- Home
- Life
- Food
- Sweet Corn Vs Native Corn : విదేశీ స్వీట్ కార్న్, స్వదేశీ మొక్కజొన్నల్లో ఏది బెస్ట్ ఫుడ్? దేంట్లో బలం ఎక్కువ?
Sweet Corn Vs Native Corn : విదేశీ స్వీట్ కార్న్, స్వదేశీ మొక్కజొన్నల్లో ఏది బెస్ట్ ఫుడ్? దేంట్లో బలం ఎక్కువ?
విదేశాలకు చెందిన స్వీట్ కార్న్, దేశీయ నాటు మొక్కజొన్నలు.. ఈ రెండింటిలో ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి? రెండింటిని 100 గ్రాముల చొప్పున తీసుకుని దేనిలో ఏ పోషకాలు, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుందాం.

స్వీట్ కార్నా? నాటు మొక్కజొన్నలా?
Sweet Corn Vs Native Corn : మొక్కజొన్న అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కాస్త గట్టిగా ఉండే దేశీయ మొక్కజొన్నే. కాానీ ఇప్పుడు పట్టణాల్లో, సూపర్ మార్కెట్లలో, ఫుడ్ స్టాళ్లలో స్వీట్ కార్న్‌కు కూడా భారీగా డిమాండ్ ఉంది. ఉడికించి, నేరుగా మంటలో కాల్చి తినడమేకాదు సలాడ్లు, సూప్‌లు, పిజ్జాలు, చాట్‌లలోనూ స్వీట్ కార్న్ వాడుతున్నారు. తియ్యగా, మెత్తగా ఉండటంతో పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. మరోవైపు మన దేశీయ మొక్కజొన్నను కూడా కాల్చుకుని తినడం నుంచి పిండి, రొట్టెలు, వివిధ వంటకాల తయారీ వరకు ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు.
అయితే రుచి, వాడకం విషయంలోనే కాదు.. పోషక విలువల పరంగా ఈ రెండింటి మధ్య తేడా ఉందా? విదేశీ స్వీట్ కార్న్‌లో ఎక్కువ బలం ఉంటుందా? లేక మన దేశీయ మొక్కజొన్నలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయా? అసలు ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఈ రెండు రకాల మొక్కజొన్నల మధ్య అసలు తేడా ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.
స్వీట్ కార్న్ vs నాటు మొక్కజొన్న... ప్రోటీన్లు దేంట్లో ఎక్కువ?
100 గ్రాములు వండిన తర్వాత…
నాటు మొక్కజొన్నలు : సుమారు 4.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
స్వీట్ కార్న్: సుమారు 3.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
అంటే నాటు మొక్కజొన్నల్లో ప్రోటీన్ కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఇది మరీ అంత పెద్ద తేడా ఏమీ కాదు. మనం తినే ఆహారాన్ని ఎంచుకునేటప్పుడు కేవలం ప్రోటీన్ మాత్రమే చూడకూడదు. మన రోజువారీ భోజనంలో పప్పులు, గుడ్లు, పాలు, పెరుగు లాంటి ఇతర ప్రోటీన్ ఫుడ్స్ ఎంత తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యమే.
స్వీట్ కార్న్ vs నాటు మొక్కజొన్న.. ఫైబర్‌లో ఏమైనా తేడా ఉందా?
ఇక్కడా నాటు మొక్కజొన్నలు పైచేయి సాధిస్తాయి. 100 గ్రాములు వండిన దేశీయ మొక్కజొన్నల్లో సుమారు 4.1 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) ఉంటుంది. అదే వండిన స్వీట్ కార్న్‌లో అయితే 2.4 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉంటుంది.
ఫైబర్ మన జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్.. పిండిపదార్థాలు త్వరగా అరిగిపోకుండా అడ్డుకుంటుంది. కాబట్టి మీకు ఫైబర్ ఎక్కువగా కావాలంటే నాటు మొక్కజొన్నలు తినడమే బెస్ట్.
స్వీట్ కార్న్ vs నాటు మొక్కజొన్న..క్యాలరీలు దేంట్లో ఎక్కువ?
ఇక్కడ మనం ఊహించని తేడా ఒకటి ఉంది.
100 గ్రాములు వండిన తర్వాత…
నాటు మొక్కజొన్నలు : సుమారు 143 క్యాలరీలు ఉంటాయి.
స్వీట్ కార్న్ : సుమారు 96 క్యాలరీలు ఉంటాయి.
అంటే ఒకే బరువు తీసుకున్నా నాటు మొక్కజొన్నల్లోనే క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాటు జొన్నలను ఎండిన తర్వాత వండుతారు. వండిన తర్వాత అందులో ఉండే నీటి శాతం, వండే విధానం బట్టి పోషకాల స్థాయి మారుతుంది.
స్వీట్ కార్న్ vs నాటు మొక్కజొన్న.. విటమిన్లు, మినరల్స్ దేంట్లో ఎక్కువ?
నాటు మొక్కజొన్నల్లో మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, బి-విటమిన్లు లాంటి పోషకాలు చాలానే ఉంటాయి. ఇది తృణధాన్యం కాబట్టి పొట్టు, మొలక లాంటి భాగాలు కూడా ఇందులో ఉంటాయి.
స్వీట్ కార్న్‌లో కూడా పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ సి, కొన్ని బి-విటమిన్లు దొరుకుతాయి. కాబట్టి ఈ రెండూ బలమైన ఆహారాలే. కానీ, తృణధాన్యంగా తినే నాటు మొక్కజొన్నల్లో ఫైబర్, కొన్ని రకాల మినరల్స్ కాస్త ఎక్కువగా దొరుకుతాయి.
మరి దేన్ని తినడం బెస్ట్?
ఫైబర్ + ప్రోటీన్ + తృణధాన్యాల బలం కావాలంటే - నాటు మొక్కజొన్నలు తినండి.
క్యాలరీలు తక్కువగా ఉండి, కూరగాయల్లా తినే ఫుడ్ కావాలంటే - స్వీట్ కార్న్ ఎంచుకోండి.
అయితే ఒకదాని కంటే మరొకటి మంచిది, చెడ్డది అని మనం చెప్పలేం. స్వీట్ కార్న్ తియ్యగా ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదనుకోవడం కూడా పొరపాటే. మనం ఎంత తింటున్నాం, ఎలా వండుతున్నాం అనేదే ఇక్కడ ముఖ్యం. ప్రాసెస్ చేయని తృణధాన్యాలు, కూరగాయలు లాంటి మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ఎప్పుడూ మంచిదే.
ఒక్క మాటలో చెప్పాలంటే
స్వీట్ కార్న్ - తక్కువ క్యాలరీలు ఉండే టేస్టీ కూరగాయ.
నాటు మొక్కజొన్నలు - ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే తృణధాన్యం.
ఈ రెండింటినీ సరైన మోతాదులో మీ డైట్‌లో చేర్చుకోవచ్చు.

