దోమ కాటు వల్ల HIV వ్యాపిస్తుందా.?
పలు తీవ్ర అనారోగ్య సమస్యలకు దోమకాటు కారణమవుతుందని తెలిసిందే. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి వ్యాధులు ఎక్కువగా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతాయి. మరి హెచ్ఐవీ కూడా దోమకాటుతో వ్యాపిస్తుందా అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా.?

HIV అంటే ఏంటి?
HIV (Human Immunodeficiency Virus) అనేది ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ (Immune System) ను బలహీనపరుస్తుంది. దీని వల్ల మన శరీరం సాధారణ ఇన్ఫెక్షన్లకు, వ్యాధులకు ఎదుర్కోలేకపోతుంది. HIV ఇన్ఫెక్షన్‌ను సమయానికి చికిత్స చేయకపోతే, అది క్రమంగా AIDS (Acquired Immunodeficiency Syndrome) గా మారుతుంది.
KNOW
దోమలు HIVని వ్యాప్తి చెందిస్తాయా.?
దోమల కారణంగా హెచ్ఐవీ వ్యాపిస్తుందా అనే సందేహం ఉండే ఉంటుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం దోమ ఒక HIV పాజిటివ్ వ్యక్తిని కుట్టినప్పుడు, కొంత రక్తం దోమ కడుపులోకి వెళుతుంది. HIV వైరస్ దోమ శరీరంలో వృద్ధి చెందలేదు. రక్తాన్ని జీర్ణం చేసే సమయంలో, సాధారణంగా 1–2 రోజుల్లోనే వైరస్ నశిస్తుంది. అందువల్ల దోమ మరొకరిని కుట్టినా, HIV అక్కడి నుంచి రక్తంలోకి ప్రవేశించదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), CDC (Centers for Disease Control and Prevention) కూడా “దోమల ద్వారా HIV వ్యాప్తి చెందదు” అని స్పష్టంగా ప్రకటించాయి.
మరి మలేరియా, డెంగ్యూ ఎందుకు వ్యాపిస్తాయి?
డెంగ్యూ, మలేరియా, జికా, చికున్‌గున్యా వైరస్‌లు దోమ శరీరంలో పెరుగుతాయి. అవి దోమ లాలాజలంలో చేరతాయి. తర్వాత దోమ మరొకరిని కుట్టినప్పుడు, ఆ లాలాజలం ద్వారా వ్యాధి కొత్త వ్యక్తికి చేరుతుంది. కానీ HIV విషయంలో ఇది జరగదు. దోమ శరీరం HIV కు సహజమైన వాతావరణం కాదు.
దోమల వల్ల కలిగే ముప్పు ఎంత?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది దోమల కారణంగా చనిపోతున్నారు. మలేరియా ఒక్కదానివల్లే లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ కారణంగా దోమలను “ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాణి” (Most Dangerous Animal) అని పిలుస్తారు.
జాగ్రత్తలు తప్పనిసరి
HIV దోమల ద్వారా వ్యాపించకపోయినా, ఇతర ప్రాణాంతక వ్యాధులు మాత్రం దోమల ద్వారా వ్యాపిస్తాయి. అందువల్ల. ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మస్కిటో నెట్, రిపెలెంట్స్ వాడాలి. రాత్రిళ్లు చర్మం పూర్తిగా కప్పుకునే బట్టలు ధరించాలి. పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.