Beauty tips: మిగిలిన పెరుగును ఇలా వాడితే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
మనలో చాలామందికి పెరుగు లేకుండా భోజనం పూర్తికాదు. అయితే కొన్నిసార్లు ఇంట్లో పెరుగు మిగిలిపోతుంటుంది. మరుసటి రోజుకు పుల్లగా మారుతుంది కాబట్టి చాలామంది దాన్ని పారబోస్తుంటారు. కానీ మిగిలిన పెరుగుతో అందాన్ని కాపాడుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.

పెరుగును ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు?
పెరుగు.. ప్రతి ఇంట్లో ఉండే ముఖ్యమైన ఆహార పదార్థం. పెరుగును నేరుగా తీసుకోవడంతో పాటు చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. భోజనం చేసినప్పుడు చివర్లో పెరుగుతో తింటేనే తృప్తిగా అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు పెరుగు మిగిలిపోతుంటుంది. మరుసటి రోజుకు ఆ పెరుగు తినడానికి పనికిరాదని పారబోస్తుంటాం. కానీ మిగిలిన పెరుగుని పారబోయకుండా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు.
చర్మ కాంతికి..
పెరుగులో కొంచెం పంచదార, తేనె, ఓట్స్ కలిపి ముఖానికి పట్టించాలి. ఇది మృత కణాలను తొలగించడానికి స్క్రబ్ లా పనిచేస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చనిపోయిన కణాలను తొలగిస్తుంది. పంచదార, ఓట్స్ ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి ఉపయోగపడతాయి.
కొత్త పెరుగు తయారీకి..
మిగిలిన లేదా పాత పెరుగుతో కొత్త పెరుగు తయారు చేసుకోవచ్చు. గోరువెచ్చని పాలలో పాత పెరుగు కలిపితే చాలు.. కొత్త పెరుగు తయారవుతుంది.
హెయిర్ మాస్క్
మిగిలిన పెరుగుని పారబోయకుండా హెయిర్ మాస్క్ గా వాడుకోవచ్చు. పెరుగులో అరటిపండు గుజ్జు, ఆలివ్ ఆయిల్, తేనె కలిపి తలకు రాసుకుని 20-30 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది జుట్టుని మృదువుగా, ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.
మొటిమలను తగ్గిస్తుంది :
పెరుగులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందుకు పెరుగులో పసుపు లేదా వేప పొడి కలిపి ముఖానికి పట్టించి కొంత సేపటి తర్వాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
పాదాలకు మంచిది
పాదాలు పొడిబారిపోతే వాటిని మృదువుగా చేయడానికి ఈ పెరుగును వాడుకోవచ్చు. వేడి నీటిలో కొంచెం పెరుగు కలిపి, అందులో పాదాలను 20 నిమిషాలు ఉంచాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ పాదాలను మృదువుగా, తేమగా ఉంచుతుంది.
ఎండ నుంచి రక్షణ
ఎండ వల్ల దెబ్బతిన్న చర్మానికి పెరుగు చక్కగా ఉపయోగపడుతుంది. పెరుగులోని యాంటీ అలెర్జిక్, చల్లని గుణాలు చర్మం వాపు, దురద, ఎరుపును తగ్గిస్తాయి. దీనికోసం నేరుగా పెరుగుని చర్మానికి రాసుకోవచ్చు.