- Home
- Life
- Health
- మినరల్ వాటర్‌ను క్యాన్‌లో ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు? క్యాన్‌ని ఎన్ని నెలలకోసారి మార్చాలి?
మినరల్ వాటర్‌ను క్యాన్‌లో ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు? క్యాన్‌ని ఎన్ని నెలలకోసారి మార్చాలి?
సరిపడా నీరు తాగితే ఒంట్లో ఉన్న సగం సమస్యలు తగ్గిపోతాయంటారు నిపుణులు. మన ఆరోగ్యానికి నీరు ఎంత అవసరమో ఈ ఒక్క మాట చాలు. అయితే వాటర్ తాగడం ఎంత ముఖ్యమో దాన్ని కరెక్టుగా నిల్వ చేయడం కూడా అంతే ముఖ్యం. మినరల్ వాటర్ నిల్వ గురించి కొన్ని విషయాలు మీకోసం.

Mineral water storage tips
మనం ఆరోగ్యంగా ఉండడానికి నీరు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం తాగే నీరు శుభ్రంగా ఉండాలంటే దాన్ని ఎలా నిల్వ చేస్తున్నామనే దానిపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. లేకపోతే చాలారకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. వాటర్ నిల్వ చేసే విధానాలపై మనలో చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. మినరల్ వాటర్ బాటిల్‌లో నీళ్లు ఎన్ని రోజులు మంచిగా ఉంటాయి? వాటర్ క్యాన్ లో ఎన్ని రోజులు నీళ్లు నిల్వ ఉంచవచ్చు? వాటర్ క్యాన్‌ను ఎన్ని నెలలకోసారి మార్చాలి? ప్లాస్టిక్ బాటిల్ వాడటం మంచిదా? లేక మెటల్ బాటిల్ వాడటం మంచిదా? వంటి విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మినరల్ వాటర్ బాటిల్
సాధారణంగా మార్కెట్‌లో దొరికే మినరల్ వాటర్ బాటిళ్లపై “Best Before 6 Months from Packaging” అని రాసి ఉంటుంది. అంటే సీల్ ఓపెన్ చేయకపోతే.. ఆ బాటిల్‌లో నీరు 6 నెలల వరకు సేఫ్‌గా ఉంటుంది. కానీ ఒకసారి సీల్ ఓపెన్ చేస్తే 24 గంటల్లోపే వాడటం మంచిది. ఎందుకంటే బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత బయట గాలి, బ్యాక్టీరియా లోపలికి వెళ్లి నీళ్లు కలుషితం చేసే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో బాటిల్‌ను ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉంచితే నీటిలో ప్లాస్టిక్ కెమికల్స్ చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ చల్లని ప్రదేశంలోనే ఉంచాలి.
వాటర్ క్యాన్ ఎన్ని రోజులు వాడవచ్చు?
ఇళ్లు లేదా ఆఫీస్ కోసం ఎక్కువ శాతం 20 లీటర్ల క్యాన్లను వాడుతుంటారు. అయితే చాలామంది 8 నుంచి 12 నెలల పాటు ఒకే క్యాన్‌ని వాడుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ప్లాస్టిక్ క్యాన్లు ఎక్కువకాలం వాడితే లోపల స్క్రాచ్‌లు ఏర్పడి, వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం 3–4 నెలలకొకసారి క్యాన్ ను మార్చాలి. వాడుతున్న క్యాన్‌ని రీఫిల్ చేయడానికి ముందు ప్రతిసారి సబ్బుతో బాగా కడగాలి. ఎక్కువకాలం వాడితే ప్లాస్టిక్ నాణ్యత తగ్గిపోతుంది. అప్పుడు నీటి వాసన, రుచి మారిపోతాయి. అంతేకాదు ఒకసారి క్యాన్ లో నీటిని నింపాక 2-3 రోజుల్లో కంప్లీట్ చేయడం మంచిది.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మంచిదా? కాదా?
ప్లాస్టిక్ బాటిల్స్ తేలికగా ఉంటాయి. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సౌకర్యంగా ఉంటాయి. అందుకే చాలామంది వీటిని వాడుతుంటారు. కానీ ప్లాస్టిక్ నాణ్యత చూడకుండా వాడితే ప్రమాదం ఉంటుంది. నాసిరకం ప్లాస్టిక్‌లోని రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బాటిల్‌ను వేడిలో ఉంచితే లేదా ఎక్కువసార్లు, ఎక్కువరోజులు వాడితే నీటిలో కెమికల్స్ కలిసే అవకాశాలు ఎక్కువ. దానివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు.
మెటల్ బాటిల్ మంచిదా? కాదా?
నిపుణుల ప్రకారం.. మెటల్ బాటిల్స్ (స్టీల్ లేదా కాపర్) ఆరోగ్యపరంగా చాలా సేఫ్. స్టెయిన్ లెస్ స్టీల్ బాటిల్‌లో నీళ్లు ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. రసాయనాలు కలిసే భయం ఉండదు. శుభ్రం చేయడం కూడా సులభం. కాపర్ బాటిల్‌లో నీళ్లు పోసి రాత్రంతా నిల్వ ఉంచి.. ఉదయం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. కానీ రోజంతా కాపర్ బాటిల్‌లోని నీళ్లు తాగడం కంటే ఉదయం ఒక్క గ్లాసు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మెటల్ బాటిల్స్ మళ్లీ మళ్లీ వాడటానికి బాగుంటాయి. కానీ వాటిని కూడా వాడిన ప్రతిసారీ శుభ్రం చేయాలి.