Health: ఏం పని చేయకపోయినా.. తరచూ అలసిపోతున్నారా.? మీకున్న సమస్య ఏంటంటే..
Health: మంచి నిద్ర, ఆరోగ్యం ఉన్నా కొందరిలో నిత్యం అలసట ఉంటుంది. పనిపై ఆసక్తి తగ్గిపోవడం, రోజంతా నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. అయితే ఇలా ఎక్కువ కాలం ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనత ఒక ప్రధాన కారణం
రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గితే శరీర భాగాలకు అవసరమైన ఆక్సిజన్ సరిగా చేరదు. దీని వల్ల బలహీనత, తల తిరగడం, ఊపిరి ఆడకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
విటమిన్లు తగ్గితే శక్తి కూడా తగ్గుతుంది
విటమిన్ B12, విటమిన్ D, విటమిన్ C, ఫోలేట్ లాంటి పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఇవి తగ్గితే కండరాల బలహీనత, ఏకాగ్రత లోపం, చిరాకు, మానసిక గందరగోళం కనిపిస్తాయి. చాలా మంది దీనిని సాధారణ అలసటగా పక్కన పెడతారు.
మానసిక ఒత్తిడి కూడా అలసటకు కారణం
నిత్యం ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగ భారం ఉండటం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. ఇది శరీర శక్తిని నెమ్మదిగా తగ్గిస్తుంది. చిరాకు, ఏ విషయంపైనా ఆసక్తి లేకపోవడం, అలసటగా అనిపించడం సాధారణ లక్షణాలు.
ఏ పోషకాలు తగ్గితే ఎక్కువగా అలసట వస్తుంది?
నిపుణుల మాట ప్రకారం ఐరన్, విటమిన్ B12, విటమిన్ D, మాగ్నీషియం శరీరంలో శక్తి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తగ్గితే ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుంది. చాలా కాలంగా ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

