Health Tips: అల్లం ఎక్కువగా తింటే ఏమవుతుంది? ఎంత మోతాదులో తీసుకోవచ్చు?
అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఔషధ గుణాలు జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడంలో చక్కగా సహాయపడతాయి. అయితే అల్లాన్ని మోతాదుకు మించి తినడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

అల్లం ఎక్కువగా తింటే ఏమవుతుంది?
వంటల్లో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. అల్లం వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అల్లం జింజెరాల్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లంలోని ఈ గుణాలు వాంతులు, మలబద్ధకం, వాపు, ఒత్తిడి, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో చక్కగా సహాయపడతాయి. అందుకే చాలామంది అల్లాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే అల్లం తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ మోతాదుకు మించి తినడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
రక్త స్రావం :
అల్లం యాంటీ అలెర్జిక్ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి రక్తాన్ని పలుచగా చేస్తాయి. కాబట్టి రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడేవారు లేదా రక్తస్రావ సమస్యలు ఉన్నవారు అల్లం అతిగా తినడం అస్సలు మంచిదికాదు. దానివల్ల ఏ చిన్న గాయమైనా ఎక్కువ రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.
జీర్ణ వ్యవస్థపై ప్రభావం :
అల్లం జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ.. అతిగా తీసుకుంటే తీవ్రమైన కడుపు సమస్యలు వస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం అల్లం ఎక్కువగా తినడం వల్ల గుండెల్లో మంట, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ అల్లం తీసుకుంటే పొత్తికడుపు లోపలి లైనింగ్‌ను అది ప్రభావితం చేయవచ్చు.
అలెర్జీ :
కొంతమందికి అల్లం అలెర్జీని కలిగిస్తుంది. చర్మంపై మచ్చలు, దురద, ఎర్రగా మారడం, దద్దుర్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపించవచ్చు. ఇది శరీరంలో వేడి ఎక్కువ కావడం వల్ల జరుగుతుంది. అల్లం తిన్న తర్వాత మీకు ఏవైనా ఇలాంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
లో బీపి ఉన్నవారు
అల్లం రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు అల్లాన్ని అతిగా తీసుకోకూడదు. అలాగే షుగర్ ఉన్నవారు లేదా షుగర్ కోసం మందులు వాడేవారు అల్లాన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. లేకపోతే హార్ట్ బీట్ వేగం పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులున్నవారికి ఇది చాలా ప్రమాదకరం.
గర్భధారణ సమయంలో :
సాధారణంగా గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్‌నెస్, వాంతులు రాకుండా గర్భిణులు అల్లం తీసుకుంటారు. కానీ దాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి. అతిగా తీసుకుంటే గర్భస్రావం లేదా బిడ్డ పెరుగుదలపై ప్రభావం పడవచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో అల్లం తినే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
ఎంత మోతాదులో తీసుకోవచ్చు?
నిపుణుల ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 2 నుంచి 4 గ్రాముల వరకు అల్లం తీసుకోవచ్చు. అది తరిగిన అల్లం కావచ్చు. లేదా పేస్ట్ కావచ్చు. ఏదైనా సరే అంతకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదు.