Monsoon Tips: వర్షాకాలంలో అలసటగా, బద్ధకంగా ఉంటోందా? యాక్టివ్‌గా మారాలంటే..
Monsoon Survival Hacks: వర్షాకాలంలో ఉదయాన్నేలేచినా, బయటకు వెళ్లినా, ఇతర ఏ పనులు చేసినా బద్ధకంగా ఉంటుందా? మీరు చేయగలిగే పనులే అయినా బద్దకంతో చేయలేకపోతున్నారా? అయితే.. మీ శరీరాన్ని రీసెట్ చేయాలని అర్థం. యాక్టివ్ గా మారాలంటే..ఈ చిట్కాలు పాటించండి.

చీకటికి దూరంగా
వర్షం పడుతున్నప్పుడు వెలుతురు తక్కువగా ఉండటం వల్ల మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ నిద్రపోయేలా ప్రేరేపిస్తుంది. దీన్ని నివారించడానికి ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి పెట్టండి. ఒకవేళ వెలుతురు తక్కువగా ఉంటే.. లైట్లు వేసుకోండి. వర్షం తగ్గిన తర్వాత కొంతసేపు బయటకు వెళ్లి ఎండలో ఉండండి. ఇలా మీ మీ శరీరాన్ని, మైండ్ ను రీసెట్ చేసుకోండి.
యాక్టివ్‌గా ఉండండి
వర్షాకాలంలో చలిగా ఉండటం వల్ల దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. కానీ, శారీరక శ్రమ లేకపోవడం వల్ల సోమరితనం పెరుగుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి రోజూ వ్యాయామం చేయండి. ఇంట్లోనే నడుస్తూ ఫోన్ మాట్లాడటం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, మెట్లు ఎక్కి దిగడం, యోగా చేయడం, పాటలు వింటూ డాన్స్ చేయడం వంటివి చేయండి. ఇవి మీ కండరాలను చురుగ్గా ఉంచి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
ఆహారం పట్ల శ్రద్ధ
వర్షాకాలంలో నూనె పదార్థాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది. కానీ, అవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. సోమరితనం, బద్దకంగా అనిపిస్తుంది. వాటి బదులు కూరగాయల సూప్, పప్పులు, పండ్లు, సలాడ్లు, ఉడికించిన కూరగాయలు వంటివి తినడం బెటర్. ఇవి శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చి సోమరితనాన్ని పోగొడతాయి. వెచ్చని నీరు, హెర్బల్ టీలు, సూప్‌లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి.
రిఫ్రెషింగ్ పెర్ఫ్యూమ్‌లు
వర్షకాలంలో ఇంటిని ఎంత శుభ్రం చేసిన వాసనను వదిలించుకోవడం కష్టమే. ఈ వాసనలు పోగొట్టడానికి పెర్ఫ్యూమ్స్ వాడవచ్చు. ఇవి మెదడును ఉత్తేజపరిచి, ఉత్సాహాన్ని పెంచుతాయి. నిమ్మ, పుదీనా, రోజ్మేరీ వంటి వాసన ద్రవ్యాలను డిఫ్యూజర్‌లో వేసి ఉపయోగించవచ్చు లేదా కాటన్‌లో వేసి పీల్చుకోవచ్చు. అలాగే రిప్రెషమెంట్ కోసం చల్లటి నీటిని ముఖంపై చల్లుకోవడం లేదా చల్లటి నీటితో చేతులు కడుక్కోవడం వంటి చేయాలి.
సరైన నిద్ర
వర్షాకాలంలో అలసటగా, బద్దకంగా ఉండటం చాలా కామన్. ఈ సీజన్ లో తరుచూ నిద్రపోవాలనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల సోమరితనం మరింత పెరుగుతుంది. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. పగటిపూట బద్దకంగా అనిపిస్తే.. 20-30 నిమిషాల పాటు ఓ కునుకు వేయండి. 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోతే సోమరితనం మరింత పెరుగుతుంది.

