Expensive Fruits: కిలో మామిడి ధర రూ. 2 లక్షలు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు ఇవే
Expensive Fruits: కివీ వంటి పండ్లే ఖరీదైనవని మనం అనుకుంటాం. కానీ లక్షల రూపాయల్లో పలికే పండ్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? వాటి సాగు విధానం, అరుదైన లభ్యత కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తైయో నో తమాగో మామిడి – ఎగ్ ఆఫ్ ది సన్
తైయో నో తమాంగో మ్యాంగోను “ఎగ్ ఆఫ్ ది సన్” అని కూడా పిలుస్తారు. ఇది జపాన్‌లోని మియాజాకి ప్రాంతంలో పండుతుంది. ఈ మామిడి గాఢ ఎరుపు రంగులో ఉండి చాలా తీపిగా ఉంటుంది. ఆకర్షణీయమైన రూపం కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా గుర్తింపు పొందింది. కొన్ని సందర్భాల్లో దీని ధర కిలోకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు కూడా ఉంటుంది.
యుబారి మెలన్ – ప్రపంచంలోనే ఖరీదైన పండు
యుబారి మెలన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. ఇది జపాన్‌లోని హొక్కైడో ప్రాంతంలో పండిస్తారు. ఈ పండును ప్రత్యేక గ్రీన్ హౌస్‌లలో పెంచుతారు. ప్రతి పండును ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తారు. దీని తీపి రుచి, సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొన్నిసార్లు రెండు యుబారి మెలన్ల జత ధర లక్షల రూపాయల వరకు పలుకుతుంది.
స్క్వేర్ వాటర్‌మిలాన్ – ఆకారమే ప్రత్యేకం
స్క్వేర్ వాటర్‌మిలాన్ సాధారణ పుచ్చకాయలాగే ఉంటుంది. కానీ దీన్ని ప్రత్యేకంగా చతురస్రాకార బాక్స్‌లలో పెంచుతారు. అందువల్ల ఇది స్క్వేర్ ఆకారంలో తయారవుతుంది. ఈ పండును ఎక్కువగా అలంకరణ కోసం, లగ్జరీ గిఫ్ట్‌లుగా ఉపయోగిస్తారు. దీని ధర సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుంది.
డెన్సుకే వాటర్‌మెలన్ – అరుదైన నల్ల పుచ్చకాయ
డెన్సుకే వాటర్‌మెలన్ నల్లటి రంగులో ఉండే అరుదైన పుచ్చకాయ. ఇది కూడా జపాన్‌లోనే పండుతుంది. ఈ పండు చాలా తీపిగా ఉండటంతో పాటు మార్కెట్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. అందువల్ల దీని ధర కూడా లక్షల్లో ఉంటుంది.
రూబీ రోమన్ ద్రాక్ష
రూబీ రోమన్ ద్రాక్ష పెద్ద పరిమాణంలో ఉండే ఎర్రటి ద్రాక్ష పండ్లు. ప్రతి ద్రాక్ష గింజ నాణ్యతను ప్రత్యేకంగా పరీక్షించిన తర్వాతే మార్కెట్లో విక్రయిస్తారు. ఇవి చాలా తీపిగా ఉండటంతో లగ్జరీ ఫ్రూట్‌గా పేరుగాంచాయి. ఒక ద్రాక్ష గుత్తి ధర లక్షల రూపాయలకు చేరిన సందర్భాలు ఉన్నాయి.
హెలిగన్ పైనాపిల్ – రెండేళ్లు పట్టే ప్రత్యేక పండు
హెలిగన్ పైనాపిల్ ఇంగ్లాండ్‌లోని ప్రత్యేక తోటల్లో పండించే అరుదైన అనాస పండు. ఇది పూర్తిగా పెరగడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది. ప్రత్యేక పద్ధతుల్లో సాగు చేయడం వల్ల ఇది చాలా అరుదుగా లభిస్తుంది. దీని ధర సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుంది.

