Food: అబ్బబ్బా.. వేడి వేడి పూరి, చల్లటి మ్యాంగో జ్యూస్. రుచి చూస్తే స్వర్గమే
Food: సమ్మర్‌లో ఎండలు దంచికొట్టినా మామిడి పండ్లు ఉంటాయని సంతోషిస్తుంటాం. ఈ పండ్ల రుచి అలా ఉంటుంది మరి. మామిడి పండ్లతో రకరకలా వంటకాలు చేసుకుంటారు. అలాంటి వాటిలో ఆమ్‌రస్ పూరీ (పూరీ-మ్యాంగో జ్యూస్) ఒకటి.

ఆమ్‌రస్ పూరీ
వేసవి అంటే మామిడి సీజన్. ఈ సమయంలో ఆమ్‌రస్ పూరీ కాంబినేషన్ అంటే చాలా మందికి ఫేవరెట్. వేడి వేడి పూరీని చల్లని మ్యాంగో జ్యూస్‌లో ముంచి తింటే వచ్చే రుచి ప్రత్యేకం. ఇప్పుడు దీన్ని సులభంగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
ఆమ్‌రస్ కోసం:
* పండిన మామిడిపండ్లు – 2 నుంచి 3 (అల్ఫాన్సో అయితే ఇంకా రుచిగా ఉంటుంది)
* పాలు – ¼ కప్పు
* ఐస్ క్యూబ్స్ – 4 నుంచి 5
* కుంకుమపువ్వు – 6 నుంచి 8 తంతులు
* పౌడర్ చక్కెర – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
* యాలకుల పొడి – ¼ టీస్పూన్
పూరీ కోసం:
* గోధుమ పిండి – 1 కప్పు
* ఉప్పు – కొద్దిగా
* నూనె – 1 టీస్పూన్
* నీరు – అవసరమైనంత
* వేయించడానికి నూనె
ఆమ్‌రస్ తయారీ విధానం
ముందుగా మామిడిపండ్లను తొక్క తీసి ముక్కలుగా కోయాలి. వాటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి స్మూత్ ప్యూరీలా చేసుకోవాలి. ఆ తర్వాత పాలు, కుంకుమపువ్వు, చక్కెర, యాలకుల పొడి, ఐస్ క్యూబ్స్ వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి. ఇది క్రీమీగా, చల్లగా తయారవుతుంది. ఇంకా మంచి రుచి కోసం ఫ్రిజ్‌లో కొంతసేపు పెట్టుకోవచ్చు.
పూరీ తయారీ విధానం
గోధుమ పిండి, ఉప్పు, నూనె కలిపి నీరు కొద్దిగా పోస్తూ గట్టిగా పిండి కలుపుకోవాలి. ఈ పిండిని మూతపెట్టి 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పలుచగా కాకుండా చిన్న డిస్క్‌లా వత్తాలి. వేడినూనెలో వేసి గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
తయారీలో గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు
మామిడిపండ్లు బాగా పండినవి తీసుకుంటే రుచి బాగుంటుంది. పాలు ఎక్కువగా వేయకూడదు. క్రీమీ టెక్స్చర్ కోసం సరిపడా చాలు. పూరీ పిండి గట్టిగా ఉండాలి, అప్పుడు పూరీలు బాగా పూస్తాయి. హాట్ పూరీతో పాటు చల్లని ఆమ్ రస్ (మ్యాంగో జ్యూస్) కాంబినేషన్‌లోనే అసలు టేస్ట్ ఉంటుంది

