- Home
- Life
- Food
- Tamarind Leaves : పొలంగట్లపై దొరికే మామూలు ఆకుకూర మటన్ కంటే కాస్ట్లీ.. కిలో ధరెంతో తెలుసా?
Tamarind Leaves : పొలంగట్లపై దొరికే మామూలు ఆకుకూర మటన్ కంటే కాస్ట్లీ.. కిలో ధరెంతో తెలుసా?
అడవుల్లో సహజంగా పెరిగే ఓ చెట్టు కొందరికి వేలకు వేల ఆదాయాాన్ని తెచ్చిపెడుతోంది… మరికొందరి ఆరోగ్యాన్ని కాపాడుతోంది. ఆ చెట్టు లేత చిగురు ధర మటన్ కంటే ఎక్కువగా ఉంది. ఇంతకూ ఆ చెట్టు ఏదో తెలుసా?

ఈ చెట్టు చిగురుకు యమ కాస్ట్లీ గురూ...
Tamarind Leaves : కూరగాయాల ధరలు మండిపోతున్నాయి... సగటు మధ్యతరగతి కుటుంబంలో తరచూ వినిపించే మాటిది. కిలో టమాటా ధర 100 రూపాయలు దాటితే అది సెన్సేషనల్ న్యూస్... ప్రజలంతా దీనిగురించే మాట్లాడుకుంటారు. ఉల్లిపాయల ధర కాస్త అటుఇటైనా ఇదే పరిస్థితి. చివరకు రాష్ట్ర ప్రభుత్వాలనే ఈ కూరగాయల ధరలు షేక్ చేస్తుంటాయి... ఇలా పెరిగిన ధరలపై సీఎంలు, పీఎంలు మాట్లాడటం… ధరలను తగ్గిస్తామని హామీలివ్వడం చూస్తుంటాం.
అయితే ప్రస్తుతం ఓ సాధారణ ఆకుకూర ఏకంగా మటన్ ధరతో పోటీ పడుతోంది. ఇంకా చెప్పాలంటే అది ఆకుకూర కూడా కాదు... పొలంగట్లపై ఊరికే పెరిగే చెట్టు చిగురు. ఆ చెట్ల లేత చిగురు కిలో ఏకంగా రూ.500 నుండి రూ.1000 పలుకుతోంది. ఇదేదో ఔషద గుణాలున్నదో, విదేశాల నుండి దిగుమతి చేసుకున్న చెట్టో కాదు... మన పల్లెల్లో బీడుభూములు, పొలంగట్లపై సాధారణంగా కనిపించే చింతచెట్టు. ఈకాలంలోనే ఈ చెట్లు చిగురు పెడతాయి... అందుకే దీని ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ చిగురే మటన్ కంటే ఎక్కువ ధర పలుకుతోంది.
చింతచిరుగురుకు ఎందుకింత ధర?
సాధారణంగా వేసవిలో చింతచెట్ల ఆకులన్ని రాలిపోయి వర్షాలు ప్రారంభమయ్యే ముందు మళ్లీ చిగురిస్తాయి... అంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో చింతచిగురు లభిస్తుంది. చింతకాయ మాదిరిగానే లేత చింతచిగురు కూడా పుల్లపుల్లగా ఉండి ఆహారానికి మంచి రుచిని ఇస్తుంది. అందుకే ఈ చింతచిగురును వండుకుని తింటారు... ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చింతచిగురుతో రకరకాల వంటకాలు చేసుకుంటారు.
ఊరికే పొలంగట్లపై పెరిగే చెట్లకే లభించినప్పటికీ ఈ చింతచిగురు సేకరించడం చాలా కష్టమైన పని. చిటారుకొమ్మల్లో ఉండే చిగురును చాలా జాగ్రత్తగా కోయాల్సిఉంటుంది... చిన్నచిన్నగా ఉండే ఈ చిగురును గంటలతరబడి తెంపాల్సి ఉంటుంది. ఇది బరువు కూడా ఎక్కువగా ఉండదు... కాబట్టి కిలో చింతచిగురు సేకరించాలన్నా గంటలకు గంటలు శ్రమించాలి. అందుకే దీనికింత ధర.
చింతచిగురు ధర పెరగడానికి కారణాలివే...
చింతచిగురులో అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి... ఇవి ఎన్నో వ్యాధులను ధరిచేరనివ్వకుండా చూస్తాయి. అంతేకాదు ఉన్న రోగాలను నయం చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీన్ని ఓ మెడిసిన్ లా భావిస్తారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం... కాబట్టి చింతచిగురును కొనేవారు రోజురోజుకు పెరుగుతున్నారు... అందుకే దాని ధర కూడా పెరుగుతోంది.
ఒకప్పుడు అడవులు, పొలంగట్లపై విరివిగా చింతచెట్లు ఉండేవి... దీంతో చింతచిగురు ఎక్కువగా లభించేది. కానీ ప్రస్తుతం ఈ చెట్లు బాగా తగ్గాయి... కాబట్టి ఈ చిగురు ఎక్కువగా లభించడంలేదు. ఇదికూడా చింతచిగురు ధర పెరగడానికి మరోకారణం.
చింతచిగురు కేవలం రెండుమూడు నెలలు మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఉన్నప్పుడే దీన్ని ఎక్కువగా కొంటుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువ ఉంటుంది కాబట్టి ధర ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి దీని ధర మటన్ ను కూడా తలదన్ని కిలో 1000-1200 కూడా పలుకుతుంది.
చింతచిగురు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే...
1. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది
పుల్లపుల్లగా ఉండే ఈ చింతచిగురు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఎక్కువగా దీన్ని తినడంవల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని ఎక్కువగా తింటారు.
2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
చింతచిగురు తినడంవల్ల జీర్ణక్రియకు ఎన్నో లాభాలున్నాయి. ఇది ఈజీగా అరుగుతుంది... అంతేకాదు మలబద్దకాన్ని నివారిస్తుంది. ఆహారాన్ని జీర్ణంచేసే డైటరీ ఫైబర్స్ చింతచిగురులో పుష్కలంగా ఉంటాయి.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
చింతచిగురు తినడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో వుండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షించే రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తాయి. అందువల్లే చింతచిగురుకు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతుంటారు.
చింతచిగురుతో ఎన్ని హెల్త్ బినిఫిట్సో..
4. కాలేయానికి మంచిది
కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి చింతచిగురు మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే కాలేయ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
5. కీళ్ళనొప్పులు తగ్గిస్తుంది
కీళ్లనొప్పులతో బాధపడేవారికి చింతచిగురు బాగా పనికివస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలు ఉంటాయి... ఇవి కీళ్లనొప్పులను తగ్గిస్తాయి.
ఇక రక్తహీనతను తగ్గించడం, రక్తాన్ని శుద్దిచేయడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించడం, గొంతునొప్పిన తగ్గించడం వంటి అనేక లక్షణాలు చింతచిగురులో ఉన్నాయి. రుచికరంగా ఉండటమే కాదు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే చింతచిగురుకు ఇంత డిమాండ్. చికెన్, మటన్ కంటే ఎక్కువ ధర ఉన్నా జనాలు కొంటున్నారు... ఇష్టంగా తింటున్నారు... హెల్తీగా ఉంటున్నారు.