మామిడి పండు తినడానికి సరైన సమయం ఏంటి.? తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Mango: మామిడిని చిన్నా పెద్దా అందరూ ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది ఎక్కువగా మామిడి తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. కానీ సమస్య మామిడిలో కాదు.. దాన్ని తినే విధానంలోనే ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మామిడి తింటే కడుపులో సమస్య ఉంటుందా.?
మామిడిలో సహజ చక్కెరలు (నేచురల్ షుగర్), ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఒకేసారి ఎక్కువ మామిడి పండ్లు తింటే జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల మామిడిని త్వరగా పక్వానికి తెచ్చేందుకు కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. అలాంటి పండ్లు తింటే కడుపులో ఇన్ఫెక్షన్లు, మలబద్ధకం లేదా కడుపు మెలికలు వంటి సమస్యలు రావచ్చు.

తినే ముందు నీటిలో నానబెట్టాలి..
మామిడిని తినే ముందు కనీసం ఒకటి నుంచి రెండు గంటల పాటు చల్లటి నీటిలో నానబెట్టడం మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల పండులో ఉండే అధిక వేడి ప్రభావం కొంత తగ్గుతుంది. అలాగే పండు పైభాగంలో ఉండే దుమ్ము, రసాయన అవశేషాలు కూడా తొలగిపోతాయి. దీంతో మామిడి మరింత సురక్షితంగా తినవచ్చు. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
ఎంత మోతాదులో తింటే మంచిది?
మామిడి రుచిగా ఉంటుందని ఒకేసారి ఎక్కువగా తినడం మంచిది కాదు. రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లు తింటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా తింటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు మితంగా మాత్రమే తీసుకోవాలి.
మామిడి తినడానికి సరైన సమయం ఏది?
ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్న భోజనం సమయంలో మామిడి తినడం ఉత్తమం. ఈ సమయంలో శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోగలదు. రాత్రి నిద్రపోయే ముందు మామిడి తినడం మంచిది కాదు. ఇలా చేస్తే జీర్ణక్రియ మందగించి కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శరీర బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
పాలు, పెరుగుతో మామిడి కలిపి తినవచ్చా?
ఆయుర్వేదం ప్రకారం పుల్లని మామిడిని పాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. అయితే పూర్తిగా పండిన తీపి మామిడితో మిల్క్‌షేక్ తయారు చేసి తాగవచ్చు. మామిడి మిల్క్‌షేక్ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా వేసవిలో చల్లదనాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే పెరుగుతో కలిసి మామిడి తీసుకోవడం కూడా కొందరికి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

