి ప్రధాన కారణం ఈగో, అధికార భావన. కొంతమంది పురుషులు పెరిగిన వాతావరణం వల్ల “ఇంట్లో నిర్ణయాలు భర్తే తీసుకోవాలి” అనే నమ్మకంతో ఎదుగుతారు. భార్య మాట వినడం అంటే తమ ఆధిపత్యం తగ్గిపోతుందన్న భయం వారికి తెలియకుండానే ఏర్పడుతుంది. ఈ భయం బయటకు కనిపించదు. నిజానికి ఇది బలమైన వ్యక్తిత్వం కాదు, లోపలి అసురక్షిత భావానికి సూచన.
భావాలను గుర్తించలేకపోవడం..
సైకాలజీ విశ్లేషణల ప్రకారం.. భావాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, స్పందించడం అనే నైపుణ్యం అందరిలో సమానంగా ఉండదు. కొంతమంది భర్తలు, భార్య చెప్పే మాటలను నస లాగా ఫీల్ అవుతారు. భార్య మాట వెనుక ఉన్న భావోద్వేగ అవసరాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆమె మాటలను పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇలాంటి వారు కావాలని అలా చేయరు. కానీ భావాలను గుర్తించే సామర్థ్యం వీరిలో తక్కువగా ఉంటుంది.
తండ్రిని చూసి నేర్చుకోవడం
ఒక వ్యక్తి బాల్యంలో తన తల్లి మాటను తండ్రి ఎప్పుడూ పట్టించుకోకపోయినా, అతను తెలియకుండానే ఆ విధానాన్ని అనుసరిస్తాడు. దీన్ని సైకాలజీలో “లెర్న్డ్ బిహేవియర్” అంటారు. అంటే, భార్య మాట వినకపోవడం అతనికి సహజమైన ప్రవర్తనలా అనిపిస్తుంది. ఇది తప్పు అని కూడా అతనికి అనిపించకపోవచ్చు.
భావోద్వేగ లోపం..
ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక బాధ్యతలు, సమాజ అంచనాల వల్ల కూడా కొంతమంది పురుషుల్లో భావోద్వేగాలు తగ్గిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో భార్య చెప్పే మాటలు కూడా వారికి అదనపు ఒత్తిడిలా అనిపిస్తాయి. ఫలితంగా, వారు వినకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది భార్యపై నిర్లక్ష్యం కాదు, కానీ సమస్యలను ఎదుర్కొనే మంచి పద్ధతి తెలియకపోవడమే.
కమ్యూనికేషన్ లోపం
సైకాలజీ ప్రకారం భార్య మాట వినకపోవడం అనేది చాలాసార్లు కమ్యూనికేషన్ లోపం కూడా కావొచ్చు. భార్య తన మాటను ఎలా చెబుతోంది? ఎప్పుడు చెబుతోంది? ఏ టోన్‌లో చెబుతోంది? అన్నదీ కూడా భర్తపై ప్రభావం చూపుతుంది. నిందించే ధోరణిలో పదే పదే ఒకే విషయాన్ని చెప్పినప్పుడు భర్త వినడం మానేయవచ్చు. అయితే సరైన అవగాహన, పరస్పర గౌరవం, ఓపికతో కూడిన సంభాషణ ఉంటే, సమస్యకు పరిష్కారం దొరుకుతుందందని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

