Walking: ఒక్క నిమిషం నుంచి గంట వరకు వాకింగ్.. ప్రయోజనాలు ఇవే!
వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు. వాకింగ్ కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ప్రతి అడుగు శరీరానికి మేలు చేస్తుంది. ఒక్క నిమిషం నుంచి గంట వరకు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలెంటో ఇక్కడ చూద్దాం.

ఒక నిమిషం వాకింగ్ కూడా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు, ఇతర అవయవాలకు ఆక్సిజన్, పోషకాలను రక్తం ద్వారా సజావుగా అందించడానికి నడక సహాయపడుతుంది. ఐదు నిమిషాలు నడవడం వల్ల ఇంకా ఎక్కువ మార్పులు వస్తాయి. ఐదు నిమిషాలు నడిచినప్పుడు, మానసిక స్థితిని స్థిరీకరించే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నడక వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
15 నిమిషాలు నడిస్తే...
10 నిమిషాలు నడిస్తే శారీరక, మానసిక ఒత్తిడికి సంబంధించిన కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ఆందోళనను తగ్గించి మానసిక స్థితిని స్థిరీకరిస్తుంది. 15 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలను నివారించడానికి, డయాబెటిస్ ఉన్నవారు భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు నడవవచ్చు.
30 నిమిషాలు:
30 నిమిషాలు నడవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి, శరీర ఆకృతిని మెరుగుపరచడానికి 30 నిమిషాల నడక సహాయపడుతుంది. కేవలం 30 నిమిషాలు వేగంగా వాకింగ్ చేసేవారు బరువు తగ్గించే ప్రయాణంలో గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు.
45 నిమిషాలు:
45 నిమిషాల నడక శరీరానికి, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అంతసేపు నడవడం వల్ల అతిగా ఆలోచించడం తగ్గుతుంది. మనసు తేలిక పడుతుంది. ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలుగుతుంది.
60 నిమిషాలు:
60 నిమిషాలు నడిచినప్పుడు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక గంట నడక వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆనంద హార్మోన్ అయిన డోపమైన్ ఉత్పత్తి పెరుగుతుంది.
నడక ప్రయోజనాలు
వాకింగ్ శరీరం, మనస్సుకు మేలు చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ నడవడానికి ప్రయత్నించండి. మీరు 40 ఏళ్లు పైబడిన వారైతే, కనీసం 30 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. 30 ఏళ్లు దాటిన తర్వాత ఒక గంట నడవడం మంచిది.